Home ఎడిటోరియల్ మీడియాకు అజిత్ దోవల్ పాఠాలు

మీడియాకు అజిత్ దోవల్ పాఠాలు

ajit-doval

వివిధ రాష్ట్రాలలో తీవ్రవాద వ్యతిరేక దళాల, ప్రత్యేక పోలీసు దళాల అధిపతుల జాతీయ సమావేశంలో ప్రసంగిస్తూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మీడియాకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా న్యాయవ్యవస్థ మీద కూడా కించిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు విమర్శలూ తీవ్రవాదానికి సంబంధించినవే. తీవ్రవాద కార్యకలాపాల గురించి పత్రికల్లో సమాచారం రాకపోతే తీవ్రవాదం దానంతట అదే అంతం అవుతుందన్నది దోవల్ సిద్ధాంతీకరణ. తీవ్రవాదాన్ని ఎవరూ సమర్థించక్కర లేదు. తీవ్రవాదులను అణచడానికి ప్రభు త్వం అనేక వ్యూహాలు అనుసరించవచ్చు. అందులో పట్టణ నక్సలైట్లుగా ముద్ర వేసి సామాజిక కార్యకర్తలను, పౌరహక్కుల కోసం పోరాడే వారిని జైళ్లల్లో మగ్గేట్టు చేయడమూ భాగం కావచ్చు. తీవ్రవాదులు అని భావించిన వారిని ఆ విషయం రూఢి చేసుకోకుండానే, ఎలాంటి చట్టబద్ధ ప్రక్రియను అనుసరించకుండానే ఎదురుకాల్పుల పేరిట కడతేర్చవచ్చు.

ఎదురు కాల్పుల సంఘటనలు జరిగినప్పుడల్లా పోలీసులు చెప్పే కథ ఒకేలా ఉంటుంది. మేం తీవ్రవాదుల కోసం అన్వేషిస్తుండగా కొందరు నక్సలైట్లో, తీవ్రవాదులో కనిపించారని, వారిని ఆగమని హెచ్చరించినా ఆగలేదని, పైగా కాల్పులకు దిగారని, ఆత్మరక్షణ కోసం పోలీసు దళాలు ఎదురు కాల్పు లు జరిపినప్పుడు ఇంత మంది తీవ్రవాదులో, నక్సలైట్లో మరణించారు అని పోలీసులు చెప్పిన కథ చెప్పినట్టే చెప్తారు. కథ వాస్తవం కాకుండా కట్టుకథ అయినప్పుడు సహజంగానే వాస్తవాలతో సంబంధం ఉండదు. ఈ ఎదురు కాల్పుల్లో నూటికి 99 శాతం సందర్భాల్లో పోలీసు సిబ్బందికి చిన్న గాయం కూడా కాదు. చాలా సందర్భాలలో ఎదురు కాల్పుల్లో మరణించిన వారు గుర్తు తెలియని నక్సలైట్లనో, తీవ్రవాదులనో చెప్తూ ఉంటారు. గుర్తు తెలియని వారు తీవ్రవాదులో, నక్సలైట్లో ఎలా అయ్యారు అన్న ప్రశ్నకు మాత్రం పోలీసుల దగ్గర సమాధానం ఉండదు.

తమ కల్పిత గాథను సమర్థించుకోవడానికి భద్రతా దళాల వారు మరి కొంత అదనపు సమాచారం కూడా జోడిస్తారు. ఎదురు కాల్పుల్లో మరణించిన వారి దగ్గర ఒక సంచీ, అందులో పిస్తోలో, నాటుబాంబులో ఉన్నాయని సెలవిస్తారు. నక్సలైట్ల విషయంలో అయితే నిషేధిత సాహిత్యం కూడా చేరుతుంది. దొరికిన సాహిత్యంలో నిషేధిత సాహిత్యమేదో వింగడించి తేల్చడంలో భద్రతా దళాల వారి ప్రజ్ఞను మనం అంగీకరించి తీరవలసిందే. తీవ్రవాదుల విషయంలో అయితే ఈ కథలో అవసరానుగుణంగా కొన్ని మార్పులు ఉండొచ్చు. తీవ్రవాదాన్ని తుదముట్టించడంలో మీడియా ఎలా వ్యవహరించాలో దోవల్ చెప్పిన పాఠాల్లో ప్రధానాంశం ప్రచారం కోసమే తీవ్రవాదులు తీవ్రవాద సంఘటనలకు పాల్పడుతుంటారనీ అందువల్ల అలాంటి సంఘటనలకు సంబంధించిన సమాచారం మీడి యా ఇవ్వకుండా ఉంటే తీవ్రవాదం దానంతట అదే తగ్గిపోతుందన్నది దోవల్ పాఠాల్లోని సారాంశం.

