Home ఎడిటోరియల్ అభివృద్ధికి అడ్డు ఉగ్రవాదం

అభివృద్ధికి అడ్డు ఉగ్రవాదం

Observance of Anti-Terrorism Day on 21st May

 

ఉగ్రవాద వ్యతిరేక దినం మే 21

ఈ రోజు ఉగ్రవాదమంటే ఏదో మన ఊర్లో జరిగే గొడవ కాదు, సినిమా కథ అంతకన్నా కాదు. దేశానికి అదొక పెద్ద సవాలు. దీనిని ఆషామాషీగా ఎదుర్కొంటామంటే అసలు సరిపోదు. ఈ రోజు ఏదో ఒక సందర్భంలో ,ఎక్కడో అక్కడ ఉగ్రదాడులతో , తీవ్రవాద ముప్పుతో జనం నిత్య పోరాటం చేస్తున్నారు. పెరుగుతున్న శాస్త్ర విజ్ఞానం అందుబాటుతో ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నాయి. ఇటువంటి వారిని ఉపేక్షించకూడదు . దేశ శక్తిని మొత్తం ఉపయోగించి ఎదిరించాలి. ఉగ్రవాదం, తీవ్రవాదం రెండూ ఒకటే అవి జాతీయ ప్రయోజనాలను విచ్ఛిన్నం చేస్తాయి. అభివృద్ధి కుంటుపడుతుంది. ముఖ్యం గా సమాజంలో అశాంతి నెలకొంటుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం కేవలం భారతదేశం లేదా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సమస్య కాదు. నేడు ఇది అంతర్జాతీయ సమస్యగా పరిణమించింది.

ఉగ్రవాదమూకల దాడులు యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. మత ఛాందసవాదులు, ఫ్యాక్షనిస్టులు చేసే దాడుల్లో వేలాది గా మరణిస్తున్నారు. ఒకరిపై కక్ష, మరో దేశంపై పగ, కుల వివక్ష, మత విద్వేషం, సంచలనాలు సృష్టించడానికి బాంబులు పెట్టడం, ఆధునిక తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరపడం. వంతెనలను కూల్చివేయడం, విమానాలను దారి మళ్లించడం,హైజాక్ చేసి వారి నాయకులను విడిపించుకోవడం పాఠశాలల్లో పిల్లలను బంధించి పాశవికంగా చంపటం, ఎందరో అమాయకులు బలికావడం మనం రోజూ చూస్తున్నాం.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ దాడిలో కన్నుమూసి రేపటికి ఇరవైఎనిమిది ఏళ్ళు . 1991 మే 21న విశాఖపట్నంలో సార్వత్రిక ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని అందరికీ వీడ్కోలు చెప్పి విమానాశ్రయం నుంచి మద్రాసుకు వెళ్లి అక్కడినుంచి రోడ్డుమార్గాన శ్రీపెరంబుదూరు ఎన్నికల సభకు వెళ్లిన రాజీవ్.. వేలాది ప్రజల సమక్షంలో దారుణ హత్యకు గురి కావడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పర్చింది. వేదికపైకి వెళ్ళ డానికి ముందు అందరికీ గౌరవ సూచకంగా నమస్కారాలు పెడుతున్న సమయంలో ఎల్టీటీఈ ఆత్మాహుతి సభ్యురాలు రాజీవ్ గాంధీ కాళ్ళకు మొక్కి, ఆర్‌డీఎక్స్ బెల్ట్ బాంబును పేల్చింది. ఒక్కసారిగా విస్ఫోటనం, హాహాకారాలు, ఆర్తనాదాలు, గాలిలో ఎగిరిపడిన శరీర భాగాలూ.. తునాతునకలుగా మారిన రాజీవ్ శరీరం. దేశమంతా విషాదం. ఆ ఆత్మాహుతి దాడిలో మరో 26 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. అది దేశం మొత్తం స్తంభించిన సమయం. తల్లి ఇందిరాగాంధీ మరణించిన తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యువకుడు అందరూ అభిమానించే రాజీవ్ చిన్న వయసులోనే దుర్మరణం చెందారు. నాటి నుంచి మే 21 ని దేశవ్యాప్తంగా ఉగ్ర వాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ తీవ్రవాద కార్యకలాపాలతో ప్రజలు, ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ఇది అభివృద్ధికి పెద్ద నిరోధంగా పరిణమించింది. ఏ దేశంలోనైనా తీవ్రవాదం క్షమించరానిది. వారి కోర్కెల డిమాండు కొరకు , వారి అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆత్మాహుతి దాడులు పేరుతో ఎక్కువగా రద్దీ ప్రాంతాల్లో మానవ బాంబులతో వేలాది అమాయక ప్రజలను బలిగొంటున్నారు. ఈ మధ్య కాలంలో ఉత్తరాది, మధ్యభారతం అనే కాకుండా దక్షిణాదిలోనూ తీవ్రవాదుల తాకిడి ఎక్కువయ్యింది . ఈ క్రమంలో దేశంలో తీవ్రవాద సంస్థలు అనేకం పెరిగాయి. ఏదో ఒక మూల వారి ఉనికిని చాటుకోవడానికి ఎక్కడో ఒక చోట వారి దుశ్చర్యలకు అమాయక ప్రజలు బలౌతున్నారు.

