Thursday, April 25, 2024

డిసిసిబి ఎన్నికలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

 

ఈ నెల 28న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
29న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
వచ్చే నెల 5వ తేదీన టెస్కాబ్ ఛైర్మెన్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికలు ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రతీ జిల్లాకూ వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. మరోవైపు ఈ నెల 22వ తేదీన జిల్లా అధికారులు కూడా మళ్లీ నోటిఫికేషన్లు (ఎన్నికల నోటీసు) జారీచేస్తారని అథారిటీ అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఈ నెల 25వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు నామబినేషన్ల పరిశీలన జరుగుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.

అనంతరం ఈ నెల 28వ తేదీన ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ తరువాత 29వ తేదీన ఆఫీస్ బేరర్ల ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను ఎన్నుకుంటారని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ తెలిపింది. ప్రతీ డిసిసిబి, డిసిఎంఎస్‌లలో 20 మంది చొప్పున డైరెక్టర్లను ఆ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఛైర్మన్లు ఎన్నుకుంటారు. డిసిసిబి, డిసిఎంఎస్‌లలో ప్యాక్స్ ఛైర్మన్లంతా వాటిల్లో సభ్యులు. 20 మంది డైరెక్టర్లలో 16 మందిని ప్యాక్స్‌ల నుంచి ఎన్నుకుంటారు. మరో నలుగురిని చేనేత సంఘాలు సహా వివిధ సొసైటీలకు చెందిన వారి నుంచి ఎన్నుకుంటారు.
డైరెక్టర్లకు రిజర్వేషన్లు
మొత్తం 16 మంది డైరెక్టర్లలో ఎస్‌సిలకు మూడు, ఎస్‌టిలకు ఒకటి, బిసిలకు రెండు, ఓపెన్ కేటగిరీకి 10 చొప్పున రిజర్వు చేశారు. అలాగే మరో నాలుగు డైరెక్టర్లకు సంబంధించిన వాటిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఓపెన్ కేటగిరీలకు ఒక్కోటి చొప్పున రిజర్వేషన్ కల్పించారు. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో జరుగుతాయి. ఎస్‌సి కేటగిరీ డైరెక్టర్లను ఎన్నుకునేందుకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, ఎస్‌టికి లైట్ బ్లూ కలర్, బిసి కేటగిరీకి లైట్ గ్రీన్ కలర్, ఓపెన్ కేటగిరీకి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్‌ను ముద్రిస్తారు. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఛైర్మన్‌ను వచ్చే నెల ఐదో తేదీన ఎన్నుకోనున్నారు. అందుకు సంబంధించిన నోటఫికేషన్‌ను మూడో తేదీన జారీచేస్తామని సహకార ఎన్నికల అథారిటీ అధికారులు తెలిపారు.

Notification Released for DCCB Elections 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News