Sunday, March 26, 2023

ఓపెన్ బార్లలా దాబాలు

- Advertisement -

bar

కళాశాలల పక్కనే దాబాల్లో దందా
కాసుల మత్తులో స్థానిక ఖాకీలు
మద్యం విక్రయాలే లక్షంగా
మౌనమునులుగా ఎక్సైజ్ శాఖ
మూడు జిల్లాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
పదుల సంఖ్యలో విద్యార్థుల బైక్‌లు రియ్ రియ్ మంటూ మిట్ట మధ్యాహ్నం దాబా ముందు ఆగితే …ఆకలి వేసిందేమో భోజనం చేయడానికి వచ్చారేమో అనుకోవడం పరిపాటి. కానీ వచ్చిన విద్యార్థుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న షెడ్‌లలో ఎక్కడ కూడా ప్లేట్లు కనిపించడం లేదు…అంతా బీరు బాటిళ్ల చప్పుడు సిగరెట్‌ల సొగ. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద గల దాబాలలో ప్రతినిత్యం జరుగుతున్న తంతు. ఒక్క మొయినాబాద్ మండలంలోనే ఇలాంటి దందా జరుగుతుందనుకుంటే పొరపాటుగానే భావించాలి. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో హైవేలకు ఆనుకొని మద్యం దుకాణాలను ప్రభుత్వం సుప్రీం కోర్టు అనుమతులతో 500 మీటర్ల లోపలికి తరలించడంతో రహదారులపై ఉన్న మెజారిటీ దాబాలు ప్రస్తుతం మద్యం దుకాణాలుగా ఓపెన్‌బారులుగా మారిపోయాయి.

బయట ప్యామిలీ దాబా అని తాటికాయ అంత అక్షరాలతో బోర్డులు పెట్టి లోపల మాత్రం మందుబాబుల కోసమే అన్న మాదిరిగా ఏర్పాట్లు చేస్తారు. మద్యం విక్రయాలను పెంచి సర్కార్ మెప్పు పొందాలన్న తహతహ తప్ప ఎక్కడ మద్యం అమ్మితే తమకు ఎందుకు అన్న భావంతో ఎక్సైజ్ అధికారులు పనిచేస్తుండగా తమకు కావలసిన నజరానాలు అందితే చాలు అన్న మాదిరిగా కొంత మంది ఖాకీలు వ్యవహరిస్తుండటంతో దాబాలు కాస్తా ఓపెన్‌బార్‌లుగా మార్చివేశారు. సైబారాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో హైదరాబాద్- బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న అజీజ్‌నగర్ వద్ద దాబాలలో కళాశాలకు వెళుతున్న విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగి బైక్‌లపై నగరానికి వస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. చేవెళ్ల చౌరస్తాలోని దాబాలలో సైతం విద్యార్దుల హడావిడి ఉంటుంది. చెవెళ్ల, శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు అర కి.మి దూరంలోనే దాబాలలో మందు బాబులు వచ్చి ఆర్డర్ ఇస్తే చాలా ఐదు నిమిషాలలో మందుతో పాటు కావలసిన వంటకాలు సిద్దం అవుతాయి. షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని షాద్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడం, కొత్తూర్ దాబాలలో మూడు క్వార్టర్‌లు….ఆరు బీరు సీసాలుగా వ్యాపారం వర్ధీల్లుతుంది. షాద్‌నగర్ నియోజకవర్గం పాలమూరు జిల్లాలో ఉన్నప్పుడు కొంత వరకు కంట్రోల్‌లో ఉన్న సైబారాబాద్‌లో కలిసిన అనంతరం దాబాల నిర్వహకులు మరింత బరితెగించి బహిరంగంగానే మందు త్రాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం త్రాగి హైవేలపై ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని….మందుబాబుల వలన రహదారిపై వెల్లుతున్నవారు సైతం ప్రమాదాల పాలవుతున్నారు. మహేశ్వరం, కందుకూర్, ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో సైతం ఇదే వాతావరణం కనిపిస్తుంది.
రాచకొండ కమిషనరేట్‌లోను సేమ్ సీన్…
అక్రమాలపై దూకుడుగా వ్యవహరించే రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఇలాకాలోను దాబాలను మందుబాబులు అడ్డాలుగా మార్చుకున్నారు. మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్, ఇబ్రహింపట్నం, యాచారం ప్రాంతాల్లోని అనేక దాబాలు ఓపెన్ బారులుగా కొనసాగుతున్న స్థానిక పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి కూడ చూడకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఓటి బృందాలు అడపదడపా దాడులు చేస్తున్న స్థానిక పోలీసులు మౌనంగా ఉండటం వెనక మతలబు కమీషనర్‌కు తెలియాలి. విద్యాసంస్థలకు నిలయంగా ఉన్న ప్రాంతాల్లో చాలా మంది విద్యార్దులు కళాశాలలు డుమ్మా కొట్టి మరి ఇలాంటి దాబాలలో రోజంతా మద్యం మత్తులో మునిగితేలుతున్నారు. మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన విద్యార్దులు ఇలాంటి దాబాలలో మద్యం సేవించి వస్తున్నవారే అన్న ప్రచారం జరుగుతుంది. రాచకొండ పరిధిలోని ప్రధాన రహదారులకు పక్కన ఉన్న పలు దాబాలలో మద్యం, గుట్కా విక్రయాలు సైతం జరుగుతున్నాయని తెలిసింది. శివారులలో ఇటివల విద్యార్దులు గంజాయితో పలువురు పట్టుబడిన విషయం సైతం తెలిసిందే.
వికారాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం….
రాజదానికి అనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కన్న వికారాబాద్ జిల్లాలో మద్యం సేవించడానికి మాత్రమే దాబాలు అన్న నినాదంతో పనిచేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ ఎస్‌పి కార్యాలయంకు పక్కనే ఉన్న ప్రాంతాలతో పాటు తాండూర్, పరిగి నియోజకవర్గాలలో ఉన్న దాబాలు మందు బాబులకు అడ్డాలుగా మారిపోయాయి. మద్యం దుకాణాలకు సమయం ఉంటుందేమో కాని దాబాలకు మాత్రం ఉదయం నుంచి ఆర్థరాత్రి వరకు ఎప్పుడైన మందు, విందు అందుబాటులో ఉంటుంది. ప్రతి దాబాల నుంచి స్థానిక పోలీసులతో పాటు జిల్లా అధికారులకు సైతం నజరానాలు అందుతుండటం మూలంగానే ఇటువైపు కన్నెతికూడ చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News