Tuesday, April 23, 2024

త్వరలో టెట్ నోటిఫికేషన్?

- Advertisement -
- Advertisement -

Notification for Teacher Eligibility Test (TET) will be issued soon

 

మూడేళ్ల తర్వాత మళ్లీ పరీక్ష
టీచర్ పోస్టుల నోటిఫికేషన్‌కు ముందే నిర్వహణ
ఉపాధ్యాయ నియామకాల్లో
టెట్ మార్కులకు 20% వెయిటేజీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. 50 వేల ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, అందులో టీచర్ పోస్టులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో గురుకులాలు, పాఠశాల విద్యాశాఖలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడానికి ముందే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. టెట్ నిర్వహించకుండా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయవద్దని నిర్ణయించినట్లు సమాచారం. ఇదివరకు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టిఆర్‌టి) నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా టెట్ నిర్వహించారు.

నిరుద్యోగ అభ్యర్థులు గురుకుల టీచర్ పోస్టులకుగానీ, టిఆర్‌టికి గానీ దరఖాస్తు చేసుకునేందుకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఏడాదికి రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇప్పటివరకు ఆరు సార్లు మాత్రమే నిర్వహించారు. రాష్ట్రంలో 2017 జూలై 23 తర్వాత ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది.

ముగిసిన మూడు టెట్‌ల వ్యాలిడిటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన టెట్‌తో కలిపి మొత్తం ఆరు సార్లు టెట్ నిర్వహించగా, అందులో మూడు టెట్‌ల వ్యాలిడిటీ ముగిసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఇ) నిబంధనల మేరకు 2011 జూలై 1వ తేదీన ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం మొదటి టెట్ నిర్వహించింది. ఆ తర్వాత 2012 జనవరి 8న రెండవ టెట్, 2012 జూన్ 1న మూడవ టెట్ నిర్వహించింది. ప్రస్తుతం ఆ మూడు టెట్‌ల స్కోర్‌కు ఎన్‌సిటిఇ కల్పించిన ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసింది. ఆయా టెట్‌ల పేపర్ -1, పేపర్- 2 పరీక్షలకు తెలంగాణ, ఎపికి చెందిన వారు 15 లక్షల మందికి పైగా హాజరు కాగా, అందులో 7,41,097 మంది అర్హత సాధించారు. అందులో తెలంగాణకు చెందిన అభ్యర్థులు దాదాపు 4 లక్షల వరకు ఉన్నారు. ఏడేళ్ల నిబంధన కారణంగా వారంతా తమ టెట్ వ్యాలిడిటీని కోల్పోయారు.

ఆ తర్వాత (2014, 2016, 2017లలో) నిర్వహించిన మరో మూడు టెట్‌లలో 3,69,308 మంది అర్హత సాధించారు. 2014 మార్చి 16న నిర్వహించిన నాలుగవ టెట్‌లో రాష్ట్రానికి చెందిన 3 లక్షల అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితో పాటు 2017 జూలై 23న నిర్వహించిన చివరి టెట్ తర్వాతి మూడు విద్యా సంవత్సరాల్లో బి.ఇడి, డి.ఇడి పూర్తి చేసుకున్న వారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. ఈ అభ్యర్థులు టెట్‌లో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు అవుతారు. టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా స్కోర్ పెంచుకునేందుకు మళ్లీ పరీక్ష రాస్తుంటారు.

టెట్ శాశ్వత వ్యాలిడిటీ ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు

టెట్ శాశ్వత వ్యాలిడిటీ ఉత్తర్వుల కోసం నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఏడేళ్లు మాత్రమే ఉన్న టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని ఇటీవల ఎన్‌సిటిఇ పాలక మండలి నిర్ణయించింది. దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మారుస్తామని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్‌సిటిఇ పేర్కొంది. దానిపైనా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేస్తామన్న ఎన్‌సీటీఈ నిర్ణయాన్ని గతంలో టెట్ అర్హత సాధించిన వారికి కూడా వర్తింపజేస్తే సుమారు లక్ష మందికి ప్రయోజనం చేకూరనుంది. లేదంటే వారు కూడా మళ్లీ టెట్ రాయాల్సిందే.

ఆన్‌లైన్‌లో పరీక్ష…?

టెట్ పరీక్షను ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. టెట్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహించేందుకు కొంత ప్రయత్నం చేసినప్పటికీ పలు కారణాల వల్ల నిర్వహించలేకపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్ విధానమే మేలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆన్‌లైన్‌లో టెట్ నిర్వహించడం వల్ల త్వరగా ఫలితాలు వెల్లడించవచ్చని ఆలోచిస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించి త్వరితగతిన ఫలితాలు వెల్లడించాలని, ఆ వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే టెట్‌కు సుమారు 3 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు కేంద్రాలను గుర్తించి సెషన్లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. టెట్ పరీక్ష నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News