Home తాజా వార్తలు ఉస్మానియా హెచ్‌ఒడి, జూనియర్ అసిస్టెంట్‌ల అరెస్ట్

ఉస్మానియా హెచ్‌ఒడి, జూనియర్ అసిస్టెంట్‌ల అరెస్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్నల్ పరీక్షలలో పాస్ చేయిస్తానని వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకున్న ఉస్మానియా మెడికల్ కళాశాల హెచ్‌ఒడి బూక్యా బాలాజీ, జూనియర్ అసిస్టెంట్ అహ్మదుద్దీన్‌లను ఎసిబి అధికారులు శనివారం ఆరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. వైద్య విద్యార్థుల నుంచి 2018లో 1.60లక్షలు, 2019లో 1.50 లక్షలు వసూలు చేసినట్లు ఎసిబి అధికారుల దర్యాప్తులో తేలింది. వైద్య కళాశాలలో జరిగిన ఇంటర్నల్ పరీక్షలలో పరీక్షలు సరిగా రాలేదని వైద్య విద్యార్థులకు ఫోన్ ద్వారా బూక్యా బాలాజీ తెలిపాడని ఎసిబి గుర్తించింది. పరీక్షలలో ఉత్తీర్ణత పొందాలంటే తనకు ఒక్కో విద్యార్థి రూ.50వేలు చెల్లించాలని కోరాడు. విద్యార్థులు తమ హాల్‌టికెట్స్ తీసుకుని తనను ప్రత్యేకంగా కలవాలని, అలాగే రూ.50వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడని విచారణలో వెలుగుచూసింది. దీంతో కొందరు విద్యార్థుల అంత మొత్తాలను చెల్లించలేమని ఫోన్ ద్వారా తెలిపారు. అయినప్పటికీ ఉస్మానియా మెడికల్ కళాశాల హెచ్‌ఒడి బూక్యా బాలాజీ డబ్బులు చెల్లించిన వారు మాత్రమే పాస్ అవుతారని విద్యార్థులపై వత్తిడి చేశాడు.

ఈ క్రమంలో వైద్య విద్యార్థి రత్లావత్ శ్రీను తేజ్ యాప్ ద్వారా రూ.75 వేలు సదరు ఉస్మానియా మెడికల్ కళాశాల హెచ్‌ఒడి బూక్యా బాలాజీ అకౌంట్‌కు తరలించాడు. నగదు పంపిణీకి సంబంధించిన ఆధారాలను ఉస్మానియా మెడికల్ కళాశాల హెచ్‌ఒడి బూక్యా బాలాజీ ఇతర విద్యార్థులకు పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కొందరు విద్యార్థులు ఆయా ఆధారాలను ఎసిబి అధికారులకు అందించారు. దీంతో విచారణ చేపట్టిన ఎసిబి అధికారులు లంచం తీసుకుని అడ్డంగా దొరికి పోయిన ఉస్మానియా మెడికల్ కళాశాల హెచ్‌ఒడి బూక్యా బాలాజీని శనివారం అరెస్టు చేసి ఎసిబి కోర్టుకు తరలించాగా కోర్టు వారికి రిమాండ్‌కు ఆదేశించింది.

Osmania Medical College HOD arrested