Tuesday, March 19, 2024

18న కరీంనగర్ ఐటి టవర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Karimnagar IT Tower

 

కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
80 శాతం ఉద్యోగాలు కరీంనగర్ జిల్లా వాసులకే
40 శాతం నాల్గవ తరగతి ఉద్యోగాలు సైతం స్థానికులకే
ఇప్పటికే 506 మంది ఉద్యోగస్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి
26 కార్పొరేట్ సంస్థలతో ఐటి టవర్ ప్రారంభం
మంత్రి గంగుల కమలాకర్

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కరీంనగర్ జిల్లా కేంద్రం శివారులో ఏర్పాటుచేసిన ఐటి టవర్‌ను ఈనెల 18న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం నగర శివారులోని ఐటి టవర్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి పథం వైపు దూసుకుపోతుందని చెప్పారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఐటి టవర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముందుగా ఐటి ఇంక్యూవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో తాము ప్రారంభించామని, తరువాత దానిని ఐటి టవర్‌గా మార్చడం జరిగిందని తెలిపారు.

ఇప్పటికే 26 కార్పొరేట్ సంస్థలు ఎన్‌రోల్ చేయించుకోవడం జరిగిందని వెల్లడించారు. ఉత్తర తెలంగాణకు ఈ ఐటి టవర్ వరప్రదాయనిగా మారనుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు దీనిని వినియోగించుకోవాలని మంత్రి గంగుల సూచించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రారంభం వాయిదాపడిందని చెప్పారు. నాడు 12 కంపెనీలు ఎన్‌రోల్ చేసుకోవడం జరిగిందని, ప్రస్తుతం 28 కంపెనీలు తమను సంప్రదించగా 26 కంపెనీలకు ఎన్‌రోల్‌మెంట్ ఆవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఇందులో 15 కంపెనీలకు ప్లేస్‌మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఐటి టవర్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో లెర్నింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండగా, మొదటి అంతస్తులో ఐటి టవర్ నిర్వహణ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మిగితా ప్లోర్‌లను బ్లాక్‌లుగా విభజించి కంపెనీలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఆకర్షణీయమైన ఇన్‌సెంటీవ్ ఇస్తున్నందు వల్లే కంపెనీలు ముందుకు వస్తున్నాయని అన్నారు.

ఈ ఐటి టవర్‌లో 3000 ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేది లక్షంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంటర్వూలు ఇప్పటికే నడస్తున్నాయని, మరో ఐటి టవర్‌ను సైతం కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని మంత్రి గంగుల వివరించారు. కరీంనగర్ బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడం వలన ఖర్చులు పెరుగుతున్నాయని, వారికి ఆర్థికంగా చేయూతను అందించాలనే తలంపుతో అన్ని సౌకర్యాలతో కూడిన ఐటి టవర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఐటి టవర్‌కు సంబంధించిన మెయింటనెన్స్ ప్రభుత్వమే చూసుకుంటుందని, ఐటి టవర్‌లో 80 శాతం ఉద్యోగాలను కరీంనగర్ వాసులకే అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 40 నాల్గవ తరగతి ఉద్యోగాలు సైతం కరీంనగర్ వాసులతోనే భర్తీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 506 ఉద్యోగాలను భర్తీ చేయడం కూడా జరిగిందని గంగుల కమలాకర్ తెలిపారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఐటి టవర్ ప్రారంభంతో అభివృద్ధి విషయంలో కరీంనగర్ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. త్వరలో మానేరు రివర్‌ఫ్రంట్, తీగెల వంతెనలతో కరీంనగర్ కొత్తకళను సంతరించుకుంటుందన్నారు. కెసిఆర్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ మీడియా సమావేశంలో ఎంఎల్‌ఎలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ సునీల్‌రావు, మాజీ ఎంఎల్‌ఎలు కోడూరి సత్యనారాయణగౌడ్, ఆరెపల్లి మోహన్, కార్పొరేటర్లు ఐలేందర్‌యాదవ్, గంట కళ్యాణి, బండారి వేణు, వాల రమణారావు, టిఆర్‌ఎస్ నాయకులు ఆకుల నర్సయ్య, చల్లా హరిశంకర్, సరిళ్ళ ప్రసాద్, డాక్టర్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, సాజిద్, కర్ర సూర్యశేఖర్, గణగాని సత్యనారాయణగౌడ్ అలియాస్ కలర్ సత్తెన్న పాల్గొన్నారు.

Opened of Karimnagar IT Tower on 18th
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News