తీవ్రవాద సంఘటనలకు సంబంధించిన సమాచారం మీడియా అందించినప్పుడు ఆ సంఘటనలకు ప్రాధాన్యం రావడమూ, అది తీవ్రవాదులకు ఉపకరించడమూ జరిగితే జరగవచ్చు. తీవ్రవాదులు విధ్వంసానికి పాల్పడినా ఆ సమాచారమూ మీడియా అందించకూడదన్నదీ దోవల్ ఆంతర్యమేమో తెలియుదు. అయితే జాతీయ భద్రతా సలహాదారు మహోపదేశంలో గమనించదగింది ఏమిటంటే తీవ్రవాదం కేవలం ప్రచారం కోసమే కొనసాగదు అన్న ఇంగిత జ్ఞానం కొరవడడం. తీవ్రవాదులు, నక్సలైట్లు అనుసరించే విధానాలు తప్పయితే కావచ్చు కానీ వారికి నిర్దిష్ట లక్ష్యం ఉండి తీరుతుంది. తీవ్రవాదులకు, నక్సలైట్లకు రాజ్యాంగం మీద, చట్టాల మీద విశ్వాసం లేకపోవచ్చు. రాజ్యాంగానికి, చట్టాలకు విలువ ఇస్తామని ప్రచారం చేసుకునే రాజ్య వ్యవస్థ ఆ మాటకు కట్టుబడి ఉండాలి కదా. చాలా సందర్భాలలో బొత్తిగా కట్టుబడదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన వ్యవస్థే రాజ్యాంగానికి కట్టుబడనప్పడు దాని మీద విశ్వాసం లేనివారు కట్టుబడడం లేదని వాదించడం అర్థ రహితం.

ఇంతకీ తీవ్రవాద కార్యకలాపాలకు మీడియా ప్రచారం ఇవ్వకూడదన్న ఉచిత సలహా దోవల్ సొంతం కాదు. ఎప్పుడో 1985లో ట్రాన్స్ వరల్ ఏర్ లైన్స్ విమానాన్ని దారి మళ్లించినప్పుడు అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి మార్గరెట్ చేసిన వ్యాఖ్యలను చిలకలాగా వల్లించడమే దోవల్ చేసిన మహత్కార్యం. వైపరీత్యం ఏమిటంటే తీవ్రవాదాన్ని అంతమొందించడంలో మీడియా ప్రధాన పాత్ర నిర్వర్తిస్తుందని ఆయనే అంగీకరించారు. మనం మీడియా విధానాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని థాచర్ చెప్పిన మాటలనే దోవల్ కూడా చెప్పారు. మీడియాకు సమాచారం అందించాలని, లేకపోతే వారు ఊహించి రాస్తారనీ ఆయన అన్నారు. మీడియాకు సమాచారం అందించకపోతే సమాజం మరింత భయోత్పాతానికి గురవుతుందని కూడా తెలియజేశారు. దోవల్ సలహా పాటించేటట్టయితే పోలీసులు ఎదురు కాల్పులు జరిపినప్పుడు, తీవ్రవాదులు విధ్వంసానికి పాల్పడినప్పుడు కూడా మీడియా ఆ వాస్తవాన్ని కప్పి పుచ్చాల్సి వస్తుంది. ఇటీవలే విడుదలైన రిపోర్టర్స్ విత్ అవుట్ బార్డర్స్ నివేదికలో సమాచార స్వేచ్ఛలో భారత్ మరో రెండు మెట్లు దిగి 40వ స్థానంలో నిలిచింది.

