Home తాజా వార్తలు ముగిసిన ఓయూ స్నాతకోత్సవం

ముగిసిన ఓయూ స్నాతకోత్సవం

OU

మనతెలంగాణ/ఉస్మానియాయూనివర్సిటీ: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ఓ.యూ 80వ స్నాతకోత్సవం ముగిసింది. దీంతో ఓ.యూ అధికారులు ఊపిరిపీల్చుకోవడమే కాకుండా ఆనందపారవశ్యంలో మునిగిపోయారు. నిర్ణీత సమయానికి అరగంట ఆలస్యంగా ఓ.యూ ఠాగూరు ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. ఆ వెంటనే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డి గోల్డ్ మెడలిస్టులను ఆహ్వానించగా పిజి మెరిట్ విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలను బహూకరించారు. అనంతరం ఐఐసిటీ డైరెక్టర్ డా.చంద్రశేఖర్ ప్రసంగం చేశారు. తర్వాత గవర్నర్ స్నాతకోత్సవ ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం కాన్వోకేషన్ నిర్వహించే బాధ్యతలను వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రంకు అప్పగించి గవర్నర్ వెళ్ళిపోయారు.

పిహెచ్. డి పట్టాలను ముఖ్యఅతిథి డా.చంద్రశేఖర్, వి.సి ప్రొ.ఎస్.రామచంద్రంలు కలిసి డాక్టరేట్లకు అందించారు. ఉదయం 11.30 గంటల నుంచి మొదలుకుని సాయంత్రం 3.30 గంటల వరకు చాలా ఓపికతో నిలబడి వారివురు డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఫ్యాకల్టీ డీన్‌లు, అధికారులు, వివిధ డిపార్టుమెంటుల హెడ్‌లు, బివోఎస్ చైర్మన్లు, పలువురు సీనియర్ ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, పలువురు అతిథులు,విఐపిలు పాల్గొన్నారు. కాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా తన డాక్టరేట్ తీసుకున్నారు. డాక్టరేట్స్ అందరూ వైట్ డ్రెస్ దరించి చాలా ఉత్సాహంతో హాజరయ్యారు. డాక్టరేట్ తీసుకున్న తర్వాత పలు చోట్ల తల్లిదండ్రులు, బంధుమిత్రుతో ఫొటోలు దిగారు. స్నాతకోత్సవం జరిగిన ఓ.యూ ఠాగూరు ఆడిటోరియంలోకి ఎంట్రీపాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. పాస్‌లేనివారిని అనుమతించకపోవడంతో కొంత మంది వచ్చి వెనుదిరిగిపోయారు. చాలా సిస్టమెటిక్‌గా, పకడ్బందీగా స్నాతక్సోవాన్ని నిర్వహించారు.

ఇందుకు గత నెల రోజులుగా శ్రమించడంతోపాటు పలు కొత్త పద్ధ్దతులను అవలంభించడం, వివిధ విద్యార్థి సంఘాలు, పోలీస్ డిపార్టుమెంటు నుంచి పూర్తి సహకారం లభించడంతో ఈ స్నాతకోత్సవం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.ఆరేళ్ళ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించడంతో 851 మంది పిహెచ్.డి అభ్యర్థులు తమ పట్టాలను, 100 మంది పిజి మెరిట్ విద్యార్థులు తమ గోల్డ్‌మెడల్స్‌ను అందుకున్నారు. స్నాతకోత్సవంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించడంలో ఓ.యూ ఎగ్జామ్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, అతని టీమ్ మెంబర్స్ 10 మంది అడిషినల్ కంట్రోలర్స్, ఎగ్జామ్ బ్రాంచి సిబ్బందిని ఓ.యూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్‌రెడ్డిలు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి ప్రొ.టి.కృష్ణారావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, పిఆర్‌వో డా. ఇ. సుజాత తదితరులు పాల్గొన్నారు.

డాక్టరేట్ అందుకోవడం గర్వంగా ఉంది : డా.కరాటే రాజు
చారిత్రాత్మక ఓ.యూ నుంచి డాక్టరేట్‌ను స్నాతకోత్సవంలో అందుకోవడం చాలా గర్వంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన పిలుపు మేరకు “ఓ.యూ బ్రాండ్‌”ను ముందుకుతీసుకుపోవడంలో నా వంతుగా కృషి చేస్తా. మారుమూల తండా నుంచి వచ్చిన నాకు పిహెచ్. డి పూర్తి చేసి అవకాశం ఓ.యూ నుంచి రావడం సంతోషంగా ఉంది.

OU 80th anniversary completed