Home లైఫ్ స్టైల్ ప్రసాదాల్లో పోషకాలు..

ప్రసాదాల్లో పోషకాలు..

Nutrients in Prayer

అష్ట లక్ష్మీ దేవతల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీపూజ శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం, నిత్య సుమంగళిగా వర్థిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో బూరెలు, పులగం, గారెలు, పరమాన్నం, చక్కెర పొంగలి, పులిహోర, గోధుమ ప్రసాదంలాంటివి సమర్పిస్తుంటాం. వీటి కోసం బియ్యం, పెసరపప్పు, పంచదార, జీలకర్ర, మినపప్పు, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్, వేరుశనగపప్పు, గోధుమ నూక, మొలకెత్తిన శనగలవంటివి ఉపయోగిస్తాం. వీటిల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. ఇటువంటి ఆహారం తరచూ తీసుకుంటే అనారోగ్యం దరిచేరదు. శరీరంలో వాధినిరోధక శక్తి పెరుగుతుంది.

కావలసిన పదార్థాలు…
పచ్చి సెనగపప్పు: అరకప్పు, కొబ్బరితురుము: పావుకప్పు, బెల్లం తురుము: ఒకటిన్నర కప్పులు, నూనె: వేయించడానికి సరిపడా, బియ్యం: 2 కప్పులు, మినప్పప్పు: కప్పు, ఉప్పు: కొద్దిగా, యాలకుల పొడి: టీ స్పూను

తయారుచేసే విధానం…
మినప్పప్పు, బియ్యం విడివిడిగా ఆరు గంటలసేపు నానబెట్టాలి. బాగా నానాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. మరీ జారు కాకుండా కొంచెం గట్టిగా రుబ్బి పక్కన పెట్టాలి. పచ్చిశెనగపప్పు, సరిపడా నీరు పోసి ఉడికించాలి. ఉడికిన పప్పుని మిక్సీలో మెత్తగా చేయాలి. అందులోనే బెల్లం తురుము, ఏలకుల పొడి కూడా వేయాలి. తరువాత కొబ్బరి తురుము కూడా వేసి ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి ఉంచాలి. ఇప్పుడు ఒక్కో ఉండనీ పిండిమిశ్రమంలో ముంచి కాగిన నూనెలో పూర్ణాల మాదిరిగా వేసి ఎర్రగా వేయించి తీయాలి.

నవధాన్య పాయసం
కావలసినవి:
పెసలు, సెనగలు, బొబ్బర్లు, జొన్నలు, బియ్యం, కందులు, గోధుమలు, సజ్జలు, ఉలవలు: టేబుల్‌స్పూను చొప్పున, బెల్లంతురుము: 2 కప్పులు, యాలకులపొడి: టీస్పూను, పాలు: లీటరు, జీడిపప్పు: రుచికి సరిపడా, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం:
* నేతిలో జీడిపప్పు, బాదంపప్పు వేసి వేయించాలి.
* పెసలు, సెనగలు, బొబ్బర్లు… అన్నీ కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు వీటిలో సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
* ఓ మందపాటి గిన్నెలో పాలు పోసి సగమయ్యే వరకూ మరిగించాలి. తరవాత ఉడికించిన నవధాన్యాలు, బెల్లంతురుము వేసి ఉడికించాలి. యాలకులపొడి కూడా వేయాలి. చివరగా నేతిలో వేయించిన బాదం, జీడిపప్పు ముక్కలు వేసి కలిపితే సరి.

కద్దు శనగల వడ
కావలసినవి: సొరకాయ చిన్నది ఒకటి, నానబెట్టిన శెనగలు 200గ్రా., ఉల్లిపాయ ఒకటి, అల్లం తురుము టేబుల్‌స్పూన్, పచ్చిమిర్చి తురుము 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె వేయించడానికి సరిపడా.

తయారీ ఇలా.. సొరకాయ తొక్కుతీసి సన్నగా తురమాలి. నానబెట్టిన శెనగలకు ఉప్పు జోడించి మెత్తగా రుబ్బాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, అల్లం తురుము, పచ్చిమర్చి తురుము, జీలకర్ర, సొరకాయ తురుము వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించాలి. బాణలీలో నూనె పోసి కాగాక మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసి వేయించి తీసేయాలి. వేడి వేడి శనగల వడ ప్రసాదానికి సిద్ధం..

ఓట్స్ పులిహోర

కావలసినవి: ఓట్స్ – ఒక కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, పసుపు – పావు టీస్పూన్, నిమ్మరసం లేదా చింతపండు రసం – ఒకటింబావు టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, పల్లీగింజలు (వేగించి) – గుప్పెడు, నూనె – రెండు టీస్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్, మినపప్పు – ఒక టీస్పూన్, పచ్చిశెనగపప్పు – ఒకటిన్నర టీస్పూన్లు, పచ్చిమిర్చి (నిలువుగా చీల్చి) – రెండు, ఎండుమిర్చి (తుంచి గింజలు తీసేసి) – ఒకటి, కొత్తిమీర, కరివేపాకులు – కొద్దిగా.

తయారీ: మందపాటి గిన్నెలో నూనె వేడిచేసి ఆవాలు, మినపప్పు, పచ్చిశెనగపప్పుల్ని వేగించాలి. అవి దోరగా కాగానే పచ్చి, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించాలి. నీళ్లు ఉడుకుపట్టగానే ఓట్స్ వేసి కలపాలి. తరువాత మంట తగ్గించి మూతపెట్టాలి. దాదాపు ఐదు నిమిషాలు ఉడికాక మూత తీసి నిమ్మరసం లేదా చింతపండు రసం వేసి బాగా కలియబెట్టాలి. మూతపెట్టకుండా మరో నాలుగు నిమిషాలు ఉడికించాలి. తరువాత వేగించిన పల్లీ గింజలు, కొత్తిమీరతో అలంకరించి పెరుగు లేదా ఏదైనా రోటి పచ్చడితో తింటే టేస్టీగా, పొట్ట నిండుగా ఉంటుంది.