Home అంతర్జాతీయ వార్తలు సమోసా విజయకేతనం

సమోసా విజయకేతనం

Samosa-image

దక్షిణాఫ్రికాలో నిర్వహించిన చిరు తిండి పోటీలో మన సమోసాకు మొదటి స్థానం

జొహాన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నిర్వహించిన చిరు తిండి పోటీలో మన ‘సమోసా’ విజయం సాధించింది. కశ్మీరీ చిల్లీ చికెన్‌తో చేసిన సమోసా తన ఇతర వంటకాలను తోసిరాజని మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాలో భారత కమ్యూనిటీ కోసం అతిపెద్ద జాతీయ వార్తాపత్రిక వీక్లీ పోస్ట్ ఈ పోటీలను నిర్వహించింది. చాక్లెట్, జీడిపప్పు వంటకాలు, పిజ్జాలు కూడా ఈ పోటీలో పాల్గొన్నాయి. సల్మా అనే మహిళ ఈ చిల్లీ చికెన్‌తో చేసిన సమోసాను తయారు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పోటీల్లో తన వంటకం విజయం సాధించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని, తనకు వంటకాలు అంటే ఇష్టమని, అదనపు రుచులను చేర్చేందుకు తానెప్పుడూ ప్రయత్నిస్తుంటానని చెప్పారు. ఇంట్లో పిల్లల కోసం చేసిన చికెన్ శాండ్‌విచ్ ఆధారంగా ఈ చిల్లీ చికెన్‌తో సమోను తయారు చేయగలిగానని ఆమె వివరించారు. వీటితో పాటు మరో రెండు పోటీలను కూడా నిర్వహించగా, రోక్సానా అనే మహిళ 60 సెకండ్లలో 10 సమోసాలను తయారు చేసి విజేతగా నిలిచారు. వేగంగా సమోసాలు తినే పోటీలో ఇబ్రహీం గెలుపొందారు. ఆయన ఒక నిమిషంలో 10 సమోసాలు తినేశాడు.