బరంపురం(ఒడిష): మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచాడు ఓ వ్యక్తి. అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్‌నకు చెందిన ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అపరిచిత మహిళకు రక్తదానం చేయడానికి 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. ఈ అపురూపమైన సంఘటన శనివారం ఒడిషాలో చోటుచేసుకుంది. ఒడిషాలోని గంజా జిల్లా పత్రాపూర్ బ్లాక్‌లోని మందసింగి గ్రామానికి చెందిన సబితా రాణి అక్టోబర్ 13న బరంపురంలోని ఎంకెసిజి వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఒక ఆడశిశువుకు సిజేరియన్ ద్వారా జన్మనిచ్చింది. అయితే ప్రసవానంతరం రక్తహీనత కారణంగా ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఆమె శరీరంలోకి రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉండగా ఆమె బ్లడ్ గ్రూప్‌నకు చెందిన రక్తం దొరకడం దుర్లభమైంది.
ఆమెది అత్యంత అరుదైన Bombay A+ve(బాంబే ఎ పాజిటివ్) బ్లడ్ గ్రూప్. ఇది 2.50 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఉండే బ్లడ్ గ్రూప్. కాగా, ఆసుపత్రి ఇన్చార్జ్ అయిన డాక్టర్ రష్మితా పాణిగ్రాహి సోషల్ మీడియా గ్రూపులలో రక్తదాతల వివరాలు సేకరించగా భువనేశ్వర్ రక్తదాతల గ్రూపులో రూర్కెలా నివసించే దిలీప్ బరిక్ అనే వ్యక్తి పేరు లభించింది. వెంటనే ఆమె బరిక్ను సంప్రదించగా ఆయన వెంటనే బరంపురం వచ్చి రక్తదానం ఇవ్వడానికి అంగీకరించారు. 500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న బరంపురానికి ఆయన తన సొంత ఖర్చులతో చేరుకుని శనివారం రక్తదానం చేశారు. వెంటనే బాధిత మహిళకు రక్తాన్ని ఎక్కించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ పాణిగ్రాహి చెప్పారు. భారతదేశంలో రెండున్నర లక్షల మందిలో ఒకరికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుందని ఆమె వివరించారు.