Home జగిత్యాల అధికార దాహంతోనే ప్రతిపక్ష నేతల విమర్శలు

అధికార దాహంతోనే ప్రతిపక్ష నేతల విమర్శలు

Oppositions criticized the Telangana government for irrigation projects

మనతెలంగాణ/మేడిపల్లి: సాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార దాహంతో అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపి అనంతరం  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, చేవెళ్ల, తూపాకులగూడెం ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టిడిపిలు అన్ని ప్రయత్నాలు చేసాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కావాల్సిన అన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించామని, శరవేగంగా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా వారి వ్యక్తిగత సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమ కాలంలో ఏ విధంగా కష్టపడ్డామో… తెలంగాణ అభివృద్దికి కూడా అదే విధంగా కష్టపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చుతున్నారని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయని, మంచి పనుల కోసమే అప్పులు తెస్తున్నామని, వాటిని తీర్చే సత్తా టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దమేనని, ప్రజలు అభివృద్దికి పాటుపడే పార్టీలకే పట్టం కడతారన్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ సమస్యలతో రాష్ట్రం అంధకారం అవుతుందని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతాయని, ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన వారే ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని ఉద్యమం చేయాల్సి వస్తుందంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం  ఏర్పడిన తర్వాత విద్యుత్ సమస్యలు అనేవి లేకుండా పోయాయని, 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నామన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు గమనించాలన్నారు. మండలంలోని పోరుమల్ల గ్రామం నుంచి మోత్కురావుపేట వరకు, కొండాపూర్ నుంచి ఒడ్యాడ్ వరకు, మోహన్‌రావు పేట నుంచి దేశాయిపేట వరకు పంచాయతీ రోడ్లను ఆర్‌అండ్‌బి రోడ్లుగా మారుస్తామన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా మేడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపి రెండు పంటలకు సాగు నీరందించేందుకు చర్యలు చేపట్టినట్లు వినోద్‌కుమార్ వివరించారు. ఈ సమావేశంలో మార్కెఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, జగిత్యాల టిఆర్‌ఎస్ ఇంచార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, జెడ్పీటీసీ పూర్ణిమప్రభాకర్, ఎంపిపి కుందారపు అన్నపూర్ణరవీందర్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంగాధర్‌గౌడ్, నాయకులు శ్రీపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, హరిచరణ్‌రావు, భూమేశ్‌గౌడ్, మకిలీదాస్ తదితరులు పాల్గొన్నారు.