Home ఎడిటోరియల్ ఎన్నికలు సోషల్ మీడియా!

ఎన్నికలు సోషల్ మీడియా!

Offensive messages and posts on social media

ఎన్నికల నిబంధనలు అతిక్రమించి సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఏదైనా ఒక సందేశం సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేదిగా, వ్యక్తుల పరువు తీసేదిగా ఉంటే ఇందుకు కారణమైన వారిని గుర్తించి చట్టరీత్యా చర్య తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం ట్విట్టర్, వాట్సాప్, యూ ట్యూబ్, ఫేస్‌బుక్ కంపెనీలకు మార్గదర్శక సూత్రాలు తయారు చేస్తోంది. ఈ మాధ్యమాల్లో వచ్చిన పోస్టింగులపై వచ్చే అభ్యంతరాలపై స్పందించేందుకు కంపెనీలకు ఇది వరకు 36 గంటల సమయం  ఉండేది.

సమాచార వ్యవస్థ మొత్తం ఇంటర్‌నెట్‌లో చిక్కుకుంది. వార్తలు క్షణాల్లో జనంలోకి చేరేందుకు సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. తనకు అందిన వార్తను ఇతరులకు పంపడానికి, ఆ వార్తపై తన వ్యాఖ్యానాన్ని తెలిపేందుకు ఇంటర్‌నెట్ సదుపాయంగల వారికి చిటికెలో పని. అయితే, ఆ వార్తలో నిజమెంత? దానిపై ఎలా స్పందించాలి? దాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయాలా వద్దా? అనే ఆలోచన లేకుండా అదో వినోద సాధనమనుకోవడం అత్యంత ప్రమాదకరం.

దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రాజకీయ వ్యంగ్య పోస్టింగులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. పార్టీల విధానాలపై కాకుండా నాయకుల, వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే ఏ రాతగాని, బొమ్మగాని, దృశ్య, శ్రవణ విభాగం గాని తెరపై కనబడగానే వెంటనే స్పందించకపోవడం మేలు చేస్తుంది. ఒకరు పంపిన అభ్యంతరకర వార్తపై స్పందించినా, మరొకరికి పంపినా చట్టరీత్యా నేరమే.

ఎన్నికల నిబంధనలు అతిక్రమించి సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే ప్రచారాన్ని పర్యవేక్షించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఏదైనా ఒక సందేశం సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేదిగా, వ్యక్తుల పరువు తీసేదిగా ఉంటే ఇందుకు కారణమైన వారిని గుర్తించి చట్టరీత్యా చర్య తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం ట్విట్టర్, వాట్సాప్, యూ ట్యూబ్, ఫేస్‌బుక్ కంపెనీలకు మార్గదర్శక సూత్రాలు తయారు చేస్తోంది. ఈ మాధ్యమాల్లో వచ్చిన పోస్టింగులపై వచ్చే అభ్యంతరాలపై స్పందించేందుకు కంపెనీలకు ఇది వరకు 36 గంటల సమయం ఉండేది. 36 గంటల్లో పుకార్లు, తప్పుడు సమాచారం లక్షల మందిలో వ్యాపించి జరగవలసిన నష్టం జరిగిపోతున్నందువల్ల ఈ సమయాన్ని తగ్గిస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం ఈ కంపెనీలు కోర్టులకు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా జవాబుదారీగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 29లో ఈ ఆదేశాలున్నాయి. ఈ సామాజిక మాధ్యమాల కేంద్ర కార్యాలయాలు బయటి దేశాల్లో ఉన్నందున తక్షణ నివారణ చర్యలకు వీలు కలుగడం లేదు, కావున అన్ని కంపెనీలు మన దేశం కోసం గ్రీవియెన్స్ ఆఫీసర్లను నియమించాలని వారి కార్యాలయాలు ఇక్కడే ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. స్వయంగా తప్పుడు వార్తలు గుర్తించిగాని లేదా ఇతరుల నుండి ఫిర్యాదుగాని అందిన వెంటనే ఆ వార్తను తక్షణం కట్టడి చేసే వ్యవస్థను అవి సిద్ధంగా ఉంచుకోవాలి. అయితే ఈ సంస్థలకు దేశ చట్టాలు తెలిసినా వాటికి అవి అంతగా ప్రాధాన్యత ఈయడం లేదని అందువల్ల పుకార్లు క్షణాల్లో వ్యాపించి ప్రాణహానికి దారి తీస్తున్నాయని సైబర్ నిపుణులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ పవన్ దుగ్గల్ వంటి వారు అభిప్రాయపడ్డారు. తాను చేపట్టిన సైబర్ నేరాల కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

మతపరమైన తమ ఆసక్తులకు జనంలోబడడం సాధారణం. శృంగార / లైంగిక సంబంధ ఫోటోలకు, విడియోలకు యువత ఆకర్షితులవుతారు. రాజకీయ ప్రత్యర్థులపై రూపొందిన విడియోలను పార్టీ అభిమానులు ఎగిరి గంతేసి వ్యాపింపచేస్తారు. ఉద్యోగుల ఫేస్‌బుక్, వాట్సాప్ ఖాతాల్లో ఉన్న పోస్టింగులను, వారి ఇష్టాలను పరిశీలించి అవి అభ్యంతరకరంగా ఉంటే కంపెనీలు వారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. టిసిఎస్, టెక్ మహేంద్ర కంపెనీలు మన దేశంలో ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు ఎకనమిక్ టైమ్స్ వార్త రాసింది.

