Home తాజా వార్తలు మూడో దశలో లేం

మూడో దశలో లేం

etela rajender

 

రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు

హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్

బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి
అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా మాస్కులు, టెస్టింగ్ కిట్లున్నాయి
500 వెంటిలేటర్లు, 20లక్షల సర్జికల్ మాస్కులు కొనుగోలు చేశాం
రెండు రోజుల్లో అందుబాటులోకి గచ్చిబౌలిలోని 1500 పడకల ఆసుపత్రి
– ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వేగంగా తన ప్రభావాన్ని చూపుతోంది. శనివారం ఒక్క రోజే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 272కి చేరగా, ఒకరు డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు బులిటెన్‌లో తెలిపా యి. బాధితులంతా మర్కజ్ లింక్‌కి చెందిన వారేనని అధికారులు చెబుతున్నారు. గత నాలుగైదు రోజులుగా వస్తున్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారు, వీళ్లని ప్రత్యక్షంగా కలసిన వారు కావడం గమనార్హం. ప్రస్తుతం గాంధీ, చెస్ట్, ఫీవర్, ఆసుపత్రులలో 228 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు వైరస్ సోకి 33 మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు.

నాలుగు రోజుల్లో 174 పాజిటివ్‌లు నమోదు..
రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో 174 పాజిటివ్ కేసులు నమో దు కావడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవల ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారందరిని గుర్తించి పరీక్షలు ని ర్వహిస్తుండగా క్రమంగా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోం ది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సుమారు 80శాతంకి పైగా మర్కజ్ లింక్ నుంచే కేసులు బయటపడుతున్నాయి.

వ్యక్తికి కరోనా.. ఆ ఇంట్లో 46 మంది
నారాయణగూడలో ఓ వ్యక్తికి కరోనా సోకగా, అతను ఉండే నివాసంలో 46 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లోచ్చిన ఆరుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మిగతా ఐదుగురికి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఇంట్లో 46మంది కుటుంబ సభ్యులు ఉండటంతో వారికి కూ డా కరోనా సోకి ఉంటుందన్న అనుమానం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో శనివారం రాత్రి పాజిటివ్ వ్యక్తి నివాసంలో గాంధీ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నేడు(ఆదివారం) రిపోర్టులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 25 మందికి కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు నోడల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో కూడా కరోనా కలకలం సృష్టించింది.

కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు : మంత్రి ఈటల
రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివ్ వస్తున్న వారంతా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారేనని ఆయన వెల్లడించారు. మర్కజ్ నుంచి వచ్చిన 1090 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని క్వారంటైన్ సెంటర్లలో డాక్టర్లు కూడా నియమించామని అన్నారు. నర్సులు పారమెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారని, అన్ని సెంటర్స్‌లో ఎన్ 95 మాస్స్‌లు, పిపిఇ కిట్స్ సరిపోయేవన్ని ఉన్నాయని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన తమపై ఉందని మంత్రి అన్నారు. వైద్యులు పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

సిఎం సూచనల మేరకు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సిఎస్, వైద్యశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించామని అన్నారు. మొత్తం ఆరు ల్యాబ్‌లలో 24 గంటల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు లక్షల ఎన్ 95 మాస్కులు, ఐదు లక్షల పిపిఇ కిట్లు , ఐదు లక్షల వైరల్ ట్రాన్సిషన్ కిట్లు, 500 వెంటిలేటర్లు, నాలుగు లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు, 20 లక్షల సర్జికల్ మాస్కులు, 25 లక్షల హ్యాండ్ గ్లాసెస్ కోనుగోలు చేశామని అన్నారు. గచ్చిబౌలీలో 1500 బెడ్స్‌తో ఏర్పాటు చేసిన ఆసుపత్రి మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు.

జిల్లా వారీగా యాక్టివ్ కేసులు సంఖ్య : ఆదిలాబాద్ జిల్లాలో 9, భద్రాద్రి 3, హైదరాబాద్ 93, జగిత్యాల 2, జనగాం 2,జయశంకర్ 1, జోగులాంబ 5, కామారెడ్డి 10, కరీంనగర్ 6,మహబూబాబాద్ 1, మెదక్ 5, మేడ్చల్ 12, నాగర్ కర్నూల్ 2,, నల్గొండ 13, నిజామాబాద్ 18, రంగారెడ్డి 10, సంగారెడ్డి 6, సిద్దిపేట్ 1, సూర్యపేట్ 1, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 21, వికారాబాద్ 2గా శనివారం రాత్రి 9 గంటల వరకు మొత్తం 228 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు బులిటెన్‌లో తెలిపారు.

జిల్లాల వారిగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : భద్రాద్రి 1, హైదరాబాద్ 11, కరీంనగర్ 11, మహబూబ్‌నగర్ 1, మేడ్చల్ 2, రంగారెడ్డి 6, వరంగల్ అర్బన్ ఒక్కరు ఇప్పటి వరకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.

 

Number of Corona victims in state is 272