Home అంతర్జాతీయ వార్తలు ముసలివారిలో ఆక్స్‌ఫర్డ్ టీకా విజయవంతం

ముసలివారిలో ఆక్స్‌ఫర్డ్ టీకా విజయవంతం

Oxford covid vaccine is successful in elderly people

 

భేషైన వ్యాక్సిన్ల రేసులో ప్రవేశం

లండన్ : ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కోవిడ్ టీకా వృద్ధులలో సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రత్యేకించి 70 ఏళ్లు పైబడ్డ వారు, 56 నుంచి 69 ఏళ్లలోపు ఆరోగ్యవంతులలో ఈ వ్యాక్సిన్ సమృద్థిగా రోగనిరోధక శక్తిని కల్పిస్తోంది. ఆక్స్‌ఫర్ట్ వ్యాక్సిన్ ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి రావడానికి రంగం సిద్ధం అయింది.దీని పనితీరు వివరాలను లాన్సెట్ వైద్య పత్రిక తాజా సంచికలో ప్రచురించారు. ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ పరిశోధకుల రూపకల్పనలో ఉన్న క్లోరో యాడ్ ఆక్స్ 1 ఎన్‌కోవ్ 19 టీకా సామర్థాన్ని వివిధ వయస్కులలో పరీక్షించి చూశారు. ఈ దశలో 560 మంది హెల్తీ అడల్ట్ వాలంటీర్లపై వ్యాక్సిన్ డోసులను వాడి చూశారు. ఈ క్రమంలో ప్రతికూలతలు ఎక్కువగా లేవని నిర్థారణ అయింది. ప్రత్యేకించి వయస్సు మీద పడ్డవారు, కరోనా ముప్పు ఎక్కువగా పొంచి ఉన్న వారిలో తగు స్థాయిలలో ఇమ్యూనిటీ ఏర్పడటం, పైగా వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ప్రతికూలతలు లేకపోవడం వంటివి గమనించినట్లు లాన్సెట్‌లో తెలిపారు.

ముసలి వారిలో ఈ టీకా మందు సమర్థత నిర్థారణ కావడం ప్రోత్సాహజనకంగా ఉందని , ప్రత్యేకించి పెద్దవారు కరోనా తీవ్రతకు గురి కాకుండా ఉండటం వల్ల మరణాలను నివారించవచ్చునని తేలిందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకుల బృందాలు ఇప్పుడు ఫేజ్ 3 ట్రయల్స్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాయి. ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించిన వారిలో కోవిడ్ 19 లక్షణాలు తలెత్తకుండా ఉంటున్నాయా? అనే విషయాన్ని నిర్థారించుకుంటామని, వచ్చే కొద్ది వారాలలో దీనిపై వచ్చే ఫలితాల ద్వారా ఈ వ్యాక్సిన్ సమర్థత విషయంలో పూర్తి స్థాయి నిర్థారణకు వీలేర్పడుతుందని ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్‌లోని విశ్లేషకులు డాక్టర్ మహేష్ రామస్వామి తెలిపారు.కరోనా మనిషికి సోకకుండా చేయడంలో ఈ టీకా మందు ఏ విధంగా పనిచేస్తుందనేది వచ్చే దశ పరీక్షతో తేటతెల్లమవుతుందని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇతర దేశాలలో కోవిడ్ నియంత్రణలోకి రాకుండా కేసులు పెరుగుతున్న దశలో సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ల విషయంలో ఆశలు మరింతగా రేకెత్తుతున్నాయి. ఇప్పటికే ఫైజర్, స్పుత్నిక్, మోడెర్నా ఈ దిశలో కీలక దశల పరీక్షలలో తమ సమర్థతను చాటుకున్నాయి. ఇప్పుడు ఈ వరుసలో నాలుగో భేషైన వ్యాక్సిన్‌గా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ స్థానం దక్కించుకునేందుకు వీలేర్పడింది. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం పది కోట్ల డోస్‌ల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సేకరణకు ఆర్డర్లు వెలువరించింది. ఆక్స్‌ఫర్డ్ టీకా మందును ప్రముఖ ఔషధ సంస్థ అస్ట్రా జెనెకా రూపొందిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వ ప్రోత్సాహం దండిగా ఉన్న ఈ వ్యాక్సిన్ తయారీలో పుణేకు చెందిన ప్రఖ్యాత సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియాకు కూడా భాగస్వామ్యం ఉంది. అత్యధిక స్థాయిలో ఈ వ్యాక్సిన్ తయారీవిషయంలో సీరం సంస్థ సహరిస్తుంది.

Oxford covid vaccine is successful in elderly people