ప్రభుత్వం అందిస్తున్న సమాచారంలో తాలెంతో మేలెంతో సమాజ గమనాన్ని పరిశీలిస్తున్న వారంతా గమనిస్తూనే ఉన్నారు. 45 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతటి నిరుద్యోగం తాండవిస్తోందన్న గణాంకాలు విడుదలైతే దాన్ని తొక్కిపెట్టిన వైనమూ తెలియనిది కాదు. ప్రభుత్వ అసత్య ప్రచారాన్నే మహా ప్రసాదంగా స్వీకరిస్తున్న మీడియా వ్యవస్థలకు కొదవ లేదు. మీడియాలో గణనీయమైన భాగం ఇప్పటికే మోడీ ప్రభుత్వానికి తాబేదారుగా మారింది. ప్రశ్నించడం మీడియా హక్కు. అదే పత్రికా స్వేచ్ఛకు రక్ష రేఖ. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కంకణబద్ధమైన మీడియా స్వరం అధికార పక్ష కీర్తిగానాల రణగొణ ధ్వనిలో పీలగా మారిపోయింది. ఆ మాత్రం భిన్నస్వరాన్ని అనుమతించడమూ దోవల్ కు అసాధ్యమైపోతోంది. న్యాయవ్యవస్థ తీవ్రవాదులు పాల్పడే నేరాలను కూడా మామూలు నేరాలుగానే పరిగణిస్తోందని దోవల్ ఆక్షేపిస్తున్నారు. తీవ్రవాద సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు.

తీవ్ర వాదులకు వ్యతిరేకంగా, అందునా జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఎ-తయ్యబాకు వ్యతిరేకంగా సామాన్యులు కోర్టుకెక్కి ఎలా సాక్ష్యం చెప్తారు అని అడుగుతున్నారు. తీవ్రవాదాన్ని అరికట్టడానికి అనేకానేక చట్టాలున్నాయి. అవేవీ తీవ్రవాదాన్ని అంతం చేయడానికి ఉపకరించలేదు. ఎవరి మీదైనా పోలీసులో, ప్రభుత్వమో ఆరోపణలు చేస్తే సమగ్ర సాక్ష్యాధారాలు అందించవలసిన బాధ్యత ఆరోపణలు చేసిన వారిదే. సాక్ష్యాధారాలు లేకుండా ప్రభుత్వం ఆకాంక్ష మేరకు శిక్షలు విధించడం న్యాయవ్యవస్థ బాద్యత కాదు. పోలీసు దాఖలు చేసిన కేసులు న్యాయస్థానంలో వీగిపోవడానికి కారణం సాక్ష్యాధారాలు సవ్యంగా లేనందువల్లే. కార ణం ఏదైనా ఎవరూ సాక్ష్యం చెప్పని స్థితిలోనూ న్యాయస్థానాలు శిక్ష లు విధించాలని కోరడం న్యాయ ప్రక్రియను భ్రష్టు పట్టించడమే.

సాక్ష్యాధారాలు దొరకకపోవడానికి దర్యాప్తు అరకొరగా, అసమగ్రంగా ఉండడమే కారణం. అలాంటప్పుడు డోబల్ లాంటి వారు న్యాయస్థానాలను ఆక్షేపించడం ప్రజాస్వామ్య ప్రక్రియను పట్టించుకోనవసరం లేదని న్యాయవ్యవస్థను పరోక్షంగా ఆదేశించడమే. ఇది ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేయడమే. ఇప్పటికే అనేక రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడంలో మోదీ ప్రభుత్వం కృతకృత్యం అయింది. న్యాయవ్యవస్థనూ అదే గాటన కట్టాలన్నది డోబల్ ఆంతర్యంగా కనిపిస్తోంది. భద్రతకు అవసరమైన సలహాలు ఇవ్వడంలో విఫలమైన డోబల్ ఆ పాప పరిహారార్థం న్యాయవ్యవస్థ రెక్కలు తెగనరకాలని చూస్తున్నట్టుంది. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ఎమర్జెన్సీ విధిం చిన ఇందిరా గాంధీని నియంత అన్నాం. ఆ నియంతృత్వం రహస్యంగా అమలు కాలేదు. ఆంక్షలేమిటో జనానికి తెలియకుండా అమలు చేయలేదు. రాజ్యాంగంతో సంబంధం లేకుండానే అంతకన్నా ఎక్కువ ఆగడాలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని ఏమనాలో!

NSA Ajit Doval Suggests Change In Media Policy

ఆర్వీ రామారావ్, 9676999856