అంతా చేశాక చట్టం నాకు తెలియదు అంటే కోర్టులు ఊరుకోవు. పోస్టింగ్ పెట్టడం క్షణ కాలపు పనిగాని, వెనక్కి తీసుకునేలోపు అది వైరల్ అవుతుంది. దోషిగా నిలబెడుతుంది. ఒకరు పంపిన పోస్టింగును లైక్ చేసినా, ఇతరులకు పంపినా నేరమే అది ఐపిసి సెక్షన్ 499 కిందికి వస్తుంది. ఇన్ఫ్‌ర్మేషన్ టెక్నాలజీ వ్యాప్తి వల్ల ఏర్పడ్డ సోషల్ మీడియాపై నియంత్రణ కోసం కేంద్రం ఐటి యాక్ట్ 2000ను రూపొందించింది. దానిలోని సెక్షన్ 66 ఎ కిందికి ఈ నేరాలన్నీ వస్తాయి. అయితే సెక్షన్ 66 ఎ కున్న పదునును ప్రభుత్వం తమ అవసరాలకు మాత్రమే వాడుకుందనడానికి కొన్ని ఉదాహరణలున్నాయి.

ఏప్రిల్ 2012లో జావ్‌పూర్‌కు చెందిన ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వేసిన కార్టూన్‌ను తన ఇంటర్‌నెట్‌లో పెట్టుకున్నందుకు సెక్షన్ కింద అరెస్టయ్యాడు. బాల్ థాకరే మరణం, అంత్యక్రియల సందర్భంలో ముంబై బంద్‌ను ప్రశ్నిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టింగు పెట్టినందుకు షామీన్ దౌడ అనే యువతిని, ఆ పోస్టింగ్‌ను లైక్ చేసినందుకు రేణును మహారాష్ట్ర పోలీసులు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అక్టోబర్ 2012లో పాండిచ్చేరికి చెందిన వ్యాపారి రవి శ్రీనివాసన్ కార్తి చిదంబరంకు ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు కేసును ఎదుర్కొన్నాడు.

అదే నెలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్టూనిస్టు అసీమ్ త్రివేది ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే తన వ్యంగ్య చిత్రాలకు గాను కేసుల్ని ఎదుర్కొన్నాడు. కార్టూన్స్ ఎగెనెస్ట్ కరప్షన్ సైట్‌ను నడుపుతున్న అసీమ్ పార్లమెంటును, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని ఉద్దేశించి వ్యంగ్య చిత్రాలు వేసినందుకు ఐపిసి 124 ఎ, ఐటి సెక్షన్ 66 ఎ ల కింద అరెస్టు అయ్యాడు. కార్టూనిస్టుగా అసీమ్ త్రివేది పలు అంతర్జాతీయ అవార్డులు పొంది ఉండడం విశేషం.

ఈ కేసులను సునిశితంగా పరిశీలించిన శ్రేయా సింగాల్ అనే న్యాయ విద్యార్థి నవంబర్ 2015లో ఐటి సెక్షన్ 66 ఎ దుర్వినియోగమవుతోందని, పౌరుల వాక్ స్వాతంత్య్రానికి ప్రతిబంధకంగా తయారైందని సుప్రీంకోర్టు కెళ్లింది.

ఐటి సెక్షన్ 66 ఎ అస్పష్టంగా ఉందని, దాని లో నిర్దిష్టత లోపించిందని సుప్రీంకోర్టు నవంబర్ 2017లో ఈ సెక్షన్‌ను కొట్టివేసింది. ఇది రాజ్యాం గ విరుద్ధంగా ఉందని కూడా సుప్రీం భావించింది. అయితే ఐటి సెక్షన్ 66 ఎ తొలిగిపోయినా ఇండియన్ పీనల్ కోడ్‌లో ఉన్న పలు చట్టాలు సామాజిక మాధ్యమాలలోని అనుచిత కార్యాలను అడ్డుకునే స్థాయిలో ఉన్నాయి. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా వార్తను ప్రసారం చేసే వారు తెలుసుకోవాలి. మతాలను, మతపరమైన విశ్వాసాలను భంగపరచే వ్యాఖ్యలు చేయడం ఐపిసి సెక్షన్ 295 ఎ ప్రకారం నేరాలు. మతాల మధ్య, జాతుల మధ్య వైరుధ్యాలు సృష్టించే వార్తలు వ్యాప్తి చేస్తే సెక్షన్ 153 ఎ ప్రకారం నేరగాళ్లు అయినట్లే, పరువు నష్టం దావాకు సంబంధించిన సెక్షన్ 499 అత్యంత బలమైనది విస్తృతమైంది కూడా. ఏ చిన్న పోస్టింగును ఆధారం చేసుకొని అయినా పోలీసులు ఈ సెక్షన్‌ను ప్రయోగించవచ్చు. ప్రజా సమూహాలనుద్దేశించి చేసే అతిక్రమణతో కూడిన ఉపన్యాసాలను వ్యాప్తి చేస్తే సెక్షన్ 505 ముందుకొస్తుంది. మహిళలను అవమానించే విషయాలను సెక్షన్ 509 అడ్డుకుంటుంది. ఈ సెక్షన్‌ల ప్రకారం మోపబడిన అభియోగాలు నిరూపణ అయితే ఒక సంవత్సరం నుండి మూడేళ్ల కారాగార శిక్ష పడవచ్చు, జరిమానా కూడా తప్పదు.

Offensive messages and posts on social media

Telangana Latest News