Home తాజా వార్తలు 2 కార్లలో భారీ నగదు

2 కార్లలో భారీ నగదు

Over Rs 2 crore seized from cars in Gadchiroli

 

మంచిర్యాల జిల్లా సిరోంచ చెక్ పోస్టు వద్ద రూ.2.20 కోట్లు స్వాధీనం

మావోయిస్టుల కోసం తీసుకెళ్తున్నట్లు పోలీసుల అనుమానం, ఇద్దరు తునికాకు కాంట్రాక్టర్‌లు, మరి ఇద్దరు అరెస్టు

మనతెలంగాణ/మంచిర్యాల: జిల్లా సరిహద్దుల్లో భారీగా కరెన్సీ పట్టుబడడం కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా సిరోంచ చెక్‌పోస్టు వద్ద రెండు రోజుల క్రితం మహారాష్ట్ర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో రూ. 2.20 కోట్ల నగదు లభించింది. ఈ సంఘటన గురువారం వెలుగుచూసింది. తునికాకు కాంట్రాక్టర్లను అరెస్టు చేయడంతో విషయం బయటకు పొక్కింది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన తునికాకు కాంట్రాక్టర్లు చెరుకు నారాయణరెడ్డి, ఎండి గౌసొద్దీన్‌లు రెండు కార్లలో భారీగా నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నగదు విషయాన్ని పోలీసులు విచారించగా తగిన ఆధారాలు చూపించలేదు. దీంతో ఇద్దరు తునికాకు కాంట్రాక్టర్లతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

తునికాకు సీజన్‌లో ప్రతి సంవత్సరం మావోయిస్టులకు కాంట్రాక్టర్లు చందాల రూపంలో నగదును అందజేస్తుంటారని, ప్రస్తుతం పట్టుబడిన నగదును కూడా మావోయిస్టులకు అందజేసేందుకు తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తునికాకు కాంట్రాక్టర్లను అరెస్టు చేసిన పోలీసులు వారి బ్యాంక్ లావాదేవీలు, ప్రభుత్వం నుంచి వారికి వచ్చిన చెక్కుల వివరాల గురించి వివరాలు సేకరిస్తున్నా రు. విచారణలో నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో బ్లాక్ మనీగా పోలీసులు అనుమానిస్తూ పలు కోణాల్లో దర్యాప్తు చేసున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు రూ. 2.20 కోట్ల నగదు చేరవేస్తుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర, మంచిర్యాల పోలీసులు సమన్వయంతో దర్యాప్తు చేస్తున్నారు.

Over Rs 2 crore seized from cars in Gadchiroli