Home తాజా వార్తలు ఆగస్టు 1 నుంచి పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు..?

ఆగస్టు 1 నుంచి పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు..?

Online classes for school students to begin from august 1

 

వారంలో ఐదు రోజుల పాటు డిజిటల్ తరగతులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 1 లేదా ఆగస్టు 16 నుంచి ఆన్‌లైన్ తరగతులు మొదలు కానున్నాయి. బ్రిడ్జి క్లాసులు ఈ నెల 30 వరకు కొనసాగించి ఆ తర్వాత ఆయా తరగతుల పాఠాలు బోధించనున్నట్లు తెలుస్తోంది. లేని పక్షంలో బ్రిడ్జి క్లాసులను వచ్చే నెల 15 వరకు కొనసాగించి, ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో తరగతుల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 6వ తరగతి నుంచి 10 వరకు వారంలో ఐదురోజులు మాత్రమే క్లాసులు జరగనున్నాయి. ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు రోజుకు రెండు సెషన్స్‌లో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిసింది.

ఇందుకోసం ఇప్పటికే పాఠశాలలకు టీచర్లు హాజరవుతూ ఆన్‌లైన్ పద్దతిలో జరుగనున్న బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ డిజిటల్ తరగతులకు హాజరయ్యేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చూసేలా పాఠశాలు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆయా గ్రామాలలో విద్యార్థులకు టివిలు, స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్థుల వివరాలు తెలుసుకుని, టివిలు లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామాల స్థానిక పరిస్థితులను బట్టి గ్రామ పంచాయతీలు, స్వఛ్చందంగా ముందుకు వచ్చే యువత సహకారంతో టివిలు లేని విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

30 వరకు బ్రిడ్జి కోర్సుల షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో మూడవ తరగతి నుంచి 10 తరగతులకు విద్యార్థులకు కొనసాగుతున్న బ్రిడ్జి కోర్సుల టైం టేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 30 వరకు దూరదర్శన్, టి సాట్‌లో రోజువారీగా ప్రసారమయ్యే ఆన్‌లైన్ తరగతులకు షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ తేదీలలో వారంలో ఐదు రోజులపాటు డిజిటల్ క్లాసులు ప్రసారం అవుతున్నాయి. ప్రతి రోజు నిర్వహించే సెషన్స్ సంఖ్య, వ్యవధిని షెడ్యూల్ పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులకు వారీగా ఆన్‌లైన్ క్లాసులు ప్రసారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరూ బ్రిడ్జి కోర్సు డిజిటల్ తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

Online classes for school students to begin from august 1