Friday, March 29, 2024

32కు చేరిన ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -
Omicron cases in India rise to 32
స్వల్ప లక్షణాలే, ఆందోళన ఏమీలేదు
జాగ్రత్తలు పాటించాల్సిందే: కేంద్ర ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో ఒమిక్రాన్ కేసులు 25 నమోదయ్యాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రకటన తర్వాత మహారాష్ట్రలో మరో 7 కేసులను నిర్ధారించారు. దాంతో, మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది. వీటిలో ఎక్కువభాగం కేసుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని తెలిపింది. ప్రస్తుతానికి ఒమిక్రాన్ వల్ల దేశ ఆరోగ్య వ్యవస్థపై భారం ఏమీలేదని తెలిపింది. అయితే, భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) సలహామేరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచించింది. సంబంధితశాఖల సంయుక్త మీడియా సమావేశంలో దేశంలో కొవిడ్19 తాజా పరిస్థితిపై వివరించారు. 32 ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్రలో 17,రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్నాటకలో 2, ఢిల్లీలో ఒకటి నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) సూచనమేరకు ప్రజా ఆరోగ్యం కోసం సామాజిక మార్గదర్శకాలు పాటిస్తూ వ్యాక్సినేషన్‌ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. చిన్నారుల వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్‌టిఎజిఐ) నుంచి ఇప్పటివరకు ఎలాంటి సిఫారసు అందలేదని మరో అధికారి తెలిపారు. దేశంలోని వయోజనుల్లో 86.2 శాతం మందికి ఒక్కడోసు,53.5 శాతం మందికి రెండు డోసుల కొవిడ్19 టీకాలు అందాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వారం పాజిటివిటీ రేట్ 19జిల్లాల్లో 5 నుంచి 10 శాతం, మూడు రాష్ట్రాలోని 8 జిల్లాల్లో 10 శాతానికిపైగా నమోదైంది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో 8503 కేసులు, 524 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3,46,74,744కాగా, క్రియాశీలక కేసుల సంఖ్య 94,943. మొత్తం మరణాల సంఖ్య 4,74,735గా నమోదైంది. వరుసగా 43వ రోజు 15,000కు దిగువన కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News