Home ఎడిటోరియల్ స్వేచ్ఛను, సమానత్వాన్ని హరిస్తున్న మన సామాజిక వ్యాకరణం!

స్వేచ్ఛను, సమానత్వాన్ని హరిస్తున్న మన సామాజిక వ్యాకరణం!

Choopu-Cartoon

వ్యవస్థలోని బలమైన శక్తులు సాగించే హింస గుర్తులు ఏ శవ పరీక్షలోనూ కనపడవు. వ్యాకరణాన్ని తుచ తప్పకుండా పాటిస్తే ఊహా శక్తికి పగ్గం వేసినట్టే. స్వేచ్ఛాయుత ఆలోచనకు, వ్యాక రణానికి పడదు. సమాజం విషయంలో కూడా ఇది అంతే. ముత్తు క్రిష్ణన్ జీవనాథన్ అనే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం దళిత విద్యార్థి ఆత్మహత్యలో సమాజం అతనిపై సాగించిన హింసను సూచించే స్పష్టమైన గుర్తులేమీ ఉండవు. అతడు ఆత్మహత్యకుముందు లేఖ రాయలేదు. 2016 జూలై 26న ఒక ఫేస్‌బుక్ పోస్టులో ముత్తు క్రిష్ణన్ జెఎన్‌యు ప్రవేశ పరీక్షలకు తాను హాజరయిన క్రమాన్ని వివరించాడు. ఎంఎ చదవడానికి మూడుసార్లు, ఎంఫిల్/పిహెచ్‌డి చేయడానికి రెండుసార్లు ప్రవేశ పరీక్షలు రాశానని చెప్పాడు. అతను తనను తాను రజ్నీ క్రిష్ అని పిలుచుకొంటాడు. 27 ఏళ్ల ముత్తు క్రిష్ణన్ ఈ నెల 13న న్యూఢిల్లీలో ఆత్మహత్య చేసుకొన్నాడు. దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో తన స్నేహితుని ఇంట్లో ఉరితీసుకొని చనిపోయాడు.
జెఎన్‌యు ప్రవేశ పరీక్షలు పదేపదే ఎందుకు రాయవలసి వచ్చిందో అతడు వివరించారు. కులపరమైన వెక్కిరింతకు గురికావడం వల్ల తనలో ఉన్నత విద్య నేర్చుకోవాలన్న పట్టుదల పెరిగిందన్నదే అతను చూపిన కారణం. ఇంగ్లీషు భాష అతడికి పెద్ద బాధాకర అంశం. ఆ సమస్యను కనీసం ఇంటర్వూ స్థాయిలో నెగ్గుకొచ్చేలా అధిగమించగలిగానని చెప్పు కొచ్చారు. అందుకు ఒక ఇంటర్వూలో జెఎన్‌యు ప్రొఫెసర్‌తో ఎదురైన అనుభవాన్ని వివరించారు. అక్కడ కూడా ఇంగ్లీష్ ప్రశ్నే వచ్చింది. ఆ భాష విషయంలో ముత్తు క్రిష్ణన్‌పై ఆ ప్రొఫెసర్ వెటకార వ్యాఖ్య చేశాడు. భాషను కులానికి ముడిపెట్టి ప్రొఫెసర్ మాట్లాడాడని ముత్తు బాధపడ్డాడు. అలా మాట్లాడే ఆనవాయితీ జెఎన్‌యులో కొనసాగుతోంది.
ఇది కేవలం భాషకు సంబంధించిన విషయం కాదని కులంతో ముడిపెట్టి వ్యాఖ్యానించడంలోనే అర్థమవుతోంది. ఈ రకం ‘సామాజిక వ్యాక రణం’ మన వర్శిటీల్లో ఆనవాయితీగా ఉంది. దానిని ముత్తు క్రిష్ణన్ వివరించిన ఉదంతం స్పష్టం చేస్తోంది. తమిళనాడుకు చెందిన సేలం వద్ద చిన్న గ్రామం నుండి వచ్చి జెఎన్‌యువంటి ఉన్నత విద్యాసంస్థలో చదవాలని కలలు కనడం అతడిని కష్టాల్లో పడేసింది. సమాజంలో ఒక స్థానం కోసం అతడు ఎంతగా పరితపించినదీ అతడి ఫేస్‌బుక్ రాతల్లో వెల్లడవుతోంది. ఒకపక్క నడివీధిలో ఎదురయ్యే వివక్షలతో, మరోపక్క విద్యారంగంలో ఎదురయ్యే పక్షపాతాలతో ఏకకాలంలో పోరాడవలసి వచ్చిందని అతడు ఎంతగానో బాధపడ్డాడు. జెఎన్‌యు చెక్‌పోస్ట్ వద్ద సెక్యూరిటీ గార్డులు అందరినీ స్వేచ్ఛగా లోపలికి వదిలేవారు కాని ముత్తు క్రిష్ణన్‌ను గుర్తింపు కార్డు చూపిస్తేనే వదిలేవారు.
ఇటువంటి అనుభవాల నేపథ్యంలో, డబ్బు కోసం ఇతరులను ప్రాధేయ పడే పరిస్థితిలో ‘ఒక చీమ’వలే తాను చదువుమీద వ్యామోహంతో కూడ బెట్టానని అతడు చెప్పుకొచ్చాడు. మేధోపరమైన అర్హతలున్నా భాష విషయంలో దళిత విద్యార్థులను న్యూనతకు గురిచేసే మన యూనివర్శిటీల వాతావరణాన్ని ముత్తు క్రిష్ణన్ ఫేస్‌బుక్ రాతలు తేటతెల్లం చేస్తున్నాయి. మేధస్సు-భాషాపటిమ విషయంలో సమాజంలోని ఉన్నత వర్గాల విద్యార్థుల పట్ల ఒక విధంగా, దళితులపట్ల వేరే విధంగా ప్రవర్తించే ఆనవాయితీ మన ఉన్నత విద్యాలయాల్లో ఉందన్నదే అతడు చెప్పదలుచుకున్న విషయం.
