Home ఎడిటోరియల్ గుజరాత్‌లో మరో ఉనా

గుజరాత్‌లో మరో ఉనా

Cow-National-Animal

చనిపోయిన ఆవు చర్మం ఒలిచినందుకు గుజరాత్‌లోని ఉనాలో నలుగురు హరిజన యువకులను దారుణంగా కొట్టిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే తాజా ఘటన మరొకటి ఆ రాష్ట్రంలోనే మరో గ్రామంలో జరిగింది. ఆనంద్ జిల్లాలోని సోజిత్ర తాలూకా కాసోర్ గ్రామంలో ఒక దళిత యువకుని, అతని తల్లిని అగ్రకులాలకు చెందిన 100 మంది బృందం ఈ నెల 12న తీవ్రంగా కొట్టింది. శైలేష్ భాయ్ మణిభాయ్ రోహిత్ అనే యువకుడిని, అతని తల్లి మణిబెన్ రోహిత్ ను వారి ఇంట్లోనే దాడిచేసి కొట్టారు. చనిపోయిన ఒక ఆవు చర్మం ఒలిచిన నేరానికి వారిపై దర్బార్ క్షత్రియ కులం వారు ఈ దాడి జరిపారు. అదే రోజు రాత్రి ఆ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, ఎస్‌సి/ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ దాఖలయింది. ఆ తర్వాత మరి 12మందిని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చారు.
అంతకు ముందురోజు (ఈ నెల 11న) శైలేష్‌ను ఆ గ్రామానికి చెందిన అగ్ర కులస్థుడు గౌతాభాయ్ భగత్ పిలిపించి తమ ఆవు చనిపోయిందని, దానిని అక్కడి నుంచి తీసుకుపోవాలని పురమాయించినట్లు తెలుస్తోంది.
‘చనిపోయిన పశు కళేబరాలను తొలగించడం, వాటి చర్మం ఒలవడం వంటి వృత్తి పనులను మా కుటుంబం చాలా కాలం నుంచి మానివేసింది. కానీ మేము దళితులం కాబట్టి అగ్ర కులస్థులయిన గ్రామస్థులు కొందరు అటువంటి పనులు పురమాయిస్తూ ఉంటారు. వారిలో కొందరికి మా కుటుంబంతో మంచి సంబంధాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. అందుచేత వారి విజ్ఞప్తి మేరకు చనిపోయిన పశువులను తీసుకుపోతుంటాము’ అని శైలేష్ అన్న ప్రకాశ్ భాయ్ మణిబాయ్ రోహిత్ చెప్పాడు.
తన తల్లిని, తమ్ముణ్ణి అగ్ర వర్ణస్థులు కొట్టిన రోజున తాను ఇంట్లో లేనని అతడు తెలియచేశాడు. వారిద్దరూ తన ఏడాది బిడ్డను చూసుకోడానికి ఇంటి వద్ద ఉండగా ఈ దుర్ఘటన జరిగినట్లు వివరించాడు. ముందుగా తన తమ్ముడు 21 ఏళ్ల శైలేష్‌ను ఆ సమూహం కొట్టడంతో అతడి అరుపులు విని రక్షించడానికి వచ్చిన తన 50 ఏళ్ల తల్లిని వారు మరింత తీవ్రంగా గాయపరిచారని అతడు చెప్పాడు. ఐదుగురు కలిసి శైలేష్‌ను నేల మీద అదిమిపట్టి ఉంచగా, మరి ఐదుగురు అతణ్ణి కొట్టారని, పీక పిసికి చంపడానికి కూడా ప్రయత్నించారని, అంతలో ఇరుగుపొరుగు జనం వచ్చి కొట్టడం ఆపాలని ఆ సమూహాన్ని ప్రార్థించడంతో వారు వెళ్లిపోయారని శైలేష్ అన్న తెలిపాడు. వారు వెళ్లిపోతూ తన తమ్ముణ్ణి, తల్లిని కులం పేరుతో దూషించారని, తీవ్రంగా బెదిరించారని కూడా అతడు చెప్పాడు. తన ఏడాది పసి బిడ్డను సజీవంగా దహనం చేస్తామని కూడా వారు బెదిరించారని వాపోయాడు. గాయాలవల్ల అతని తల్లి మూత్రపిండం వాచినట్లు ఆసుపత్రి వైద్యులు చెప్పా రు. ‘మేము వారి కుళ్లుని శుభ్రం చేస్తాం. కాని వారు మమ్మల్ని కొట్టి బెదిరిస్తారు’ అని ప్రభాష్ భాయ్ కన్నీళ్లు పెట్టుకొన్నాడు. ఆ గ్రామ సర్పంచ్ కాంతిభాయ్ ఫూలాభాయ్ పార్మర్ కుమారుడు కూడా ఆ దళితులను కొట్టినవారిలో ఉన్నట్లు తెలిసింది. అతడు అరెస్టయ్యాడు కూడా. ఆ గ్రామ శ్మశానం వద్ద వాడుకలో లేని ప్రభుత్వ భూమి వద్దకు ఆ ఆవు కళేబరాన్ని శైలేష్ తీనుకుపోయాడు.
వివాదానికి కీలకం శ్మశాన భూమి
