Friday, April 26, 2024

ఒబామా, బిడెన్, బిల్‌గేట్స్ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్..

- Advertisement -
- Advertisement -

నెట్టింట్లో సైబర్ దొంగలు పడ్డారు
ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హాంఫట్
ఒబామా, బిడెన్, బిల్‌గేట్స్ ఇతరులకు ఎసరు
బిట్‌కాయిన్ ఆశచూపి నేరగాళ్ల వల
బాధితులలో ముస్క్ , నటి కిమ్
తికమక రాతల చర్యలతో సంచలనం
న్యూయార్క్: సైబర్ నేరగాళ్లు శృతి మించారు. ఏకంగా అత్యంత ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలకే ఎసరు పెట్టారు. ప్రముఖ కంపెనీల ఖాతాలను హ్యాక్ చేశారు. అందులోనూ అంతర్జాతీయ స్థాయి పెద్ద మనుష్యుల ట్విట్టర్ ‌ఖాతాలపై దాడిచేసిన ఈ హ్యాకర్ల వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న జో బిడెన్, బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్, ఎలాస్ ముస్క్‌తో పాటు మరికొందరు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు ఇప్పుడు దాడికి గురయ్యాయి. నటి కిమ్ కర్థాసియన్ ఖాతా కూడా హ్యాక్ అయింది. ఈ పరిణామంతో అధికారులు కంగుతిన్నారు. హ్యాకర్లు వీరి అధికారిక ఖాతాలలో పిచ్చిపిచ్చి రాతలకు దిగారు. అంతేకాకుండా పలు అనుమానాస్పద ట్వీట్లు పెట్టారు.

వీటన్నింటిలోనూ క్రిప్టో కరెన్సీ సంబంధిత వ్యాఖ్యలు ఉండటంతో అధికారులు కూపీ లాగుతున్నారు. క్రిప్టోకరెన్సీ స్కాం ముఠా ఇటీవలి కాలంలో ఇటువంటి వ్యవహరాలకు పాల్పడుతోంది. దీనితో ఇప్పటి పని కూడా వీరి చర్యనే అని అనుమానిస్తున్నారు. ప్రముఖుల ఖాతాలు హ్యాకర్ల బారిన పడిన విషయాన్ని గుర్తించిన వెంటనే వాటిని ఇతరత్రా ఇక్కట్లకు గురికాకుండా కాపాడినట్లు ట్విట్టర్ సంస్థ తెలిపింది. తమ సపోర్టు టీం రంగంలోకి దిగిందని తెలిపారు. వారి ఖాతాల్లోని అనుచిత ట్వీట్లను తొలిగించింది. హ్యాకర్ల దాడికి గురైన ఈ ట్విట్టర్ ఖాతాలను తాత్కాలికంగా స్తంభింపచేసినట్లు అధికారులు వివరించారు. కొందరు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను టార్గెట్‌గా చేసుకునే హ్యాకర్లు ఈ దాడికిదిగారని వెల్లడైంది. ప్రస్తుత సైబర్ క్రైంపై పూర్తిస్థాయి విచారణ జరపడంతో పాటు వారి ఖాతాల పూర్తి స్థాయి భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ సపోర్టు బృందం తెలిపింది. అన్ని అవకవతవకలను సరిదిద్ది తాము త్వరలోనే ఈ ఖాతాలను పునరుద్ధరిస్తామని సంస్థ వారు తెలిపారు. ప్రస్తుత పరిణామం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు షాక్‌నిచ్చింది.

ఇది మాకు పరీక్షనిచ్చిన రోజు: ట్విట్టర్ సిఇఒ
సైబర్ నేరగాళ్ల దాడితో ట్విట్టర్ కంగారు తింది. క్రిప్టోకరెన్సీ నేరగాళ్లు అత్యంత ప్రముఖుల ఖాతాలలోకి చొరబడుతున్న పరిణామం ఆందోళనకరంగా మారిందని సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి జాక్ డోర్సే ట్వీటు వెలువరించారు. ఇది అనూహ్య పరిణామం. దీనిని తాము భయానక దాడిగా గుర్తించామని తెలిపారు. ఈ దాడి జరిగిన రోజు తమ సంస్థకు చాలా కఠినమైన రోజు అని, దీనిని అగ్నిపరీక్షగా భావిస్తున్నట్లు, అన్నింటిని అధిగమించనున్నట్లు తెలిపారు. ఇప్పటికైతే ఈ హ్యాకర్ల దాడి ఏ విధంగా జరిగిందనేది తెలియడం లేదని, అన్నింటిని నిర్థారించుకుని చెపుతామని డోర్సే తెలిపారు. తొలుత ఉద్యోగుల ఖాతాలలోకి చొరబడి వాటి ద్వారా ప్రముఖుల ఖాతాలపై దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు, ఈ కోణంలో విస్తృత స్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు సిఇఒ తెలిపారు. పరిస్థితిని అతి త్వరలోనే దారికి తెస్తామని హామీ ఇచ్చారు. ఒబామా ఇతర ప్రముఖుల ట్విట్టర్‌లపై దాడి జరిగినట్లుప్రచారం జరుగుతూ ఉన్నా వీటితో పాటు బ్లూమ్‌బెర్గ్, ఉబోర్, యాపిల్ కంపెనీల అధికారిక ఖాతాలు కూడా హ్యాకర్ల బారిన పడినట్లు అనధికారికంగా వెల్లడైంది.

హ్యాకర్లు ప్రజలకు ప్రత్యేకించి నెట్‌వాలాలకు బిట్‌కాయిన్ల ప్రలోభంతో వలలో వేసుకుంటున్నారు. ఇది ఓ పెద్ద స్కామ్ అయింది. 2017లో ఇటువంటి భారీ హ్యాక్ జరిగింది. అయితే కొన్ని సంస్థల ఖాతాలపైనే హ్యాకింగ్ అయింది. అయితే ఈ సారి ప్రపంచ స్థాయి సంపన్నులు. ఇతరత్రా ప్రముఖ వ్యక్తుల ఖాతాలలోకి చొరబడటం అసాధారణ పరిణామం అని సైబర్ నిపుణులు తెలిపారు. ఇప్పుడు జరిగిన వ్యవహారం సామాజిక మాధ్యమ వేదికకు సంబంధించి అతి పెద్ద దాడి అని, దీని వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రత్యేకించి పలు సామాజిక మాధ్యమాలపై వాడకందార్లకు అనేక అనుమానాలు తలెత్తుతాయని విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి వ్యక్తిగత గోప్యతకు ఇటువంటి పరిణామాలు ముప్పు తెచ్చిపెడుతాయని భావిస్తున్నారు.

Obama and Bill Gates Twitter Accounts Hacked

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News