Wednesday, April 24, 2024

నిరసనల ‘సాగు’

- Advertisement -
- Advertisement -

వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు

రాజ్యసభ మూడు సార్లు, లోక్‌సభ రెండుసార్లు వాయిదా
చర్చకు నిరాకరించడంతో రాజ్యసభలో కాంగ్రెస్, లెఫ్ట్, టిఎంసి, డిఎంకె, ఆర్‌జెడి సభ్యుల వాకౌట్
లోక్‌సభలో పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్, శివసేన, డిఎంకె, టిఎంసి, ఎఫ్‌బి, బిఎస్‌పి
కార్యకలాపాలు జరగకుండానే ఉభయసభలు నేటికి వాయిదా

న్యూఢిల్లీ: సాగు చట్టాలపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో అట్టుడికి పోయింది. రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్ జరపడంతో పాటు సభలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో మూడు సార్లు వాయిదా పడిన తర్వాత చివరికి పెద్దగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే బుధవారానికి వాయిదా పడింది. లోక్‌సభలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం రాజ్యసభ సమావేశం కాగానే కాంగ్రెస్, వామపక్షాలు, టిఎంసి, డిఎంకె, ఆర్‌జెడి సభ్యులు సభా కార్యకలాపాలన్నిటినీ వాయిదా వేసి వ్యవసాయచట్టాలపై చర్చ చేపట్టాలన్నా తమ డిమాండ్‌ను చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించడానికి నిరసనగా ఆయా పార్టీలకు చెందిన సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించవచ్చంటూ ఆయన ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. వాకౌట్ తర్వాత తిరిగి సభలోకి వచ్చిన ప్రతిపక్షాల సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంటూ నినాదాలు చేయడంతో తొలుత వెంకయ్య నాయుడు సభను పదిన్నర గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్షాలు నినాదాలు కొనసాగించడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో తిరిగి మరోసారి 11.30 గంటల వరకు సభ వాయిదా పడింది. ఒక దశలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం కావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయని, ప్రభుత్వం అంగీకరిస్తే వారు గొడవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు నినాదాలను ఆపకపోవడంతో మరోసారి మధ్యాహ్నం 12.30 గంటలకు సభను వాయిదావేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

లోక్‌సభలోనూ అదే తీరు

మధ్యాహ్నం సమావేశమైన లోక్‌సభలోను దాదాపుగా ఇదే సీన్ రిపీట్ అయింది. విపక్షాల ఆందోళనల కారణంగా రెండు సార్లు వాయిదా పడిన సభ సాయంత్రం 5 గంటలకు జీరోఅవర్‌ను చేపట్టింది.ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ మాట్లాడుతూ రైతుల సమస్యలను చర్చించడానికి కేంద్రం పార్లమెంటు లోపల, బైటా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తోమర్ స్పందించారు.అధిర్ రంజన్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఉద్యమంలో 170 మందికి పైగా రైతులు మరణించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు బ్రిటీష్ పాలనను తలపిస్తున్నాయన్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్, శివసేన,డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, ఎప్‌పి, బిఎస్‌పి పార్టీలకు చెందిన సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో స్పీకర్ సభను రాత్రి 7 గంటల వరకు వాయిదా వేశారు. 7 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

సభలో హుందాగా వ్యవహరించాలి

జాతీయ, ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను చర్చించేటప్పుడు సభ్యులు నిబంధనలను పాటించాలని, హుందాగా వ్యవహరించాలని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు మంగళవారం రాజ్యసభలో అన్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో వ్యవసాయ బిల్లులను ఆమోదించే సందర్భంంలోచోటు చేసుకున్న గందరగోళ దృశ్యాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఈ పార్లమెంటు సమావేశాలను మరింత అర్థవంతమైనదిగా చేయాలని, సమస్యలపై ప్రశాంతంగా, గౌరవప్రదమైన రీతిలో లోతుగా చర్చించాలని ఆయన సభ్యులను కోరారు. ‘క్రితం సారి కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగాయి’ అన్న వెంకయ్యఆంతకు మించి వివరించలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో రాజ్యసభలో వ్యవసాయ చట్టాలను ఆమోదించే సందర్భంలో విపక్షాల సభ్యులు రూల్‌బుక్‌ను చించివేయడంతో పాటుగా పోడియంపైకి ఎక్కి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. సభ సజావుగా నడిచేలా చూడడం, సభ్యులు నియమ నిబంధనలను పాటించడం, క్రమశిక్షణ, హుందాతనంతో మెలగడం, అర్థవంతమైన విధంగా చర్చల్లో పాల్గొనేలా చూడడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చైర్మన్ అన్నారు.

Opp demanding discussion on farm laws in Parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News