Friday, March 29, 2024

పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్

- Advertisement -
- Advertisement -

online audit in panchayats in telangana

హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై పారదర్శకత కోసం ఈ నెల 3వ తేదీ నుంచి ఆన్‌లైన్ ఆడిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆన్‌లైన్ ఆడిట్ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అందులో భాగంగానే ఈ ఆడిట్‌ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఇప్పటికే పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్, ఈ ఆఫీస్‌కు శ్రీకారం చుట్టింది. అదే సమయంలో ఆన్‌లైన్ ఆడిట్‌లోనూ తెలంగాణ ముందుంది. రాష్ట్రంలోని 542 మండలాల్లోని 12,769 గ్రామ పంచాయితీల్లో సుమారు 3,830 (30%) గ్రామ పంచాయితీల్లో ఈ ఆన్‌లైన్ ఆడిట్‌ను ప్రారంభించనుంది. ఆన్‌లైన్ ఆడిట్‌పై పంచాయితీరాజ్ శాఖ, ఆడిట్ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఎలా ఆడిట్ నిర్వహించాలనే దానిపై గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఆడిటర్లకు సంయుక్తంగా ఇరు శాఖల ఉన్నతాధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు.

ఆన్‌లైన్ ఆడిట్ ప్రక్రియపై గ్రామ పంచాయితీల కార్యదర్శులకు ఆన్‌లైన్ ఆడిట్ వెబ్ సైట్ ద్వారా సమాచారాన్ని కూడా అందజేశారు. దాదాపు 336 మంది ఆడిట్ అధికారులు శిక్షణా పూర్తి చేసుకుని ఆడిట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఆడిట్ అధికారులను ప్రభుత్వం నియమించింది. వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 20 శాతం గ్రామపంచాయితీల ఆడిట్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని 15వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. 15వ ఆర్ధిక సంఘం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్రంలో 30 శాతం గ్రామ పంచాయతీల్లో రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ మార్తినేని వెంకటేశ్వరరావు ఆన్‌లైన్ ఆడిట్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 3830 గ్రామ పంచాయితీల్లో 336 మంది ఆడిటర్లతో ఆగస్టు మూడో తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 31 వ తేదీ వరకు ఈ ఆన్ లైన్ ఆడిట్ జరగనుంది.

ఈ మేరకు డైరెక్టర్ కార్యాచరణను సిద్ధం చేశారు. అయితే తెలంగాణ మాదిరి దేశంలో ఆన్ లైన్ ఆడిట్‌కు ఇంకా పలు రాష్ట్రాలు సిద్ధ కాకపోవడం గమనార్హం. జిల్లాల వారీగా ఆడిటర్ల కేటాయింపు ఇలా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 10, కరీంనగర్ 17, ఖమ్మం 19, మహబూబ్‌నగర్ 8, మెదక్ 8, నల్లగొండ 18, నిజామాబాద్ 19, రంగారెడ్డి 13, వరంగల్ అర్బన్ 11, మంచిర్యాల్ 6, నిర్మల్ 10, కొమురం భీం ఆసిఫాబాద్ 5, పెద్దపల్లి 9, జగిత్యాల 14, రాజన్న సిరిసిల్ల 8, భద్రాద్రి కొత్తగూడెం 12, జనగాం 9, జయశంకర్ భూపాలపల్లి 6, జోగులాంబ గద్వాల 6, కామారెడ్డి 10, మహబూబాబాద్ 09, మేడ్చల్ మల్కాజ్‌గిరి 7, నాగర్‌కర్నూల్ 8, సంగారెడ్డి 13, సిద్ధిపేట 11, సూర్యాపేట, వికారాబాద్‌కు 12, వనపర్తి 6, వరంగల్ రూరల్ 14, యదాద్రి భువనగిరి 15, ములుగు 5, నారాయణపేట జిల్లాలో 6గురు ఆడిటర్లను ప్రభుత్వం నియమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News