Home జాతీయ వార్తలు న్యూట్రాయ్

న్యూట్రాయ్

sdffనెట్ న్యూట్రాలిటీకే ట్రాయ్ ఓటు
ఫేస్‌బుక్, ఎయిర్‌టెల్ జీరోకు ఎదురుదెబ్బ, ఫ్రీ బేసిక్స్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ : నెట్ న్యూట్రాలిటీ వాదనకు బలం చేకూరింది. ఇంటర్నెట్ కంపెనీలు మొబైల్ సేవల కు విచక్షణారహితంగా టారీఫ్‌లు ప్రతిపాదించ డం కుదరదని, కంటెంట్ ప్రాతిపదికన డేటా సర్వీసులపై రేట్లను వసూలు చేయడం కుదరదని భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ప్రక టించింది. దీనితో ఫేస్‌బుక్ ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’, ఎయిర్‌టెల్ ప్రకటించిన ‘ఎయిర్ టెల్ జీరో’ ఆఫర్లు చెల్లని పరిస్థితి ఏర్పడింది. సోమ వారం నెట్‌చార్జిలకు సంబంధించిన నిషేధపు ఉత్తర్వులను వెలువరించారు. ఇవి తక్షణమే అమ లులోకి రానున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. డేటా సర్వీసులకు వివక్ష పూరిత, ఇష్టా రాజ్యపు టారీఫ్లను వసూలు చేయడంపై నిషేధం (2016 సంవత్సరానికి) విధిస్తున్నట్లు ఇందులో తెలిపారు. ఈ నిబంధనను ఉల్లంఘించి కంటెంట్ ప్రాతిపదికన డేటా సర్వీసులను అంద చేసే కంపెనీలకు రూ 50 వేల వరకూ ప్రతిరోజూ జరిమానా విధిస్తారు. వివక్షపూరిత టారిఫ్‌లను కల్పించడం కానీ, ప్రతిపాదించడం కానీ నిషేధిస్తు న్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ రకాల ఇంటర్నెట్ ప్యాకేజీలు రద్దు అవుతాయని వెల్లడించారు. డేటా ప్యాకేజీలు ఒకే రకంగా ఉండాలని ట్రాయ్ సూచించింది. తక్కువ ధరలకు కొన్ని రకాల డేటా ను అందించడం సరైన అంశం కాదని శర్మ తెలిపారు. ఇంటర్నెట్ చార్జీలపై కంపెనీలు ఓ వ్యక్తితోనూ సర్వీసు ప్రొవైడర్ అగ్రిమెంట్లు, కాంట్రాక్టులు కుదర్చుకో రాదని ఉత్తర్వులలో తెలిపారు. అయితే అత్యవసర సేవలు, ప్రజా వినిమయం అంశాలలో మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. కంటెంట్ ఆధారంగా మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో విభిన్న స్థాయిలలో డాటా చార్జీలు ఉండాలని ఇటీవలి కాలంలో వాదన మొదలైంది. అయితే వీటికి ఇప్పుడు ట్రాయ్ తన ఉత్తర్వులతో అడ్డుకట్ట వేసింది. కంటెంట్ అనుసంధానం అయ్యేందుకు వినయోగదారులకు భిన్న స్థాయిలలో రేట్లు ఉండాలని పలు కంపెనీలు ప్రత్యేకించి ఫేస్‌బుక్ వంటివి చేస్తున్న ప్రతిపాదనలను ట్రాయ్ పూర్తి స్థాయిలో తోసిపుచ్చింది.తమ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోతూ ఉంటే చివరికి రూ 50 లక్షల వరకూ జరిమానాలు ఉంటాయని ట్రాయ్ పేర్కొందంఇ. దీనితో ఎయిర్‌టెల్ జీరో ప్రచారానికి కూడా ఎదురుదెబ్బ వాటిల్లింది. ఫ్రీబేసిక్స్ పేరిట ఫేస్‌బుక్ అధినేతలు ఈ మధ్యలో ప్రచారానికి దిగారు. వాణిజ్య ప్రకటనలు కూడా జారీ చేస్తున్నారు. దీనిని పరిరక్షించుకునేందుకు నెటిజన్ల మద్దతు యత్నాలకు దిగారు. అయితే ఫ్రీ బేసిక్ ప్రచారాన్ని స్వచ్చంద సేవా సంస్థల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటర్నెట్ సమానత్వానికి ఇది విఘాతం అని, ఫ్రీబేసిక్స్ పేరిట ఇంటర్నెట్‌పై గుత్తాధిపత్యానికి వేసిన ఎత్తుగడ అని విమర్శలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే నెట్ న్యూట్రాలిటీకి