Home రాష్ట్ర వార్తలు ఆర్‌బిఐ ఏంచేస్తోంది?

ఆర్‌బిఐ ఏంచేస్తోంది?

ph1

ఎన్‌డిఎ హయాంలో బ్యాంకుల ఎన్‌పిఎలు రూ.7 లక్షల కోట్లకు పెరిగాయి

బ్యాంకుల ప్రైవేటుకు శక్తిమంతమైన లాబీ పనిచేస్తోంది : కేంద్ర మాజీమంత్రి చిదంబరం 

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిది బడా వ్యాపారుల అనుకూల ఆర్థిక విధానమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం విమర్శించారు. తాము అధికారంలో ఉండగా 2014 మార్చి 31న బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) సుమారు రూ.2 లక్షల కోట్లు కాగా, 2017 డిసెంబర్ నాటికి అవి రూ.9 లక్షల కోట్ల కు చేరిందన్నారు. ఈ నాలుగేళ్ళలో ఎన్‌పిఎలు పెరగడానికి కారణమేమిటని, నియంత్రణ వ్యవ స్థ ఏమి చేస్తుందని, ఆడిటర్‌లు, ఆర్‌బిఐ ఏమి చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. దేశంలో బ్యాంకుల ప్రైవేటీకరణకు శక్తివంతమైన లాబీ పని చేస్తుందని, కాని మెజారిటీ ప్రజానీకం ప్రైవేటీకరణకు వ్యతిరేకమనేది తన బలమైన విశ్వాసమన్నారు. ఇటీవల విడుదలైన చిదంబరం వ్యాస సంకలనాల పుస్తకం “స్పీకింగ్ ట్రూత్ టు పవర్‌” పై హైదరాబాద్‌లో శనివారం మంథన్ సంస్థ చర్చా గోష్ఠి నిర్వహించింది. విద్యారణ్య పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత గంటపాటు సమకాలీన రాజకీయాలు, బడ్జెట్, జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి అంశాలపై చిదంబరం ప్రసంగించారు. అనంతరం సభికులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బ్యాంకింగ్ రంగంలో 2014 నుండి తీవ్రమైన వ్యవస్థాగత లోపాలు ఉన్నాయని, ఈ నాలుగేళ్ళలో అవి మరింత తీవ్రమయ్యాయని చెప్పారు. ఎగవేతదారులు పెరిగినంత మాత్రాన మనది ఎగవేతదారుల దేశంగా భావించవద్దని, రుణాలు తీసుకున్నవారిలో 10 శాతం లోపే ఎగవేతదారులని, మిగతా 90 శాతం రుణాలు తిరిగి చెల్లిస్తున్నారని వివరించారు. “నువ్వు ఎంత పెద్ద మనిషి అని చెలామణైతే ఎగవేతదారునిగా మారేందుకు అంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి” అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. గ్రామీణులు, మధ్య తరగతి ప్రజల్లో రుణాలను తిరిగి చెల్లించకపోవడమంటే కళంకంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు.
నాలుగేళ్ళు ఏమి చేశారు? :
గడిచిన నాలుగేళ్ళలో వాస్తవ వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ ఆదాయంలో పెరుగుదల లేదని చిదంబరం తెలిపారు. రైతులు ఆదాయం తగ్గి పేదలుగా మారుతున్నారనేది కఠోర వాస్తవమన్నారు. పేదలు, వ్యవసాయం, యువతను ఆదుకోవడంలో, సంక్షేమ పథకాలను ప్రోత్సహించడంలో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ళలో నిరుద్యోగం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం అనే నాలుగు సవాళ్ళను పరిష్కరించడంలో విఫలమైనట్లు కేంద్ర ఆర్థిక సర్వే ప్రకటించిందని, ఇంతటి కీలక అంశాలను పట్టించుకోకుండా నాలుగేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. 200414 సంవత్సరాల మధ్య భారతదేశం జిడిపి డాలర్లలో మూడింతలు, రూపాయలలో నాలుగింతలు పెరిగిందని, గడిచిన నాలుగేళ్ళలతో జిడిపి రెండింతలైందని ప్రధాని అంటున్నారని, కాని బడ్జెట్ రూపకల్పనలో పేదల వైపు మొగ్గు మాత్రం కనిపించలేదన్నారు. నోట్లు రద్దుపై కొండను తొవ్వి ఎలుకను పట్టారని తాను చెప్పిన విషయమే నిజమైందన్నారు.
రాజకీయేతర ఉద్యమాలే ఎన్నికల్లో కీలకం :
భవిష్యత్తు ఎన్నికలను రాజకీయేతర ఉద్యమాలు, సంస్థలు నిర్దేశిస్తాయని చిదంబరం అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో రాజకీయాలతో సంబంధం లేని శక్తులను ఒక్కతాటిపైకి తీసురావడం ద్వారా బిజెపిని కట్టడి చేయగలిగామన్నారు. అల్పేశ్ ఠాకూర్, జిగ్నేష్ మెవానీ, హార్థిక్ పటేల్‌లను కులతత్వవాదులుగా కొట్టిపారేయొద్దని, నిరుద్యోగమనే బలమైన అంశం లేకుంటే వారి ఉద్యమాలు నిలిచేవి కాదని చెప్పారు. నిరుద్యోగ సమస్య బద్ధలయ్యే అగ్నిపర్వతంలా ఉన్నదన్నారు. నాలుగేళ్ళలో ఏ రంగంలో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలివ్వమంటే పకోడాలను అమ్ముకోవాలంటూ యువతను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్ ఎన్నికల్లో తాము కేవలం 12 పోలింగ్ బూత్‌ల వల్లే ఓడిపోయామని చిదంబరం చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ బూత్‌లలో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి ఉంటే బిజెపి ఓడిపోయేదన్నారు.
విమర్శ ప్రభుత్వాలకే మంచిది :
ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రభుత్వాలకే మంచి చేస్తాయని చిదంబరం అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం విమర్శల పట్ల అసహనంతో ఉన్నదన్నారు. చివరకు ఎం.ఎస్.స్వామినాథన్, అశోక్ గులాటి వంటి స్వతంత్ర వ్యక్తుల అభిప్రాయాలను కూడా వినకపోతే ప్రభుత్వానికి మంచి చెప్పేవారే కరువవుతారని అన్నారు. అసహనికి సమాధానం మౌనం కాదని, మనం మౌనంగా ఉన్నామంటే అసహనంలో భాగస్వాములమైనట్లేనని చిదంబరం అన్నారు.