భారత్‌ను ఆక్టోపస్ మాదిరిగా అలుముకున్న ప్రాణాంతక ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎట్లా అనే ప్రశ్న మిగిలిపోయింది. మన దేశంలోని మొత్తం 725 జిల్లాలలో దాదాపు సగం జిల్లాలకు ఈ ఉగ్రవాదం వ్యాపించింది. మన దేశంలో ఉగ్రవాదానికి కొన్ని వేల మంది పౌరులు, వందల సంఖ్యలో పోలీసులు , భద్రతా సిబ్బంది బలవుతున్నారు . ఇస్లామిక్ ఉగ్రవాదులుగా ప్రకటించుకున్న వారు గత మూడేండ్లలో కొన్ని వేల మంది మంది ప్రాణాలు తీశారు.

వికృత పరిణామాల వలన స్వేచ్చాఛ వాయువులు పీల్చే ప్రజలకు మనస్తాపం కల్గించినదని, తీవ్ర వాద దుశ్చర్యలను రూపు మాపాలని, అలాగే అందరూ సహజీవనం కొనసాగేలా ఉత్తమ ఆలోచనలతో తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దేశ సంప్రదాయాలను గౌరవిస్తూ, ఉగ్రవాదానికి, హింసావాదానికి అడ్డుకట్ట వేయాలన్నారు. దేశంలో శాంతి భద్రతలను పెంపొందించడానికి, మతసామరస్యం కాపాడటానికి అందరూ కృషి చేయాలన్నారు. చట్టబద్ధపాలన అనేది ఒక లక్ష్యాన్ని చేరుకునే మార్గమే తప్ప అదే లక్ష్యం కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్న మాటలోని అంతరార్థాన్ని గ్రహించాలి.

ఉగ్రవాదానికి కులం మతం ఉండదని మనం గుర్తుంచుకోవాలి. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్కు కావచ్చు… ఉగ్రవాదమే వారి మతం. మన వనరులనే ఉపయోగించుకొని, ఇష్టారీతిన మనలను దెబ్బకొట్టడానికి సిద్ధపడే కనిపించని శత్రువులు వీరు. వీరికి ఏ సరిహద్దులు లేవు, ఏ నీతి నియమాలు లేవు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన బలహీనతను గుర్తించి దెబ్బకొడతారు. మనం మాట్లాడుతుంటే, వారు చేతల్లో చూపిస్తారు. మన వనరులను ఉపయోగించుకొని తక్కువ శక్తితో మనలను ఎక్కువగా దెబ్బకొడతారు. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా యువత ఎక్కువగా ఉగ్ర వాదానికి ఆకర్షితులవుతున్నారు. అడుగడుగునా జరుగుతున్నా అన్యాయాలు , మత ఛాందసవాదుల రెచ్చగొట్టే ప్రసంగాలు, రాజకీయనేతల స్వార్థం, సరైన ఉపాధి లేకపోవటం, కులతత్వం,మాట తత్వం , అంటరానితనం, వివక్ష, అధికారుల అలసత్వం, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం, లంచగొండితనం, ఆకలి, అప్పులు, అవినీతి, అవిద్య, పేదరికం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి.

ఉగ్రవాదులను, తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న రాజకీయ దగాకోరులను సాక్ష్యాలతో సహా నిరూపించి నడి బజారులో అడ్డంగా ఉరితియ్యాలి. వారి స్వార్థం కోసం దేశంలో అల్లర్లు సృష్టించడానికి , అధికార పీఠం ఎక్కడానికి అడ్డదార్లు వెతుక్కునే నికృష్టులను కాల్చిపారేయాలి. డబ్బుల కోసం అడ్డదారులు తొక్కే అధికారులను ఏరిపారేయ్యాలి. అపుడే దేశానికి మనశ్శాంతి. అదే సమయంలో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేయాలంటే ప్రభుత్వం అందరిదీ అనే భావన కల్పించాలి. ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేయాలి. ఎడ్యుకేషన్ యాక్ట్ విధిగా అమలు చేయాలి. గుమాస్తాగిరికి దారి చూపుతున్న విద్యా వ్యవస్థను తీసివేసి స్వయం ఉపాధి కల్పించే విద్యను నేర్పాలి. బాల్యం నుంచే తరగతుల్లో అన్ని కులాలు, మతాలు ఒకటేనని బోధించాలి. నైతిక తరగతులను నిర్వహించాలి. ఎన్ని నిఘాలు, నిరోధక చర్య లు తీసుకున్నా ప్రపంచంలో ఉగ్రవాద చర్యలు ఇసుమంతయినా తగ్గని నేపథ్యంలో ప్రజల్లో సాభ్రాతృత్వాన్ని, సోదరభావాన్ని పెంచేలా సమా జ జీవ నం మారాలి. అదే ఉగ్రవాదాన్ని అడ్డుకోగలదు. ఉగ్రవాద, తీవ్రవాద దాడు ల్లో అసువులు బాసిన వారందరికీ అదే మనం ఇచ్చే ఘనమైన నివాళి.

Observance of Anti-Terrorism Day on 21st May