ఈ సమస్యపట్ల మన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, యూనివర్శిటీల పాలనాధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు సక్రమంగా స్పందించేలా చేయాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో అది ఏదో ఒక రూపంలో వివక్షలను కొనసాగించడానికి పచ్చజెండా ఊపినట్లు అవుతుంది. ముత్తు క్రిష్ణన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య రేకెత్తించిన ఉద్యమంతో ప్రమేయం ఉన్న పరిశోధన విద్యార్థి. గత ఏడాది జూన్ 30న తన బ్లాగ్‌లో అతడు ‘దళిత్రేచర్’ అనే నూతన పదబంధం క్రింద భాష గురించి తన అభిప్రాయం రాశాడు. భాష మనకు అందించే వరం ఊహాశక్తేతప్ప వ్యాకరణం కాదని అతను అన్నారు. ఆత్మహత్య ద్వారా దేశం లోని విశ్వవిద్యాలయాలన్నిటినీ కుదిపిన హైదరాబాద్ సెంట్రల్ యూని వరిటీ దళిత విద్యార్థి రోహిత్ వేములతో ముత్తు క్రిష్ణన్‌కు అనుబంధం ఉంది.
వారిద్దరూ కలుసుకొన్న సమావేశాల గురించి కూడా ముత్తు క్రిష్ణన్ తన బ్లాగ్‌లో రాశాడు. కట్టుకథల్లో పాత్రలను వెక్కిరించినందుకు కూడా అణచివేత వర్గాల మేధావులను అరెస్టు చేస్తారన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ దేశపు శక్తివంతమయిన అగ్రవర్ణాల వారు అనేక మంది ‘రోహిత్‌లను’ పొట్టన బెట్టుకొంటారన్న భయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. దళితులను గొడ్డు మాంసం తిన్నందుకు, దేశానికి విధేయులుగా ఉన్నందుకు, మేధోపరంగా దేశానికి సాయపడుతున్నందుకు కూడా చంపేసే రోజులు వస్తాయని ఆయన ఆందోళన ప్రకటించాడు.
‘దేశం రానురాను సాంస్కృతికంగా ఆధిపత్యంగల వర్గాల చేతుల్లోకి వెళ్లి పోతోంది. మతపరమైన విశ్వాసాలను శాసనంగా మార్చుతున్నారు. సెక్యులర్ సూత్రాలకు హామీని ఇస్తున్న రాజ్యాంగ నియమాలను తిరగ రాస్తున్నారు. మతపరమైన చిహ్నాలను విమర్శించినా, గొడ్డుమాంసం తిన్నా, జాతీయవాదం పేరుతో చోటుచేసుకొంటున్న అన్యాయాలను ప్రశ్నించినా ప్రాణాలు తీసే వాతావరణం వ్యవస్థలో అలుముకొంటోంది’ అన్నది ముత్తు క్రిష్ణన్ ఆవేదన. మనది సాంస్కృతికంగా భిన్నత్వంతో కూడిన సమాజం కనుక మతపరమైన విశ్వాసాలకు పెద్దపీట వేయడం తప్పని ఆయన స్పష్టమైన భావన. భారతీయ సమాజం సహనంతో కూడుకొన్నది అన్న సాంప్రదాయక వాదనను అడ్డుకొనే వారిని సహించే వాతావరణం లేదు. చరిత్రలో ముందునుంచి ఉన్న వివక్షత లను ఏకరువు పెట్టేదిగా గణితం ఉండరాదని, గతం నుంచి స్వేచ్ఛ ప్రసాదిం చేదిగా ఉండాలని ముత్తు క్రిష్ణన్ వాదించారు. హిందుత్వవాదుల ‘వేద గణితం’ భజనపై దీనిని వ్యాఖ్య అనుకోవాలి.
అణగారిన వర్గాల నుంచి విద్యార్థులు చదువుకోడానికి రావడం ఎక్కువ వడంతో జ్ఞానానికి సంబంధించి కొత్తకొత్త చర్చలు, వాదనలు వినిపిస్తు న్నాయి. అలాగే భిన్న రాజకీయ సిద్ధాంతాలు కూడా వర్శిటీలలో తెరమీదకి వచ్చాయి. దీనితో చోటు చేసుకొంటున్న కొత్తకొత్త డిమాండ్లు వర్శిటీలపాల నపై, బోధనాక్రమంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. వివక్షను అన్ని రూపాల్లో పునరుద్ధరించే ‘ఆధునిక మనువు’ లనుంచి జాగ్రత్తగా ఉండాలని ముత్తు క్రిష్ణన్ మనను హెచ్చరిస్తున్నాడు. మన విద్యావిధానం అటువంటి యత్నాలకు దొడ్డిగుమ్మం కాకూడదని ఆయన కోరుకొంటున్నాడు. లేకుంటే అణగారిన వర్గాలపై అగ్రవర్ణాల హింస ఉన్నతవిద్య స్థాయిలో కూడా కొనసాగుతుంద న్నదే ఆయన భయం.

– మనిష్ ఫిరావో భట్టాచార్జీ