Home ఎడిటోరియల్ బాలికలకు భరోసా ఎప్పుడు?

బాలికలకు భరోసా ఎప్పుడు?

women

 

రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పసికందుల పై జరుగుతున్న లైంగిక దాడులు సమాజపు తీరు తెన్నులను ప్రశ్నించేవిగా ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో దాదాపు పదికి పైగా ఘటనలు 10 సంవత్సరాలలోపు బాలికలపై వెలుగు చూశాయి. ఇంకా బయటపడని ఘటనలు ఎన్నో ఉండే ఉంటాయి. వరంగల్‌ల్లో తొమ్మిది నెలల పసికందు పై అఘాయిత్యం జరిగిన 24 గంటలలోపే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 9 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బయటకు వచ్చింది. ఇక అదే హైదరాబాద్‌లో ఆరు సంవత్సరాల బాలికపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడిన ఘటన మానవ సంబంధాలను పూర్తిగా నాశనం చేసింది. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో మరో ఇద్దరు పది సంవత్సరాలలోపు బాలికలపై లైంగిక దాడి జరిగిన సంఘటన బయటపడింది.

బాలికలపై లైంగిక దాడులను నిరోధించడానికి రూపొందించిన పోక్సో చట్టం( ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్స్ ఆక్ట్) వంటివి సైతం బాలికలను ఈ దాడుల నుంచి కాపాడేలేకపోతున్నాయి. జాతీయ నేర నమోదు విభాగం (ఎన్.సి.ఆర్.బి) గణాంకాల ప్రకారం మహిళలపై జరుగుతున్న దాడులు 40 శాతం బాలికలపై జరుగుతున్నట్లు వెల్లడైంది. ఇందులో అధిక శాతం నేరస్థులు వారి దగ్గర బంధువులు కావడం గమనించాల్సిన అంశం. అందుకే పోక్సో చట్టంలో అధిక శాతం కేసులు వీగిపోతున్నాయి. ఇటువంటి దాడులు జరిగినప్పుడు కేసుల విచారణ వేగవంతంగా జరగవలసిన అవసరం ఉంటుంది. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అందుబాటులో లేకపోవడం తో కేసుల విచారణ చాలా ఆలస్యం అవుతుంది . దీంతో అనేక మంది నేరగాళ్లు సులభంగా తప్పించుకోగలుగుతున్నారు.

ప్రస్తుత సమాజంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కనబడటం లేదు. వరుసగా బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను చూశాక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నారు. ఆడపిల్లలకు రక్షణ కరువవుతున్న ప్రస్తుత పరిస్థితులలో వారిని రక్షించలేక చాలా మంది తల్లిదండ్రులు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి అమ్మాయి అయితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. తాజా గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది బాలురకు 900 కన్నా తక్కువ మంది బాలికలు మాత్రమే జన్మిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

చెడు వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సామాజిక పరిస్థితులలో మానవుని ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. వరసగా బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి చట్టాలను కఠినతరం చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నేరస్థులను త్వరగా శిక్షించాలి. ప్రజలు సైతం తమ సొంత ప్రయోజనాలు కాకుండా కొంత సామాజిక రుగ్మతల నిర్మూలనకు కూడా పాటుపడాలి. ఇటువంటి లైంగిక దాడులకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ కఠిన వైఖరి అవలంబించాలి. మానవునిలో సామాజిక విలువలు పెంచే దిశగా వ్యక్తులు, వ్యవస్థలు కృషి చేయాలి.

ఇందుకోసం ప్రజల్లో లైంగిక దాడులు వాటికి గల చట్టాలు, అవి పెరగడానికి గల కారణాలు, నివారణ మార్గాలపై సమాజంలో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలి. మహిళల రక్షణ, సామాజిక విలువలు, సాంఘికరణ వంటి అంశాలను లోతుగా విశ్లేషించే జెండర్ స్టడీస్, సోషియాలజీ, సోషల్ వర్క్ వంటి సామాజిక శాస్త్రాలు అన్ని తరగతులలో అందుబాటులో ఉంచాలి. బాలికల రక్షణపై భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లేకపోతే భ్రూణ హత్యల సంఖ్య పెరిగి లింగ నిష్పత్తి మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు, వ్యక్తులు కృషి చేస్తారని ఆశిద్దాం.

One in five women have been sexually assaulted