Home జాతీయ వార్తలు ఒక వీడియో..వేలాది మందిని కాపాడింది

ఒక వీడియో..వేలాది మందిని కాపాడింది

Odia tribal girl courage helps rescue of 6000 labourers

 

తమిళనాడు ఒడిషా గిరిజన బాలిక సాహసగాథ
ఇటుక బట్టీల వలస కార్మికులకు విముక్తి

భువనేశ్వర్: ఒడిషాలోని బాలంగిర్ జిల్లాకు చెందిన ఒక గిరిజన బాలిక చూపించిన ధైర్యసాహసాలు తమిళనాడులోని ఇటుక బట్టీలలో వెట్టిచాకిరీ చేస్తున్న దాదాపు ఆరువేల మంది కార్మికులకు విముక్తి ప్రసాదించాయి. ఆ బాలిక కనబరిచిన సమయస్ఫూర్తి, తెగువ వల్ల ఇటుక బట్టీలలో మగ్గిపోతున్న వేలాది మంది వలస జీవులకు కొత్త జీవితం లభించడం పట్ల హర్షం ప్రకటించిన జాతీయ మహిళా కమిషన్ గురువారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆమెను అభినందించింది. ఒడిషాలోని బాలంగిర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల మానసి బారిహ తన అనారోగ్యంతో మరణించిన తన తల్లి వైద్య చికిత్స కోసం అప్పు చేయాల్సి వచ్చింది.

బాకీ తీర్చేందుకు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పుదుకుప్పంలోని జిడిఎం ఇటుక బట్టీలో తన తండ్రి, చెల్లెలితో కలసి పనిచేసేందుకు ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు గాను వారు ముగ్గురూ రూ. 28,000 చొప్పున అడ్వాన్సు తీసుకుని అక్కడకు వలస వెళ్లారు. అలా అనేక నెలలు వీరు అక్కడ పనిచేశారు. అప్పటి వరకు మానసి కుటుంబానికి ఇటుక బట్టీ యజమాని వారానికి కేవలం రూ. 250 మాత్రమే అది కూడా భోజన ఖర్చులకు ఇచ్చేవాడు. ఇంతలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలయ్యింది. కరోనా వైరస్ తమను కాటేస్తుందన్న భయంతో మానసి కుటుంబంతోపాటు ఇతర కార్మికులంతా తాము తమ స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతించాలని బట్టీ యజమానిని వేడుకున్నారు. వీరిలో అత్యధికులు ఒడిషాలోని బాలంగిరి, నవపాడ, కలహండి జిల్లాలకు చెందినవారే.

అయితే తాను చెప్పిన పని వారం రోజుల్లో పూర్తి చేస్తే వారిని స్వస్థలాలకు పంపిస్తానని యజమాని షరతు విధించాడు. ఇందుకు వీరంతా అంగీకరించి రాత్రీపగలూ అవిశ్రాతంగా పనిచేసి చెప్పిన పని పూర్తి చేశారు. అయితే, ఇసుక బట్టీ యజమాని మాట తప్పాడు. వారిని పంపించేదీ లేదంటూ మొండికేశాడు. దీంతో కార్మికులు ఎదురుతిరిగారు. తమ స్వస్థలాలకు బయల్దేరేందుకు సంసిద్ధులయ్యారు. దీన్ని సహించలేకపోయిన యజమాని, తన అనుచరులతో కలసి కార్మికులను మహిళలు, పిల్లలు అని తేడా లేకుంండా విచక్షణారహితంగా చితకబాదించాడు. ఈ దాడిలో చాలామంది కార్మికులకు వెన్నెముకలు విరిగాయి..తలలు పగిలాయి. తీవ్రంగా గాయపడిన కార్మికులకు కనీసం వైద్య చికిత్సలు కూడా యజమాని అందచేయలేదు. ఈ దాడి సంఘటనను మానసి తన సెల్‌ఫోన్ కెమెరాలు చిత్రీకరించడమే కాక వీడియోలను తనకు తెలిసిన వాట్సాప్ గ్రూపులకు షేర్ చేసింది. తమకు అత్యవసరంగా సాయం అందచేయాలని ఆమె పిలుపు ఇచ్చింది.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక స్వచ్ఛంద సంస్థ స్పందించి తిరువళ్లూరు జిల్లా యంత్రాంగానికి సమాచారాన్ని అందచేసింది. వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మానసి పనిచేస్తున్న ఇటుక బట్టీపై దాడి చేసి కార్మికులను విముక్తుల్ని చేసింది. ఇటుక బట్టీ యజమాని పారిపోగా మిగిలిన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు వలస కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న అనేక ఇటుక బట్టీలు జిల్లాలోఓ అనేకం ఉన్నట్లు తెలియడంతో తమిళనాడు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. అదే జిల్లాలో మరో 30 ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించి దాదాపు 6 వేల మందికి పైగా వలస కార్మికులను కాపాడింది.

వీరిలో అత్యధికులు ఒడిషాకు చెందిన వారే ఉండడం గమనార్హం. మానసి పనిచేస్తున్న ఇటుక బట్టీలోని 355 మంది కార్మికులతో సహా దాదాపు 6750 మంది వలస కార్మికులను దాదాపు 150 బస్సులు, ప్రత్యేక రైళ్లలో ఒడిషా, జార్షండ్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు మే 19, 20 తేదీలలో పంపించింది. చాలామంది కార్మికులు చేసిన అప్పులు తీర్చడానికి ఇలా ఇటుక బట్టీలలో వెట్టి కార్మికులుగా చేరుతున్నారని, కార్మికులకు వారి స్వరాష్ట్రాలలో ఉపాధి కల్పించి, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అనే ఎన్‌జిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీనూ థామస్ అభిప్రాయపడ్డారు.

Odia tribal girl courage helps rescue of 6000 labourers