Friday, March 29, 2024

పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం

- Advertisement -
- Advertisement -

central Power law amendment draft

 

రైతులు, పేదలు, దళితులను అంధకారంలోకి నెట్టే విద్యుత్ ముసాయిదాను గట్టిగా వ్యతిరేకిస్తాం
కేంద్రం డ్రాఫ్ట్‌తో ఏవరికి ఎంత నష్టమంటే..
రైతులు నెలకు రూ.5వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. రాష్ట్రంలో కోటి మంది దాకా పేద, మధ్యతరగతి గృహ విద్యుత్ వినియోగదార్లు ఉన్నారు. వీళ్లంతా ముందుగానే భారీ మొత్తంలో చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రస్తుతం నెలకు 100 యూనిట్ల వరకు ఉచితం. ఇకపై వీళ్లు నెలకు రూ.700 దాకా చెల్లించాల్సి వస్తుంది. క్రాస్ సబ్సిడీలకు అవకాశం ఉండబోదు. సొంతంగా కనెక్షన్ కావాలనుకునే రైతులు అవసరమ్యే పోల్స్, వైర్లు సహా మిగతా ఖర్చులు వాళ్లే భరించాల్సి ఉంటుంది. కాటేజ్ పరిశ్రమలు, గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా కనెక్షన్లపై విపరీతమైన భారం
కలిసి వచ్చే పార్టీలతో అడ్డుకుంటాం
కోటి మందికి పైగా పేదలు, రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంతో అమీతుమీ
– రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి

 

హైదరాబాద్, మన తెలంగాణ: రాష్ట్రంలో కోటి మందికి పైగా పేదలు, రైతులకు పెను శాపంగా పరిణమించే కేంద్ర విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదాను పార్లమెంట్ వేదికగా వ్యతిరేకిస్తామని, దేశంలో తమతో కలిసి వచ్చే పార్టీలతో అడ్డుకుంటామని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. కొత్త ముసాయిదాను నిరసిస్తూ ప్రభుత్వం తరపున కేంద్రానికి నిరసన లేఖను ఇవ్వడమే కాకుండా, ఈ ముసాయిదా చట్టమైతే రాష్ట్రాల హక్కులకు, పేదలు, రైతుల ప్రయోజనాలకు ఎలా విఘాతం కలుగుతుందో ప్రజలకు, దేశంలోని పార్టీలకు విడమర్చి చెబుతామని జగదీశ్ రెడ్డి మంగళవారం మన తెలంగాణ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చెప్పారు. ముసాయిదాపై రాష్ట్రాల అభిప్రాయాలను కేం ద్రం జూన్ 5లోగా ఇవ్వాలని కోరిందని, దీనిపై ప్రభు త్వం అన్ని రకాలుగా అధ్యయనం చేసి మొత్తంగా ముసాయిదాను వ్యతిరేకించాలనే అభిప్రాయానికి వచ్చిందని ఆయన తెలిపారు.

ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి భిన్నంగా ఉన్న ఈ ముసాయిదాను ఎంతదాకైనా వెళ్లి అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పటికే స్పష్టం చేశారని, పొరుగున ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని ఆయన తెలియజేశారు. కేంద్రం ముసాయిదాను ఉపసంహరించేదాకా కలిసి వచ్చే పార్టీలతో దేశ వ్యాప్తంగా కేంద్రంతో పోరాడుతామని ఆయన తెలిపారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్తు పై విధాన నిర్ణయాలపై ఇప్పుడు రాష్ట్రాలకే అన్ని అధికారాలున్నాయి. ముఖ్యంగా విద్యుత్తు ఛార్జీల నిర్ణయం, సబ్సిడీలు, ఇఆర్‌సి చైర్మన్, సభ్యుల నియామకాలు, లోడ్ డిస్పాచ్ లాంటి అంశాలపై సర్వాధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయి. కాని కేంద్రం ప్రతిపాదించిన కొత్త ముసాయిదాతో ఈ అధికారాలన్నీ కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. కొత్త ముసాయిదా చట్టమైతే రాష్ట్రం అమలు చేస్తున్న రైతులకు ఉచిత విద్యుత్తు, నిరంతర విద్యుత్తుకు అవకాశాలు ఉండవని మంత్రి అన్నారు. పేదలు, ఎస్‌సి, ఎస్‌టిలకు ఇస్తున్న గృహ విద్యుత్తు వినియోగ క్రాస్ సబ్సిడీలు కూడా ఉండవని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇకపై ఉచితంగా విద్యుత్తు పొందుతున్న రైతులు, పేదలు, వివిధ వర్గాల వారు మొత్తం వాస్తవ విద్యుత్తు ధరను చెల్లించాలని ఆ తర్వాతే ఎల్‌పిజి తరహాలో ప్రభుత్వం వారి ఖాతాల్లో ఇవ్వాలనుకున్న సబ్సిడీని జమ చేయాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటిదాకా అన్ని వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలను ప్రభుత్వం ఆర్థికంగా వెసులుబాటు ఉన్న సమయంలో విద్యుత్తు సరఫరా చేసే డిస్కంలకు కేటాయిస్తున్నదని కొత్త ముసాయిదాలో ముందు అంతా ఎక్కువ రేటుతో విద్యుత్తు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఉదాహరణకు రాష్ట్రంలో కోటి 13 లక్షల మంది విద్యుత్తు వినియోగదార్లు ఉంటే ఇందులో 86 శాతం దాకా 200 యూనిట్లకు తక్కువ వాడే పేద, మధ్య తరగతి వర్గాల వారే ఉన్నారని తెలిపారు. ముసాయిదా చట్టంగా ఆచరణలోకి వస్తే వీరంతా ఇప్పుడు చెల్లిస్తున్న బిల్లులకు 4 నుంచి 5 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. అలాగే ఉచితంగా విద్యుత్తును పొందే రైతులు పంపు సెట్‌కు ప్రతి నెలా రూ. 5000 బిల్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

కొత్తగా పంప్ సెట్ కనెక్షన్ తీసుకునే రైతులు విద్యుత్తు స్తంభం, వైరు, ట్రాన్సుఫార్మర్ ఖర్చులు కూడా రైతులే భరించాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. రైతులకు పంప్‌సెట్ల విద్యుత్తు సరఫరా కోసం ప్రభుత్వం రూ. 70 వేలతో మౌలిక సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నదని అన్నారు. ముసాయిదాలో అన్ని పంప్‌సెట్‌లకు మీటర్లు బిగించాలని పేర్కొన్నారని ఇందు కోసం రాష్ట్రం కొత్తగా రూ. 1000 కోట్ల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా సన్న, చిన్నకారు రైతు ఇకపై కొత్త పంప్‌సెట్ పొలంలో బిగించుకోవాలంటే ఒక్కో పంప్‌సెట్‌కు సర్వీసు వైరు, ఎంసిబి, లేబర్ కోసం రూ. 4000 దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి దాకా ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి పేద వర్గాలకు ప్రభుత్వం 100 యూనిట్ల లోపు విద్యుత్తును వాడుకుంటే ఛార్జీలు వసూలు చేయడం లేదు. కొత్త చట్టంలో వీరంతా ముందుగా రూ. 700 నెలకు చెల్లించాల్సి ఉంటుంది. ముసాయిదాలో విద్యుత్తు పంపిణీని ప్రైవేటుపరం చేశారు. అంటే ఎవరైనా ఈ రంగంలోకి ప్రవేశించి కేంద్రం నిర్దేశించిన టారిఫ్‌ను ముందుగా ముక్కు పిండి వసూలు చేస్తుంది. ఎవరైనా బిల్లు చెల్లించకపోతే వారికి విద్యుత్తును నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తుంది.

మొత్తం పంపిణీని ప్రైవేటు పరం చేస్తే విద్యుత్తు రంగంలో అరాచకం ఏర్పడుతుందని జగదీశ్ రెడ్డి తెలియజేశారు. కొత్త ముసాయిదాలో మూడు అంశాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మొదటిది రాష్ట్రాలకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉండకపోవడం, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ముసాయిదా ప్రతిపాదనలు ఉండడం, పంపిణీని ప్రైవేటు పరం చేయడం లాంటి విషయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా సాంప్రదాయేతర విద్యుత్తు వినియోగం విషయంలో ముసాయిదాలో పేర్కొన్న శాతం మేరకు విద్యుత్తును వినియోగించకపోతే యూనిట్‌కు 50 పైసలు చొప్పున ఫైన్ విధించారని ఇది మరీ దారుణమని ఆయన అన్నారు. ప్రభుత్వమే కాకుండా ఇంజినీర్లు, ఉద్యోగులు, విద్యుత్తు రంగ నిపుణులు కూడా కేంద్ర ముసాయిదాను అరాచకమని చెపుతున్నారని తెలిపారు.

