Thursday, April 25, 2024

బి.టెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

- Advertisement -
- Advertisement -

మూడు నెలల పాటు ఉచితం


మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొయెంప్ట్ ఎడు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్‌లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు www.EduLib.in లెర్నింగ్ పోర్టల్ ద్వారా మూడు నెలల పాటు ఉచితంగా ఆన్‌లైన్ పాఠాలు అందించనున్నట్లు సంస్థ సిఇఇ విఎస్‌ఎన్ రాజు తెలిపారు. మొత్తం 165 సబ్జెక్టులు, 700లకు పైగా ప్రాక్టికల్స్‌ను యానిమేషన్ వంటి మల్టీ మీడియా, వాయిస్ ఓవర్, టెక్ట్, పిక్చర్స్ ద్వారా రూపొందించినట్లు పేర్కొన్నారు. బి.టెక్‌లో సిఎస్‌ఇ, ఐటి, మెకానికల్, సివిల్, ఇఇఇ, ఇసిఇ తదితర బ్రాంచీలకు సంబంధించి ప్రథమ సంవత్సరం నుంచి నాలుగవ సంవత్సరం వరకు సిలబస్‌కు సంబంధించిన ఆన్‌లైన్ పాఠాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని కంప్యూటర్, లాప్‌టాప్ ద్వారా లాగిన్ కావచ్చని వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు సమయం వృథా చేసుకోకుండా ఇంటి నుంచే తమ ప్రిపరేషన్ కొనసాగించేలా ఆన్‌లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

డిజిటల్ పాఠాలు రూపొందించిన ఎన్‌సిఇఆర్‌టి

కరోనావైరస్ వల్ల పిల్లలకు ఈసారి వేసవి సెలవులు చాలా ముందే వచ్చాయి. కొత్త విద్యాసంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ సమయాన్ని వృథా చేయకుండా ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు తమకు ఇష్టమైన పుస్తకాలను, పాఠ్యాంశాలను చదువుకోవచ్చు. దీనికోసం ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన ఇ పాఠశాల యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఉమాంగ్ యాప్‌లో దాదాపు కోటి ఇ -పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, విద్యాసంబంధమైన ఆడియోలు, వీడియోలు ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ స్కూల్ విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులు ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విండోస్ డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా ఇది పనిచేస్తుంది. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా ప్రభుత్వం దీన్ని రూపొందించింది. ఒకటి నుంచి 12వ తరగతి (ప్లస్ టు) వరకు అన్ని పాఠ్యపుస్తకాలు, సప్లిమెంటరీ రీడింగ్ మెటీరియల్ ఈ యాప్‌లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ ఇతర అనేక భారతీయ భాషల్లో యాప్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. దాదాపు 5 కోట్ల మందికిపైనే విద్యార్థులు ఇప్పటివరకు దీన్ని ఉపయోగించుకున్నారు. విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా పూర్తిగా స్టూడెంట్ ఫ్రెండ్లీగా దీన్ని రూపొందించారు. వెబ్‌సైట్: web.umang.gov.in

అమెజాన్ ఆడియో పుస్తకాలు

కరోనా సెలవుల సందర్భంగా పిల్లల కోసం అమెజాన్ సంస్థ ఉచిత ఆడియో పుస్తకాలను వినియోగించుకునే అవకాశం కల్పించింది. సెలవులు పూర్తయిన తర్వాత వీటిని ఉపయోగించుకోవాలంటే ఫీజు చెల్లించాలి. చదవాల్సిన అవసరం లేకుండా వింటూ నేర్చుకునేందుకు వీలుగా ఆడియో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని పొందడానికి స్టోరీస్.ఆడిబుల్.కామ్/డిసక్వరీ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలి. ఇందులో నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకుని కళ్లతో చదవకుండా వింటూ పూర్తి విసయాన్ని తెలుసుకోవచ్చు. ఇందులో పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్రపంచ ప్రఖ్యాత రచయితలు రాసిన ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు ఉపయోగపడే కథలతో పాటు కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు అవసరమైన పుస్తకాలు ఉన్నాయి.

Online classes for Btech students in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News