Home లైఫ్ స్టైల్ పోషకాహార పొట్లాలు రానున్నాయి

పోషకాహార పొట్లాలు రానున్నాయి

Nutritional-Packetsభారత ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్‌లో జాతీయ పోషకాహార పథకాన్ని ప్రకటించనుంది. ఈ పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు, గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు ఇంటికి తీసుకెళ్లడానికి పేపర్ పొట్లాలలో రేషన్ ఇస్తారు. ఒక్కో పొట్లంలో 600 నుంచి 1000 కేలరీల పోషకాహారం అందిస్తారు. ఆమాత్రం పోషకాలు రోజువారీ అవసరం అవుతాయి. ఆ పోషకాహారాన్ని నీటితో తీసుకోవాలి. బాబా రామ్‌దేవ్‌ని అటువంటి పోషకాహార పొట్లాలు తయారు చేయమని కోరారు. కేంద్రీకృత పోషకాహార పొట్లాల పథకం అమలులోకి వచ్చాక పిల్లల పెరుగుదల నిర్వహణ, పోషకాహారం, ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్ అంశాలను అంగన్‌వాడీ కేంద్రాలు నిర్లక్షం చేసే అవకాశం ఉండచ్చు అనే అనుమానం కూడా ఉంది. అలా జరగకుండా అదనపు నిర్వహణ అవసరం అవుతుంది. అదనపు పోషకాహారం కోసం ప్రైవేటు రంగానికి పెద్ద పాత్ర ఉండబోతోంది. రాష్ట్ర, కేంద్ర వాటాలు రెండు కలిపి ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు ఉంటుంది.

స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా మనదేశంలో 40 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు. పిల్లల పెరుగుదల నిలిచిపోవడం, వారి వయసు కన్నా తక్కువ బరువు, ఎత్తు ఉండటం మనదేశంలో ఎక్కువ. పోషకాహార సమస్యను పరిష్కరించడానికి సమగ్రమైన, సరైన వ్యూహం పన్నడంలో అంతకు ముందు ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం, తాగునీరు తగినంత దొరకకపోవడం, పిల్లలను సరిగా సంరక్షించలేకపోవడం ఇవన్నీ పోషకాహారలోపానికి సంబంధించిని సమస్యలు. అవే కాక, పేదరికం, అసురక్షిత జీవనోపాధులు, జెండర్ అసమానతలు, ఇవన్నీ కూడా పిల్లల్లో పోషకాహారలోపానికి కారణాలు. పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసిడిఎస్)కింద అంగన్‌వాడీల ద్వారా ఈ పథకం అమలు చేస్తారు.

నెమ్మదిగా అభివృద్ధి
ఇప్పటికి పదేళ్ల కిందట, పిల్లలకు పోషకాహారం పంచే అంగన్‌వాడీలు ఎవరైనా సిద్ధంగా ఉంటే రమ్మని పిలిచేవారు. 2006లో సుప్రీం కోర్టు, నగరాల్లో, గ్రామాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలన్నీ తప్పనిసరిగా ఆరేళ్ల లోపు వయసున్న పిల్లలందరికీ, ప్రతి గర్భిణికి, ప్రతి పాలిచ్చే తల్లికి, ప్రతి కిశోర బాలికకు పోషకాహారం అందించాలని చెప్పింది. 2001 లో సుప్రీం కోర్టు అదే తరహా ఆర్డర్లు వేసింది. అయినా కూడా దాదాపు మూడింట రెండొంతుల మందికి అదేం చేరలేదు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఆహారం సరఫరా చెయ్యకూడదని, ప్రభుత్వాలు స్థానిక గ్రామ సంఘాలకు, మహిళ మండళ్లు, స్వయం సహాయక సంఘాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని 2004 లో కోర్టు మళ్లీ ఆర్డర్లు వేసింది. మళ్లీ 2006లో, 2009లో పునరుద్ఘాటించి. కేంద్ర స్థాయిలో ప్రైవేటు కాంట్రాక్టర్లు అవినీతి పరులవ్వడం వలన అదనపు పోషకాహార పథకం పూర్తిగా సఫలం అవడం లేదు. 2006 తర్వాత ఐసిడిఎస్ పథకాన్ని రెండింతలు చేశారు. అంతకుముందు ఆరున్నర లక్షల అంగన్‌వాడి సెంటర్లుంటే వాటి సంఖ్య అప్పటికి పధ్నాలుగు లక్షలు అయింది. పోషకాహార పంపిణీకి పెద్ద పీట వేశారు. కాని చిన్న పిల్లలలు ఇంటికి పట్టుకెళ్లే రేషన్ సరఫరా చేసేవాళ్ల జేబులు కూడా బాగా నిండాయి. అందుకే కేంద్రీకృత సరఫరా పథకం అమలు కానుంది.