Thursday, April 25, 2024

ఆ మొలకల దిగుమతి సుంకాన్ని తగ్గించాలి….

- Advertisement -
- Advertisement -

Oil palm seed tax decreased

హైదరాబాద్: ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటగిరిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  లేఖ రాశారు.  ఆయిల్ పామ్ విత్తన మొలకలపై కేంద్రం పెంచిన దిగుమతి సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశంలో నూనె ఉత్పత్తుల స్వయం సమృద్ధికి తోడ్పడాలని కేంద్రానికి సూచించారు.  ఆయిల్ పామ్ కు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం , తెలంగాణ నేలలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు.  తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం సాగునీటి వసతి, 24 గంటల కరంటు సరఫరా, ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు పథకాలతో సాగుకు ప్రోత్సాహిస్తామన్నారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ కు అత్యధిక నూనె ఉత్పాదకత, 25 నుండి 30 ఏళ్ల పాటు దీర్ఘకాలిక ఆదాయం, తక్కువగా ఆశించే చీడపీడలు, తక్కువ పెట్టుబడి ఖర్చులు, బై బ్యాక్ గ్యారంటీ పాలసీతో పాటు రాష్ట్రంలో పంటల మార్పులో భాగంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో 20 లక్షల ఎకరాలలో యుద్ధప్రాతిపాదికన, రాబోయే 2022, 2023 సంవత్సరాలలో 3 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక సిద్ధంగా ఉంచామన్నారు.

దేశంలో ఆయిల్ పామ్ సాగుకు అవసరానికి తగినంత విత్తన తోటలు లేవని, ఈ పరిస్థితులలో కోస్టారికా, థాయ్ లాండ్, మలేషియా దేశాల నుండి విత్తన మొలకలు దిగుమతి చేసుకోవడం జరుగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.  తెలంగాణలో ఇప్పటికే ప్రకటించిన 8 లక్షల ఎకరాలకు 14.40 కోట్ల విత్తన మొలకలు అవసరం ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. వాటిలో వచ్చే ఏడాదికి 2.16 కోట్ల విత్తన మొలకలు అవసరంకాగా,  ప్రస్తుతం ఉన్న నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ – ఆయిల్ పామ్ నిబంధనల ప్రకారం హెక్టారుకు రూ.12 వేల విలువైన మొక్కల అవసరం ఏర్పడిందన్నారు.  ఒక్క ఆయిల్ పామ్ విత్తనం మొలక ధర రూ.99 .. దీనిలో 85 శాతం సబ్సిడీ అంటే ఒక్క మొలక రూ.84 కు రైతులకు అందించడం జరుగుతుంది.

అయితే తాజాగా పెంచిన 30 శాతం సుంకం నేపథ్యంలో దిగుమతి చేసుకుని పెంచి రైతులకు అందించే సమయానికి విత్తన కంపెనీలకు అయ్యే ఖర్చు రూ.240 నుండి రూ.250 అవుతుంది. 1991 – 92 నుండి 2019 వరకు ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి ఐటిసి హెచ్ఎస్ 12099910 పండ్ల తోటల పద్దు కింద ఉండేది .. ప్రస్తుతం దీనిని ఐటిసి హెచ్ఎస్ 12071010 పామ్ నట్స్ పద్దు కిందకు మార్చామని తెలియజేశారు.  దీని మూలంగా ఇది 30 శాతం దిగుమతి సుంకం పరిధిలోకి వచ్చిందని, రైతులపై అదనపు భారం పడుతుందన్నారు.  పెంచిన దిగుమతి సుంకం నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో ఆయిల్ పామ్ అభివృద్ధికి భారీ నష్టం కలగనుందని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో నూనెల డిమాండ్ , సరఫరా మధ్య భారీ వ్యత్యాసం పెరిగి వినియోగదారులపై భారం పడనుందని, దిగుమతి చేసుకోనున్న ఆయిల్ పామ్ విత్తన మొలకలు కేవలం నర్సరీలు పెంచడానికి, తర్వాత రైతులకు అందించడానికి మాత్రమే. కానీ గింజలను దిగుమతి చేసుకుని నూనె తీయడానికి కాదని, వాణిజ్య అవసరాలకు అసలే కాదన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహానికి రైతులపై భారం తగ్గించేందుకు దిగుమతి ఆయిల్ పామ్ విత్తన మొలకలను 12071010 బదులుగా 12099910 క్యాటగిరీ కిందనే ఉంచగలరని కేంద్రానికి మనవి చేశారు. ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటగిరిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News