సమాచారం లేక మొదటి రోజు
తక్కువ సంఖ్యలో వీక్షించిన విద్యార్థులు
25,27,28 తేదీలలో మూడు రోజులపాటు
కొనసాగనున్న క్లాసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 8,9,10 తరగతులకు సోమవారం టీ సాట్ ఛానల్ ద్వారా ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠాలు ప్రసారమయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. 8,9,10 తరగతులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాసాంకేతిక సంస్థ(సైట్) ఈ నెల 28 వరకు ఆన్లైన్ పాఠాల నిర్వహణకు టైం టేబుల్ రూపొందించింది. ఈ టైం టేబుల్‌కు అనుగుణంగా టీవీ పాఠాలు ప్రసారమవుతున్నాయి. ఈ నెల 30 వరకు సెలవులు మినహాయించగా, నాలుగు రోజులు మాత్రమే ఆన్లైన్ పాఠాలు కొనసాగనున్నాయి. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం కాగా, ఈ నెల 29న శనివారం, 30న ఆదివారాలు పాఠాలు ఉండవు. ఒకవేళ రాష్ట్రంలో మళ్లీ సెలవులు పొడిగిస్తే వారంలో ఐదు రోజులపాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేలా టైం టేబుల్ రూపొందించనున్నారు.
మొదటి రోజు అంతంత మాత్రమే హాజరు
రాష్ట్రంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు ప్రారంభమైనప్పటికీ మొదటిరోజు అంతంత మాత్రంగా విద్యార్థులు వీక్షించినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ పాఠాల పాఠశాల విద్యాశాఖ అంతగా ప్రచారం చేయకపోవడంతో చాలామంది విద్యార్థులకు సోమవారం నుంచి టీవీ పాఠాలు ప్రసామవుతాయనే సమాచారం కూడా లేదు. దాంతో చాలామంది విద్యార్థులు టీవీ పాఠాలు వీక్షించలేకపోయినట్లు సమాచారం. గత రెండేళ్లుగా విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు అలవాటుపడి ఉన్నారు. అయితే వారికి సకాలంలో సమాచారం అందించలేకపోవడం, వారిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు సరైన చర్యలు లేకపోవడంతో మొదటి రోజు ఎక్కువ మంది విద్యార్థులు వీక్షించలేకపోయినట్లు తెలుస్తోంది.
రెండో వారంలో విద్యాసంస్థలు పునఃప్రారంభం..?
రాష్ట్రంలో విద్యాసంస్థలకు ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మధ్యలో కొవిడ్ కేసులు తగ్గే అవకాశాలు ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేలో పిల్లల్లో కొవిడ్ లక్షణాలు, ఇతర జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించినటుల తెలిసింది. ఈ నేపథ్యంలో మరో వారం లేదా రెండు వారాల పాటు సెలవులు పొడిగించి ఆన్లైన్ తరగతులు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ మొదటి వారంలో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించినా హాజరు తప్పనిసరి కాకుండా తల్లిదండ్రులు ఇష్టం మేరకే విద్యార్థులకు పాఠశాలలకు పంపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
Online classes started to students of 8,9,10 standard