Home తాజా వార్తలు టెస్లుల సంఖ్య రెట్టింపు

టెస్లుల సంఖ్య రెట్టింపు

Over 6,000 COVID-19 patients in home isolation

 

రాబోయే రోజుల్లో భారీగా కరోనా కేసులు
అన్‌లాక్ పీరియడ్‌లోనే అధికంగా పాజిటివ్‌ల సంఖ్య
ప్రైవేటులో అడ్డగోలుగా ఫలితాలు, చర్యలు తప్పవు
ఆందోళన వద్దు, కరోనా కట్టడికి సౌకర్యాలున్నాయి
ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే హోం ఐసోలేషన్‌లో ఎక్కువ
డిహెచ్ శ్రీనివాస రావు, డిఎంఇ రమేష్ రెడ్డి ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచిందని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా. శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ వైరస్ బారిన పడినా, గందరగోళానికి గురికావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి సుమారు 50 శాతం మంది రికవరీ అయ్యారని, మరణాల శాతం కూడా చాలా తక్కువగా ఉందని ఆయన గుర్తుచేశారు. కరోనా అంశంపై ఆయన కోఠి వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో డిఎంఇ డా రమేష్‌రెడ్డితో కలసి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా డిహెచ్ డా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఇప్పటి వరకు అత్యధికంగా 13,534 మందికి కేవలం జూన్ నెలలోనే వైరస్ సోకిందన్నారు. అన్‌లాక్ పీరియడ్‌లో ప్రజలతో పాటు వైరస్ కూడా తిరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. వైరస్ వచ్చిన వారిలో సుమారు 80 శాతం మంది సులువుగా కోలుకుంటున్నారని, కేవలం 20 శాతం మందికి మాత్రమే హాస్పిటల్స్‌లో ఉంచి వైద్యం అందించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. వీరిని నిత్యం మానిటరింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సూచన మేరకు టెస్టింగ్ కెపాసిటీని పెంచామని, రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తామని ప్రకటించారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చీతే తెలంగాణలో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని, లాక్‌డౌన్ పీరియడ్‌లో తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వలనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. ఢిల్లీ తర్వాత తెలంగాణాలోనే ఎక్కువ మంది హోం ఐసోలేషన్ ఉన్నారన్నారు. గత నెలరోజుల్లో 12వేల మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారని, ప్రస్తుతం 6556 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల్లో 85 శాతం జిహెచ్‌ఎంసి పరిధిలోనే వస్తున్నాయని, జిల్లాల్లో వైరస్ వ్యాప్తి కాస్త తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈక్రమంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. అయితే వైరస్ వచ్చిన వారంతా చనిపోతారనే అపోహాలు నుంచి ప్రజలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయిన వారిలో 90 శాతం మంది కో మార్పిడ్ కండిషన్‌తోనే చనిపోయారని ఆయన చెప్పారు.

కరోనా కట్టడికై ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో రిపోర్టులు తెప్పించుకొని సమీక్షలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరింత పకడ్బందీగా ముందుకు వెళ్తామని అన్నారు. కరోనా అంశంలో తప్పుడు ప్రచారాలు చేసి ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని ఆయన అన్నారు. సుమారు 500 మంది వారి కుటుంబాలను వదిలేసి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మర్కజ్, వందేమాతరం కార్యక్రమం, మైగ్రెంట్స్ వలనే ఎక్కువ మంది వైరస్ బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు. టెస్టుల విషయంలోనూ వైద్యారోగ్యశాఖ పారదర్శకంగా పనిచేస్తుందని, శాంపిల్ తీసుకున్న రెండు రోజుల్లోనే రిపోర్టును ఇస్తున్నామన్నారు. అదే విధంగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అన్ని విధాలుగా ట్రేసింగ్ చేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడికై ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, కానీ ప్రజలు కూడా దీనికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రైవేట్ ల్యాబ్స్‌లో ఎక్కడా లేని విధంగా పాజిటివ్ రేట్ వస్తుంది
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18 ప్రైవేట్ ల్యాబ్స్‌లో టెస్టులు నిర్వహిస్తున్నారని, దీంతో పాటు కొత్తగా మరో 5 ల్యాబ్స్‌కి అనుమతి లభించిందని డిహెచ్ డా శ్రీనివాసరావు తెలిపారు. అయితే కొన్ని ల్యాబ్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పాజిటివ్ రేట్ వస్తుందని, దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇటీవల నిపుణుల కమిటీలో కూడా అనేక ఉల్లంఘనలు గుర్తించామని, వాటిని సరిదిద్దుకునేందుకు సమయం కూడా ఇచ్చామన్నారు. ట్రైనింగ్ లేని టెక్నిషియన్లు వలనే ఇలా తప్పుడు నివేదికలు వచ్చినట్లు తాము ప్రాథమికంగా గుర్తించామని ఆయన తెలిపారు. దీంతో పాటు కొన్ని ల్యాబ్స్ పోర్టల్‌లో తప్పుడు గణాంకాలను చూపిస్తున్నాయని వాటిని కూడా హెచ్చరించామన్నారు. తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని డిహెచ్ చెప్పారు.

అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు ఉన్నాయి : డిఎంఇ
ప్రభుత్వం నిర్ణయించిన గాంధీ, కింగ్‌కోఠి, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రుల్లో 2501 బెడ్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 1034 బెడ్లలో రోగులు ఉన్నారని డిఎంఇ డా రమేష్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో టెస్టింగ్ కెపాసిటీ 5వేలకు చేరగా, ప్రైవేట్ ల్యాబ్స్‌లో మరో 8వేలకు చేరిందని ఆయన తెలిపారు. దీంతో పాటు టిఎస్‌ఎంఐడిసి ద్వారా రోగులకు కావాల్సిన మందులు, వెంటిలేటర్స్, ఇతర సౌకర్యాలను సమకూర్చామని ఆయన ప్రకటించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కరోనా విషయాలను దాస్తే దాగేవి కావని వైద్యారోగ్యశాఖ చాలా పారదర్శకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.