Saturday, April 20, 2024

ఒమిక్రాన్ వచ్చిన వ్యక్తి పరార్..

- Advertisement -
- Advertisement -

ఒమిక్రాన్ వచ్చిన ఓ వ్యక్తి పారిపోయాడు
మరో పది మంది విదేశీయుల జాడ తెలియడం లేదు
వారి జాడ కోసం గాలిస్తున్నాం
కర్నాటక ప్రభుత్వం వెల్లడి

బెంగళూరు: కర్నాటకలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన ఇద్దరిలో ఒకరు ఒక ప్రైవేట్ ల్యాబ్‌నుంచి నెగెటివ్ సర్టిఫికెట్ సంపాదించి దేశంనుంచి తప్పించుకు పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలియజేసింది. అలాగే దక్షిణాఫ్రికానుంచి బెంగళూరు వచ్చిన 10 మంది విదేశీ ప్రయాణికులు పత్తా లేకుండా పోయారని, ఆరోగ్య శాఖ అధికారులు వీరి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బిబిఎంసి తెలియజేసింది. కాగా ఈ రోజు రాత్రికల్లా కనిపించకుండా పోయిన 10 మంది జాడ తెలుసుకొని వారికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు రాష్ట్ర రెవిన్యూ మంత్రి ఆర్ అశోక్ శుక్రవారం ఒమిక్రాన్‌పై నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత విలేఖరులకు చెప్పారు. వారి నివేదిక వెల్లడయ్యే వరకు విమానాశ్రయంనుంచి ఆ ప్రయాణికులు దేశం వదిలి వెళ్లడానికి అనుమతించేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికానుంచి వచ్చిన 66 ఏళ్ల వృద్ధుడు కరోనా నెగెటివ్ రిపోర్టుతో నవంబర్ 20 బెంగళూరు వచ్చారు. ఆయనలో లక్షణాలు కూడా కనిపించలేదు. అయినా విమానాశ్రయంలో ర్యాండమ్‌గా నిర్వహించిన కొవిడ్19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. వారం రోజుల తర్వాత ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న ఆయన కరోనా నెగెటివ్ రావడంతో దుబాయ్ వెళ్లిపోయారు. ఆయననుంచి సేకరించిన నమూనాలను ఇన్సాకాగ్ నెట్‌వర్క్‌కు పంపి జన్యుక్రమాన్ని విశ్లేషించగా అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయింది.

ఆ వ్యక్తి నవంబర్ 20న వచ్చాడని, ఏడు రోజుల తర్వాత వెళ్లిపోయాడని మంత్రి చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, అతను బస చేసిన షంగ్రీలా హోటల్‌లో ఏం జరిగిందో చూస్తామని ఆయన తెలిపారు. ఆ వృద్ధుడిని నేరుగా కలుసుకున్న 24 మంది ప్రైమరీ కాంటాక్ట్‌లు, వారిని కలుసుకున్న మరో 240 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రెండో వ్యక్తి బెంగళూరుకు చెందిన డాక్టర్. రెండు డోసులు పూర్తయిన ఆయన ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించలేదు. జ్వరం, ఒళ్లునొప్పులు రావడంతో నవంబర్ 21న కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.ఆ మర్నాడే ఆయన ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జి అయి వెళ్లారు. ఆయననుంచి సేకరించిన శాంపిళ్లను అదే రోజు జన్యు విశ్లేషణకు పంపించగా ఒమిక్రాన్‌గా తేలింది.ఈ కేసులో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే డాక్టర్‌ను కలుసుకున్న వ్యక్తుల్లో ముగ్గురు ప్రైమరీ, ఇద్దరు సెకండరీ కాంటాక్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే వారికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా, కాదా అనేది ఇంకా జన్యు పరీక్షల్లో తేలాల్సి ఉంది. మొత్తంగా 13 మంది ప్రైమరీ, 205 మంది సెకండరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన ఐదుగురిని ఐసొలేషన్‌లో ఉంచారు. కాగా విమానాశ్రయంలో పరీక్షలు లేకుండా తప్పించుకుపోయిన పది మంది జాడ తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చామని, వారి జాడ తెలుసుకుంటామన్న నమ్మకం తనకు ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ చెప్పారు. అయితే ప్రయాణికులు సామాజిక బాధ్యతతలో బాధ్యతగా ప్రవర్తించాలని తాను కోరుతున్నట్లు ఆయన చెప్పారు.

Omicron infected man fed in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News