అనుకూలంగా ట్రాయ్ ఉత్వర్వులు వెలువడ్డాయి. తమ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని కూడా ట్రాయ్ తెలిపింది. వివక్షాయుత టారీఫ్‌లపై నిషేధం అనివార్యం అని, దీని వల్లనే ఇంటర్నెట్ సార్వత్రికం అయి, నెట్ సర్వీసు నిర్వాహకులు విచక్షణ లేకుండా నెట్ సౌకర్యం సార్వత్రికంగా కల్పించేందుకు వీలేర్పడుతుందని ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ తాజా ఉత్తర్వులతో ఇప్పుడు ఫ్రీ బేసిక్స్, ఎయిర్‌టెల్ జీరో వంటి నెట్ ఆఫర్లు భారత్‌లో ప్రవేశించడానికి అవకాశం దక్కని పరిస్థితి ఏర్పడింది. అయితే సర్వీసును అందించే వారు అత్యవసర సేవలకు సంబంధించి తక్కువ టారీఫ్‌లను చార్జీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ టెలికం నియంత్రణ సంస్థ రూలింగ్ ఇచ్చింది. కాగా, ట్రాయ్ నిర్ణయం తమను నిరాశపర్చిందని , తమ ఫ్రీ బేసిక్ విధానం ద్వారా ఉచిత నెట్ సౌకర్యానికి చేపట్టదల్చిన చర్యలకు విఘాతం ఏర్పడుతుందని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ స్పందించింది. అత్యధికులను ఆన్‌లైన్ పరిధిలోకి తేవడం ద్వారా , వారికి ఉచితంగా సౌకర్యం కల్పించడం ద్వారా ఈ వేదికను సార్వత్రికం చేయాలనుకున్నామని అయితే ఇప్పుడు ఈ పరిణామం తమకు ఇబ్బంది కల్గించిందని సంస్థ ప్రతినిధి ఓ ప్రకటన వెలువరించారు. అయితే ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ కల్పించి తద్వారా అవకాశాలను సార్వత్రికం చేసే తమ యత్నాలు ఆగబోవని సంస్థ స్పష్టం చేసింది.
ట్రాయ్ నిర్ణయం సముచితం : కాంగ్రెస్
నెట్ న్యూట్రాలిటీకి వీలు కల్పిస్తూ, విభిన్న రీతులలో చార్జీల విధానాలను నిషేధిస్తూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయం సరైనదని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తరచూ పేర్కొంటున్న వాదన దీనితో బలపడిందని, రాహుల్ వాదన సరైనదని వెల్లడైందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నెట్‌న్యూట్రాలిటీకి వ్యతిరేక వాదన విన్పించిందని, అయితే తమ నేత రాహుల్ తో పాటు దేశంలోని లక్షలాది మంది నెటిజన్లు వెలిబుచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా ఇప్పుడు రూలింగ్ వచ్చిందని తెలిపారు. నెటిజన్లు స్పందించిన తీరు హర్షనీయం అని , స్వేచ్ఛాయుత భావన ప్రాతిపదికన వెలువడ్డ ఫ్రీ ఇంటర్నెట్ ఆలోచన విధానం ఇప్పుడు ఈ ట్రాయ్ ఉత్తర్వులతో నెగ్గిందని పేర్కొన్నారు.బడా పైరవీకార్లు, కార్పొరేట్ సంస్థలపై నెటిజన్ల విజయానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తీవ్రస్థాయిలో కాల్‌డ్రాప్స్ విషయాన్ని పరిశీలించాలని, ఈ సమస్య ఇప్పుడు వంద కోట్ల మంది మొబైల్ సెల్‌ఫోన్ వినియోగదారులకు ఇబ్బందికరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితమే నెట్‌న్యూట్రాలిటీ అంశంపై కావాలనే మోడీ ప్రభుత్వం కాలాయాపనకు దిగుతోందని , కార్పొరేట్లకు అనుకూల ప్రయోజనాలలో ఇదో భాగం అని విమర్శించారు. ఇది ఇలా ఉండగా ట్రాయ్ నిర్ణయం నెటిజన్లకు విజయం అని , నెట్‌న్యూట్రాలిటీకి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని రాహుల్ గాంధీ తమ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.