Home తాజా వార్తలు కార్వీ బ్రోకింగ్ లైసెన్స్ రద్దు

కార్వీ బ్రోకింగ్ లైసెన్స్ రద్దు

Karvy-Stock

 

నిబంధనలు పాటించనందుకు ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇ నిర్ణయం

ముంబై: నిబంధనలు పాటించనందుకు గాను హైదరాబాద్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం కార్వీ గ్రూప్ బ్రోకింగ్ వ్యాపారం లైసెన్స్‌ను రద్దు చేసినట్టు సోమవారం స్టాక్ ఎక్సేంజ్‌లు ప్రకటించాయి. రెగ్యులేటరీ నిబంధనలను పాటించినందువల్ల కార్వీ స్టాక్ బ్రోకింగ్(కెఎస్‌బిఎల్)ను రద్దు చేస్తున్నామని, ఈ రద్దు డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వస్తుందని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్‌ఎస్‌ఇ) ఈమేరకు ఓ సర్కులర్‌ను జారీ చేసింది. ఎన్‌ఎస్‌ఇ చర్యలకు అనుగుణంగానే బిఎస్‌ఇ కూడా కార్వీ సంస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్సేంజ్ ట్రేడింగ్ సభ్యులకు ఈమేరకు నెంబర్ 62/2019 తేదీ 2019 డిసెంబర్ 2తో ఎన్‌ఎస్‌ఇ సర్కులర్ జారీ చేస్తూ, కార్వీ బ్రోకింగ్ లైసెన్స్‌ను రద్దు చేశామని ప్రకటించింది.

క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిందుకు గాను కార్వీ బ్రోకింగ్‌పై సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించిన నేపథ్యంలో ఎక్సేంజ్‌లు ఈ చర్య తీసుకున్నాయి. కార్పీ బ్రోకింగ్ క్లయింట్లు డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో ఓపెన్ పొజిషన్‌లను స్కేర్ ఆఫ్ చేసుకునేందుకు స్టాక్ ఎక్సేంజ్ అధికారులు అనుమతి ఇచ్చారు. క్యాష్ సెగ్మెంట్‌లో ఫ్రెష్ పొజిషన్స్ లేదా కొనుగోలు, విక్రయాలకు క్లయింట్లు వేరే బ్రోకర్ సంస్థతో కొత్త ట్రేడింగ్ అకౌంట్‌ను తీసుకోవాలని సూచించారు. అయితే కార్వీ బ్రోకింగ్‌ను రద్దు చేయడం వల్ల ఈ సంస్థకు చెందిన వేలాది మంది క్లయింట్లపై ప్రభావం చూపనుంది. కార్వీకి దాదాపు 12 లక్షల మంది క్లయింట్లు ఉండగా, వీరిలో 3 లక్షల మంది చురుగ్గా ఉంటారు. సగటున 20 వేల నుంచి 25 వేల వరకు క్లయింట్లు రోజువారీ లావాదేవీలు నిర్వహిస్తారని సెబీ గతవారం తెలిపింది.

ఖాతాదారుల సెక్యూరిటీలను ఈ బ్రోకరేజి సంస్థ ఇతర అవసరాలకు వినియోగించి దుర్వినియోగం చేసిందని సెబీ గుర్తించింది. నవంబర్ 22న చర్యలు చేపట్టింది. ఇందులో ముఖ్యంగా 1096 కోట్ల రూపాయలను తన గ్రూప్ కంపెనీ కార్వీ రియాల్టీకి 2016 నుంచి 2019 వరకు బదిలీ చేసినట్టు సెబీ కనుగొన్నది. దీంతోపాటు 9 మంది క్లయింట్లకు చెందిన సెక్యూరిటీలను విక్రయించినట్లు, ఆరుగురికి సంబంధించిన సెక్యూరిటీలను బదిలీ చేసినట్లు సెబీ గుర్తించింది. ఇప్పటికే సెబీ కొత్త క్లయింట్లను తీసుకోకుండా ఆంక్షలు విధించడంతో పాటు ఖాతాదారులకు సంబంధిచిన పవర్ ఆఫ్ అటార్నీపై కూడా ఆంక్షలు విధించింది.

NSE, BSE suspended Karvy trading license