Home కెరీర్ 57,177 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

57,177 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

Out of 79856 engineering seats in 175 colleges

 

9 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ
ఒక కాలేజీల్లో జీరో అడ్మిషన్స్
ఇంజనీరింగ్, ఫార్మసీలో మిగిలిన సీట్లు 26,882
ప్రత్యేక విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. 175 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 79,856 సీట్లు అందుబాబాటులో ఉండగా, 57,177 (71.60 శాతం) సీట్లు కేటాయించారు. 22,279 సీట్లు ఖాళీగా మిగిలాయి. 158 ప్రైవేట్ కళాశాలల్లో 74,201 సీట్లు అందుబాటులో ఉండగా, 52,734 సీట్లు కేటాయించారు. ప్రైవేట్ కళాశాలల్లో 12,467 సీట్లు మిగిలిపోయాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 15 యూనివర్సిటీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న 4,069 సీట్లకు 3,343 సీట్లు (82.16 శాతం) కేటాయించగా, 726 సీట్లు ఖాళీగా మిగిలాయి. రెండు ప్రైవేట్ యూనివర్సిటీలలో 1,586 సీట్లు అందుబాటులో ఉండగా, 1,100 సీట్లు(69.36 శాతం) కేటాయించగా, 486 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఎంసెట్‌లో 1,21,480 మంది విద్యార్థులు అర్హత సాధించగా,ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో 14,919 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ప్రత్యేక విడతలో కన్వీనర్ కోటాలో 79,856 ఇంజనీరింగ్ సీట్లు, 4,426 బి.ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా, సీట్ల కేటాయింపు తర్వాత 26,882 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ కౌన్సెలింగ్‌లో 689 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చినా వారికి ఏ కాలేజీలోనూ సీటు లభించలేదు.

ఇడబ్లూఎస్ కోటాలో 4,674 సీట్లు కేటాయింపు
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఈ విద్యాసంవత్సరం మొదటిసారి ఇడబ్లూఎస్ కోటా అమలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో ఇడబ్లూఎస్ కోటా కింద 4,674 సీట్లు కేటాయించారు.

9 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ
ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు రాష్ట్రంలో 9 కాలేజీల్లో 100 శాతం సీట్లు కేటాయించారు. ఒక యూనివర్సిటీ, 8 ప్రైవేట్ కాలేజీల్లో 100 శాతం సీట్లకు కేటాయింపు జరిగాయి. ఈసారి ఒక కాలేజీలో జీరో అడ్మిషన్స్ నమోదయ్యాయి.

ఫార్మసీలో 5.03 శాతమే కేటాయింపులు
ఎంపిసి విద్యార్థులు ఫార్మసీ కోర్సుల్లో చేరడానికి అంతగా ఆసక్తి కనబరచలేదు. ఈ విద్యాసంవత్సరం మొత్తం 172 కళాశాలల్లో 4,426 సీట్లు అందుబాటులో ఉండగా, 223 సీట్లకు మాత్రమే కేటాయింపులు జరిగాయి. 118 కాలేజీల్లో 3,838 బి.ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా, ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో 135 సీట్లు (3.70 శాతం) కేటాయించారు. 3,661 సీట్లు మిగిలిపోయాయి. 55 కాలేజీల్లో 588 ఫార్మా డి సీట్లు అందుబాటులో ఉండగా, 46 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 542 ఫార్మా డి సీట్లు ఖాళీగా మిగిలాయి.

రిపోర్టింగ్ తప్పనిసరి
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా రిపోర్టింగ్ చేయాలి. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతోపాటు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. 26లోగా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు కూడా నేరుగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు. కాలేజీల్లో రిపోర్టింగ్ చేసే సమయంలో ఒరిజినల్ టిసితో పాటు మిగతా సర్టిఫికెట్ల జిరాక్స్ సెట్‌ను అందజేయాలి. గడువులోగా రిపోర్టింగ్ చేయని విద్యార్థుల సీటు రద్దువుతుంది. విద్యార్థులు తమ సీటు రద్దు చేసుకునేందుకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు.

ఈ కోర్సుల్లో 100 శాతం కేటాయింపు
ఇంజనీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో పలు బ్రాంచీల్లో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇందులో కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్,బి.టెక్ మెకానికల్ విత్ ఎం.టెక్ మానుఫ్యాక్షరింగ్ సిస్టమ్ కోర్సుల్లో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కోర్సులో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. 28 సీట్లకు 28 ఖాళీగా మిగిలాయి.

Out of 79,856 engineering seats in 175 colleges