Home Default పనికొచ్చేలా పాతచీరలు

పనికొచ్చేలా పాతచీరలు

Old-Sarees-Making

ఎప్పుడూ ఒకే రకమైన చీరలు కట్టి బోర్ కొట్టినా, పాతవైనా వాటిని తీసేస్తూంటాం. ఒక్కోసారి ఎంతో ఖరీదు పెట్టి కొన్న చీరలను కూడా తీసేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాటి రూపం మార్చి ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు. వాటిల్లో కొన్ని రకాలు…

ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి పలోజోలు. వీటిని ఖరీదు పెట్టి కొనేకంటే ఇంట్లో తీసేయాలనుకుంటున్న పాత చీరలతో కుట్టించుకోవచ్చు. పాత సిల్కు చీరలతో కుట్టించిన పలోజోలపై ఏ రకమైన టీ షర్ట్ వేసుకున్నా సరే పిల్లలు ఫ్యాషనబుల్‌గా కనిపిస్తారు.

పిల్లల ఫ్రాకులు
ఈ పద్ధతి పాతదే అయినా, సరైన ఎంపిక. పిల్లలు చాలా త్వరగా పెరుగుతారు. వారికి ఖరీదైన దుస్తులు కొనేకంటే తీసేద్దామనుకుంటున్న పాత చీరలను కలిపి రంగురంగుల ఫ్రాక్‌లు కుట్టించడం వల్ల వారికి అందమూ, మనకు డబ్బు ఆదా అవడమే కాకుండా పాత చీరల ఉపయోగం కూడా అవుతుంది.

కుషన్ కవర్లు
ఇంటి అందాన్ని ఇనుమడింపజేయడానికి రకరకాల కర్టెన్లు, కుషన్ కవర్లు వాడుతూనే ఉంటాం. ప్రతి సారి ఒకే రకమైన కుషన్ కవర్లను తొడిగే కంటే కాస్తంత వెరైటీగా పాత చీరలతో ప్రయత్నించవచ్చు. వర్షాకాలం మబ్బు పట్టి ఉండే వాతావరణంలో, ఇంట్లో రంగురంగుల చీరలతో తయారైన కుషన్ కవర్లు, కర్టెన్లు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపడం ఖాయం.

కాక్‌టైల్ డ్రెస్సులు
ఎన్నో రకాల సిల్కు డ్రెస్సులు మనం కొంటూనే ఉంటాం, ఎంతసేపూ వాటిని కొనడం కంటే ఈసారి పాత చీరలతో ప్రయ త్నించవచ్చు. రెండు రకాల చీరలను తీసుకుని ఒకదానికొకటి కలుపుతూ కాక్‌టైల్ డ్రెస్సులను కూడా కుట్టించుకుంటే ఆ అందమే వేరు.

ఓవర్ కోట్‌లు / నెహ్రూ జాకెట్

ఓవర్‌కోట్లనేవి ఎవర్ ఫ్యాషన్ దుస్తులు. వీటిని సంప్రదాయ, వెస్టర్న్ దుస్తులపై కూడా వేసుకోవచ్చు. దీనికల్లా పాత చీరతో కోట్ కుట్టించి దానికి తగ్గ బటన్లు, ఎంబ్రాయిడరీ చేసుకోవడమే. అందమైన జాకెట్ మీ డ్రెస్సు అందాన్ని పెంచుతుంది.