కొత్త కేంద్ర చట్టంతో ఏయే వర్గాలకు ఎలా నష్టం..

4రైతులు నెలకు రూ 5 వేల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణాలో రైతులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తుంది. ఒక్కో పంప్‌సెట్ ద్వారా నెలకు 800 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కో యూనిట్ వాస్తవ ధర రూ 6.87 అంటే నెలకు రూ 5 వేలు, ఏడాదికి రూ.6౦ వేలు చెల్లించాలి.
4రాష్ట్రంలో మొత్తం కోటి 13 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు. 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడే వారు 14 శాతం. కోటి మంది దాకా పేద, మధ్యతరగతి వాళ్లే. ఇకపై వీళ్లు ముందే చార్జీలు చెల్లించాలి.
4గృహ విద్యుత్‌ను వినియోగిస్తున్న ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రస్తుతం నెలకు 100 యూనిట్ల వరకు ఉచితం. ఇకపై ఈ వర్గాల ప్రజలు ముందుగా నెలకు రూ 700 దాకా చెల్లించాల్సి ఉంటుంది.

4క్రాస్ సబ్సిడీలకు అవకాశం ఉండదు. వివిధస్లాబ్‌లలో వివిధ రేట్లను వసూలు చేస్తున్నారు. ఇకపై తక్కువ విద్యుత్ వినియోగించేవారు, ఎక్కువ విద్యుత్ వినియోగించే వారూ ముందుగా ఒకే రేటును చెల్లించాలి. తర్వాత ప్రభుత్వం సబ్సిడీని వారి ఖాతాల్లోకి జమ చేయాలి. ప్రభుత్వం ప్రస్తుత విధానంలో ఎక్కువ విద్యుత్ వినియోగించిన వారి నుంచి ఎక్కువ వసూలు చేసి తక్కువ వినియోగించే వారికి ఆ డబ్బును క్రాస్ సబ్సిడీగా ఇస్తున్నది.
4రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం పొలం దగ్గరకు పోల్, వైర్, ట్రాన్‌ఫ్రార్మర్ ఇవ్వడానికి ఒక్కో కనెక్షన్‌కు రూ 70,000 ఖర్చు చేస్తున్నది. ఇకపై కొత్త కనెక్షన్ కావాలనుకునే రైతే ఈ వ్యయాన్ని భరించాలి.
4రైతు పంప్ సెట్ కనెక్షన్ కోసం ప్రభుత్వం ఒక్కో కనెక్షన్‌కు సర్వీస్ వైర్, ఎంసిబి, లేబర్ వ్యయానికి రూ 4,018 ఖర్చు చేస్తున్నది. ఇకపై ఈ వ్యయం కూడా రైతే భరించక తప్పదు.
4కాటేజ్ పరిశ్రమలు, గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా కనెక్షన్లు రెండు లక్షల దాకా ఉన్నాయి. వీరికి ప్రభుత్వం సబ్సిడీతో విద్యుత్‌ను ఇస్తున్నది. ఈ కేటగిరీల వాళ్లు కూడా ఇకపై ముందు మొత్తం బిల్ చెల్లించాలి. చెల్లించకపోతే కరెంట్ నిలిపివేస్తారు.

కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు రైతుల పాలిట శాపం

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు-2020 రైతులకు, సామాన్య ప్రజలకు శాపంగా మారనుందని తెలంగాణ అడ్వకేజ్ జెఎసి కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తుంటే విద్యుత్ సవరణ చట్టం పేరుతో ఉచిత కరెంట్‌కు కోతపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ బిల్లుపై మౌన ప్రేక్షకులుగా ఉంటే భవిష్యత్తు తరం మనల్ని క్షమించదని అన్నారు. ఈ ముసాయిదా చట్టరూపం దాలిస్తే దేశానికి అన్నంపెట్టే రైతన్నలపై పెనుభారం పడనుందని పేర్కొన్నారు. ఈ విద్యుత్ సవరణ బిల్లు ద్వారా 50 వేల మంది విద్యుత్ సిబ్బందిపై ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌సవరణ బిల్లు-2020కు వ్యతిరేకంగా కేంద్రానికి కనువిప్పు కలిగేలా నిరసనలు, ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News