Saturday, April 20, 2024

వలసకార్మికుల రవాణాకు ఎక్కువగా స్పెషల్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

Oparate more Special trains for Transportation of Migrant workers

 

రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సూచన

న్యూఢిల్లీ : రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. వలస జీవుల్లో మహిళలు, పిల్లలు, వయో వృద్ధులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. ఈమేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖల ద్వారా తెలియచేశారు. రాష్ట్రాలు, రైల్వే మంత్రిత్వశాఖ సమన్వయంతో స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడపాలని సూచించారు. వలసకార్మికుల విశ్రాంతి స్థలాల్లో శానిటేషన్, ఆహారం, వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. వలస కార్మికులను రైళ్లు,బస్సుల్లో పంపేటప్పుడు పారదర్శకత ఉండాలని, అది లోపించడంతో అనేక వదంతులు వ్యాప్తి చెంది వలస కార్మికుల్లో ఆందోళన పెరుగుతోందని అన్నారు.

మహిళలు, పిల్లలు, వృద్ధుల నిర్దిష్ట అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నిర్దేశిత విశ్రాంతి స్థలాలకు లేదా సమీప బస్సు స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు కాలినడకన బయలుదేరే వారికి జిల్లా అధికారులు మార్గదర్శకులు కావాలని, వారికి రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. విశ్రాంతి స్థలాల్లో సుదీర్ఘకాలం క్వారంటైన్ ఉంటుందన్న అపోహలను తగ్గించాలని, ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం, ఎన్‌జిఒ వర్కర్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్రాష్ట సరిహద్దుల్లో వలస కార్మికుల బస్సులు ప్రవేశించేలా చూడడంతోపాటు ఆహారం, ఆరోగ్యభద్రత, కౌన్సెలింగ్ వంటివి తగిన విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News