‘చనిపోయిన ఆవును తొలగించాలని భగత్ నన్ను పిలిపించి చెప్పాక ఒక ట్రాక్టర్‌ను తెప్పించాను. మామూలుగా పశు కళేబరాలకు దళితులు అంతిమ విధులు జరిపే చోట ఇటీవలి వరదల వల్ల బురదగా ఉండడంతో అంతవరకూ వాడకంలో లేని ఆ సమీపంలోని ప్రభుత్వ స్థలం వద్ద ఆ పని చేయడానికి నిర్ణయించుకొన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు నేను అక్కడకు చేరగానే సర్పంచ్ నలుగురు గ్రామస్థులతో అక్కడ ఉన్నాడు. ఆ కళేబరాన్ని అక్కడకు తెచ్చినందుకు దర్బార్లు కోపంతో ఉన్నారు. 40మంది సమూహం నిన్ను కొట్టడానికి వస్తూంది. శ్మశాన స్థలం ఖరాబు కావడం వాళ్లకు ఇష్టం లేదు’ అని సర్పంచ్ తనను హెచ్చరించినట్లు శైలేష్ తెలిపాడు.
‘అందువల్ల ఆ కళేబరాన్ని తక్షణమే అక్కడనుంచి తీనుకుపోడానికి సిద్ధమయ్యాను. సాధాణంగా దళితులు పశు కళేబరాలకు ఆఖరి విధులు జరిపే చోటు మునిగి ఉన్నా అక్కడే ఆ పని కానిచ్చాను. అక్కడితో ఆ వ్యవహారం ముగిసింది అనుకొన్నాను’ అని శైలేష్ వివరించాడు. ఆ మరునాడు ఉదయం 8.30 గంటల సమయంలో దర్బార్ల సమూహం శైలేష్ ఇంటిపై దాడిచేసి అతడిని, అతడి తల్లిని తీవ్రంగా కొట్టి, కులం పేరుతో దుర్భాషలాడి, తీవ్రంగా హెచ్చరించారు. శైలేష్ అన్న ఏడాది బిడ్డను సజీవ దహనం చేస్తామని బెదిరించారని, ఆ ఊరిలోని దళితులందరి ఇళ్లను (40 గుడిసెలు) తగలబెడతామని కూడా హెచ్చరించారని శైలేష్ తెలిపాడు. పోతూ పోతూ అదే గ్రామంలో ఉంటే చంపుతామని కూడా వారు తనను గట్టిగా అరుస్తూ బెదిరించారని, కేసు పెడతామని ఇరుగుపొరుగు వారు చెప్పినప్పుడు తమను వెక్కిరించారని కూడా చెప్పాడు. అత్యాచారాల చట్టం పనికిరానిదని, ఆ చట్టం కింద కేసు పెట్టినా తమకేమీ కాదని కూడా వారు అన్నారని శైలేష్ తెలిపాడు.
తెమలని పాత అత్యాచారం కేసు
కాసోర్ గ్రామంలో 13,000 మంది నివసిస్తున్నారు. వారిలో 12,000మంది దర్బార్ లేదా ఠాకూర్ కులస్థులు. కేవలం 250 మందితో కూడిన 40 కుటుంబాలవారే దళితులు. అక్కడ కుల వివక్ష ఉదంతాలు కొత్త కాదు. ఆలయాల్లోకి దళితులను రానివ్వరు. సమీపంలోని కంబాట్, ఉమ్రేద్ గ్రామాల ఆలయాల్లో కూడా అదే వెలి అమలులో ఉంది. 2012 లో కాసోర్ గ్రామానికి చెందిన ఒక దళితుని కొట్టిన ఘటనపై ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదు. పోలీసులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల ఆ దర్యాప్తు ఆలస్యం అవుతోంది. ఆ కుటుంబం ఇంకా భయం భయంగా గడుపుతోంది. ఆ ప్రాంతంలో
‘రాష్ట్రీయ దళిత అధికార్ మంచ్’ అనే సంస్థ జిగ్నేశ్ మివానీ సారథ్యంలో దళిత ప్రజల రక్షణకు కృషి చేస్తోంది. ఏడాది క్రితం ఉనా ఘటన తర్వాత దళితులు పశు కళేబరాల అంతిమ విధులు నిర్వర్తించ బోమని ‘ఉనా దళిత అస్మిత యాత్ర’లో ప్రతిన బూనారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ పని ఏదీ లేకపోవడంతో అదే వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే చుట్టుపక్కల కొన్ని గ్రామాల దళితులు ఆ పని మానివేసి ప్రత్యామ్నాయం వెదుక్కోగలిగారు. దానితో దళితులకు వారి వృత్తి నిమిత్తం అంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన చిన్న స్థలం పనికి రాకుం డా పడిఉంది. ఆ భూమి ఆక్రమణకు అగ్ర కులాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వాల అలసత్వంవల్ల ఉనా ఘటనలు ఇలా ఎక్కడో అక్కడ తరచూ జరుగుతూనే ఉన్నాయి.

– దమయంతీ ధర్