టెక్నాలజీ వినియోగంతో అంతరాయం లేని విద్యుత్
స్కాడా పరిధిలోకి 228 సబ్స్టేషన్లు
మెరుగైన ఫలితాల కోసం కృషి
65 నుంచి 68 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం
రెండు నెలల్లో అనుసంధానం చేసేందుకు కసరత్తు
మన తెలంగాణ/సిటీబ్యూరో : వేసవి వస్తుండటంతో విద్యుత్సరఫరాలో ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే గుర్తించి పరిష్కరించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు టిఎస్ఎస్పిడీసీఎల్ అధికారులు సిద్దం అయ్యారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, బ్రేక్ డౌన్ సమస్య తలెత్తినా, లో వోల్జేజ్ సమస్య వచ్చినా సబ్స్టేషనలో సంబంధిత సమస్యను గుర్తించి వాటికి పరిష్కారం చూపేలా ఆన్లైన్ పర్యవేక్షణను యాజమాన్యం అమలు చేస్తుంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, డిమాండ్, వినియోగం, సబ్స్టేషన్ల పర్యవేక్షణ, విద్యుత్ సరఫరా నిర్వహణ (డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్) పేరుతో అందుబాటులోకి తెచ్చినా స్కాడా ప్రాజెక్టు ద్వారా మెరుగైన ఫలితాలను అందుకోవడానికి కృషి చేస్తున్నారు. కొత్త టెక్నాలజి ఉపయోగించుకుని నగర పరిధిలోని 228 సబ్స్టేషన్లో ఇప్పటికే స్కాడా పరిధిలోకి వచ్చిన 121 విద్యుత్ సబ్స్టేషన్లు పని తీరును ఆన్లైన్లో పరిశీలిస్తున్నారు.
గ్రేటర్ జోన్ పరిధిలో ప్రస్తుతం రోజుకు 45 నుంచి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా వచ్చే వేసవి నాటికి ఇది క్రమంగా పెరుగుతూ 60 మిలియన్ యూనిట్లు దాటి 65 నుంచి 68 మిలియన్ యూనిట్లకు వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పెరుగుతున్న ఎండలతో క్రమంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ సరఫరా కోసం 33కేవీ బస్స్టేషన్లు, 228 వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 121 విద్యుత్ సబ్స్టేషన్లు మాత్రమే స్కాడాతో అనుసంధానం చేశారు. స్కాడాతో అనుసంధానం అయినటువంటి విద్యుత్ సబ్స్టేషన్లలో ఫీడర్లలో ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే గుర్తించడమే కాకుండా సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. సబ్స్టేషన్లను ఆన్లైన్లో పర్యవేక్షించడం ద్వారా సమయం వృథా కాకుండా సమస్యకు వెంటనే పరిష్కారం దొరకడంతో పాటు విద్యుత్ వినియోగదారులకు సత్వర సేవలు అందుతాయని అధికారులు చెబుతున్నారు.
సబ్స్టేషన్లలో విద్యుత్ నిలిపివేసేటప్పుడు పునరుద్దరణ ఆలస్యం అయితే సంస్థకు నష్టాలు పెరుగుతుంటాయి. ఈ నష్టాలు పూర్తి స్థాయిలో తగ్గించడంతోపాటు ఆదాయం పెంచేలా స్కాడా ప్రాజెక్టు ఉపయోగ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కళ్యాణ్ నగర్లోని స్కాడా కార్యాలయం పరిధిలో గ్రేటర్లో పరిధిలోని 228 సబ్స్టేషన్లను అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దీని పరిధిలోకి 121 సబ్స్టేషన్లనుంచి పర్యవేక్షణ మంచి ఫలితాలు ఇస్తుండటంతో మిగతావి త్వరలో పూర్తి చేసేలా చర్యలు వేగవంతం చేశారు. ఆన్లైన్ విద్యుత్ బస్స్టేషన్ల పనితీరు కావడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. గ్రేటర్పరిధిలో విద్యుత్ వినియోగదారులు మెరుగైనసేవలు అందించేందుకు టిఎస్ఎసిడీసీఎల్ అధికారులు ఇటీవల సర్కిళ్ళ సంఖ్యను 10కి పెంచింది. అదే విధంగా డివిజన్లను, సెక్షన్లను పెంచడం ద్వారా విద్యుత్ సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రస్తుతం అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లను పరిశీలిస్తే వాటి సంఖ్య 51 లక్షలకు పైగా పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలను ఎత్తివేసి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం 33 కేవీ సబ్స్టేషన్ల 228 అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కడికక్కడే పర్యవేక్షించే పద్దతికి స్వస్తి చెప్పి ఇక నుంచి అన్నింటిని నుంచి ఒక చోట నుంచి ఆన్లైన్లో పర్యవేక్షించడాన్ని స్కాడా ప్రారంభించింది. ఇప్పటి వరకు దీనికి 121 సబ్స్టేషన్లను అనుసంధానం చేయగా మిగిలిన 107 సబ్స్టేషన్లను మరో రెండు నెలల్లో అనుసంధానం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.