Home తాజా వార్తలు శరవేగంగా సీతారామ

శరవేగంగా సీతారామ

Officials told to expedite Sitarama project works

 

నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు
ప్రాజెక్టు పూర్తయితే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, సస్యశ్యామలం కానున్న భూములు
త్వరలో సీతమ్మ సాగర్‌కు భూసేకరణ
డిసెంబర్ చివరి నాటికి 8 ప్యాకేజీల పనులను పూర్తి చేయాలని లక్షం
భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో ఏరియల్ సర్వే ద్వారా రెండు, మూడు పంప్‌హౌజ్‌ల పనులను పరిశీలించిన సిఎంఒ కార్యదర్శి స్మితాసబర్వాల్, మంత్రి పువ్వాడ
బిజి కొత్తూరు వద్ద పంప్‌హౌజ్ పనుల్లో జాప్యంపై ఆగ్రహం

మనతెలంగాణ/ములకలపల్లి/అశ్వాపురం: నిర్ణీత గడువు లోగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలని సిఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్‌తో కలసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, బిజి కొత్తూరు వద్ద పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.

కార్యక్రమంలో జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, ఇరిగేషన్ శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, కృపాకర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టరు ఆర్వి కర్ణన్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, ఐటిడిఎ పివో గౌతమ్, జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి, ఎంపిపి ముత్తినేని సుజాత తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతుల పాలిట వరప్రదాయని అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మంత్రి పువ్వాడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, వికె రామవరం పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉభయ జిల్లాల రైతుల మీద ప్రేమతో సిఎం కెసిఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 10వేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు.

ఏరియల్ సర్వే ద్వారా రెండు, మూడు పంప్ హౌస్ పనులను పరిశీలించామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కొత్తగా మూడు లక్షల ఎకరాలు కాగా, ఎన్‌ఎస్పీ కింద మూడు లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. త్వరలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు భూ సేకరణ జరుగుతుందన్నారు. ఎనిమిది ప్యాకేజీ పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. చిన్న నీటి పారుదల శాఖ ద్వారా మరో లక్ష ఎకరాల భూమి సాగులోకి వస్తుందన్నారు. కరోనా కారణంగా కొంత ఆలస్యమైనా అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయని మంత్రి పువ్వాడ తెలిపారు.