Saturday, March 25, 2023

రాజ్యసభ రగడ

- Advertisement -

Editorial on PM Modi-Putin Summit meeting

గత వర్షాకాల సమావేశాల్లో నియమ విరుద్ధంగా అతిగా ప్రవర్తించారన్న కారణంపై రాజ్యసభలోని 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రస్తుత శీతాకాల సమావేశాల మొదటి రోజున తీసుకున్న నిర్ణయం సభా కార్యక్రమాలను ముందుకు సాగకుండా చేస్తున్నది. ఇప్పటి సమావేశాలు ముగిసే వరకు ఈ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం అవాంఛనీయమైనది, అప్రజాస్వామికమైనదని ప్రతిపక్షాలు ఒక్క కంఠంతో ఖండిస్తున్నాయి. క్షమాపణ చెబితే సస్పెన్షన్లను ఎత్తి వేస్తామన్న ప్రతిపాదనకు కూడా అవి ససేమిరా ఒప్పుకోడం లేదు. ఇంత మంది సభ్యులను ఒకేసారి మొత్తం సమావేశాల కాలమంతటికీ సస్పెండ్ చేయడం అపూర్వమైనది. మొత్తం 14 ప్రతిపక్ష పార్టీల సభా సారథులందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు. గత సమావేశాలలో జరిగిన దానికి ఆ సమావేశాలు నిరవధిక వాయిదా పడేలోగానే నిర్ణయం తీసుకోవాలి గాని ఈ సమావేశాల్లో సస్పెండ్ చేయడం సమంజసం కాదని వారు అభ్యంతరం చెప్పారు. సస్పెండైన 12 మంది సభ్యుల్లో ఐదుగురు కాంగ్రెస్ వారు కాగా, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు, ఇద్దరు శివసేన సభ్యులు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన చెరిఒకరు వున్నారు. రాజ్యసభ, శాసన మండలుల సభా నియమాలలోని 256(1) నిబంధన కింద ఈ సస్పెన్షన్లు జరిగాయి. సభ చైర్మన్ అవసరమని భావిస్తే సభ్యులను గరిష్ఠంగా ఆ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయవచ్చునని అలా చేసేటప్పుడు ఆ సభ్యుని లేదా సభ్యులను పేరు పెట్టి ప్రస్తావించి ఆ విషయాన్ని ప్రకటించాలని ఈ నిబంధన స్పష్టం చేస్తున్నది. అంటే ఏ సమావేశాల్లోనైతే ఆ సభ్యులు నియమాతిక్రమణకు పాల్పడ్డారో ఆ సమావేశాల్లోనే సస్పెన్షన్ జరగాలని చెబుతున్నది. అలాగే సస్పెండ్ చేయడానికి ముందు ఆ సభ్యులను పేరు పేరునా ప్రస్తావించి ఆ నిర్ణయాన్ని ప్రకటించవలసి వుంది. ఈ 12 మంది సభ్యుల విషయంలో ఈ పద్ధతిని పాటించలేదని అందుచేత వీరి సస్పెన్షన్లు చెల్లవని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. పార్లమెంటు అంటే పరోక్ష ప్రజా దర్బారు. దేశ ప్రజలందరి ప్రతినిధులు కొలువుండే చోటు. లోక్‌సభలో ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రతినిధులు, రాజ్యసభలో పరోక్ష ప్రతినిధులు వుంటారు. ప్రజల సమస్యలన్నింటిపైనా కూలంకషంగా చర్చించడానికి, ఆయా సమస్యలపై భిన్న కోణాల్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చూడడానికి, అలాగే లోతైన చర్చ తర్వాత శాసనాలు చేయడానికి చట్టసభల సమావేశాలు జరుగుతాయి. ఆ విధంగా ఆయా అంశాల్లోని మంచి చెడ్డలు పార్లమెంటు ద్వారా దేశ ప్రజల దృష్టికి చేరడానికి తోడ్పడతాయి. సమావేశాలు సవ్యంగా, నిరాటంకంగా జరిగేలా చూసే బాధ్యత ప్రధానంగా పాలక పక్షంపై వుంటుంది. సభ ముందుకు ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులను, ఇతర ప్రతిపాదనలను కూలంకషంగా పరిశీలించి వాటిలోని మంచి చెడ్డలను విడదీసి చూసి పార్లమెంటు ద్వారా ప్రజలకు నివేదించే బాధ్యత ప్రతిపక్షం మీద వుంటుంది. ఈ విధి నిర్వహణలో అది విజయవంతమైతే తన లొసుగులు బయటపడి ప్రజల దృష్టిలో పలచబడిపోతానని పాలక పక్షం భావిస్తుంది. అందుచేత ప్రతిపక్షాన్ని అడ్డుకోడానికి పాలక పక్షం పలు రకాల అవరోధ వ్యూహాలను అమలు చేస్తుంది. ఈ సరళిలో సభాధ్యక్షుల స్వతంత్ర అధికారాలూ బలి అవుతుంటాయి. అధ్యక్ష పీఠానికి ఎన్నిక కాగానే వారు తమ పార్టీ చొక్కాలను విడిచిపెట్టి సర్వస్వతంత్రులుగా వ్యవహరించవలసి వుండగా అందుకు విరుద్ధంగా జరగడం మామూలైపోయింది. పాలక పక్షం సంఖ్యాధిక్యత కూడా కొన్ని కీలకాంశాలపై సమగ్ర చర్చ జరగనీయకుండా అడ్డుకుంటుంది. ప్రజలకు, దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకుండా దాగుడుమూతలాడుతున్నప్పుడు, బలమైన స్వార్థపర వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి జనహితాన్ని బలిపెట్టదలచినప్పుడు ప్రతిపక్షం ఆందోళనకు దిగడం తప్పనిసరి అవుతుంది. సమస్యపై సభాధ్యక్షుల దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రభుత్వం దిగి వచ్చేలా చేయడానికి ధర్నాలు, వాకౌట్ల వంటివి చేపట్టక తప్పనిసరి అవుతుంది. ప్రతిపక్షం గాని, ప్రజాసంఘాలు గాని ఎంతగా ఆందోళన చేసి అరచి గీపెట్టినా పట్టించుకోకుండా తిరస్కార ధోరణితో వ్యవహరించడం, వారిపై బురద చల్లి అప్రతిష్ఠ పాలు చేయడం ద్వారా ఆ ఆందోళనలను విరమించుకునేలా చేయడానికి యత్నించడం ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రస్తుత బిజెపి ప్రభుత్వానికి అలవాటైపోయింది. ఈ విషయం రైతు ఉద్యమం సందర్భంలోనూ, తాజాగా ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని పార్లమెంటు లోపలా, బయటా టిఆర్‌ఎస్ ఎంపిలు చేపట్టిన ఆందోళనపరంగానూ సందేహాతీతంగా రుజువైపోయింది. చాచికొట్టి అరిచాడని అభియోగం మోపడం పాలక పక్షాలు అవలంబించే కపట వ్యూహం. అందుచేత రాజ్యసభలోని 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వెనుకకు తీసుకోడమే విజ్ఞతాయుతం కాగలదు.

Oppo denied to 12 Rajya Sabha MPs suspended

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News