Home తాజా వార్తలు ఓజోన్ పొర విద్వంసం -మానవ మనుగడ ప్రమాదం

ఓజోన్ పొర విద్వంసం -మానవ మనుగడ ప్రమాదం

 


జీవావరణ వ్యవస్థలోని జనాభా పెరుగుదల వల్ల నైతేనేమి, మారిన జీవన విదానాల వల్ల నైతేనేమి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల నైతేనేమి పర్యావరణ సమస్యలు తీవ్రంగా ఏర్పడుతున్నాయి. జనాభా పెరిగే కొద్దీ మానవ నివాసానికి, వ్యవసాయ భూమి, వంటచెరకు కోసం అడవులను, పచ్చిక బయళ్లను నాశనం చేస్తుండటం వల్ల భూమి మృత్తికలు, వాటిలోని సారం కొట్టుకుపోతున్నాయి. సాగుచేయడం ద్వారా మిగిలే వ్యర్థ, ఘన, ద్రవ పదార్థాలు.. అనాగరిక పారిశుద్ధ్య అలవాట్ల వల్ల పర్యావరణ సంక్షోభం ఏర్పడుతోంది. మానవ విపరీత, ఉదారవాద , పెట్టుబడిదారీ వ్యవస్థల వల్ల ప్లాస్టిక్ వాడకం క్రమేపి పెరుగుతుంది. ఈ వ్యర్థాలను తగిన విధంగా నియంత్రించకపోవడంతో శిలావరణ, జల, వాయు సంక్షోభానికి దారి తీస్తోంది. కొన్ని వ్యవసాయ విధానాలతోపాటు పురుగుమందులు, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి రసాయన, జైవిక సంక్షోభానికి గురవుతోంది.

మనిషి స్వార్థానికి ప్రకృతి ప్రమాదంలో పడుతూనే ఉంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడంతో ప్రమాద స్థాయి పెచ్చురిల్లుతోంది. పల్లెల నుంచి చాలా మంది పట్టణాలకు వలసబాట పట్టడంతో కాలుష్యం పెరిగిపోతోంది. ఇబ్బడిముబ్బడిగా మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం ఓజోన్ పొరకు చేటు తెస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా, మనుషులు అవేవీ పట్టనట్టు వ్యవహరించడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. మానవ తప్పిదాల వల్ల పుడమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ పొర నేడు పలుచబడిపోతోంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర దెబ్బతింటూ ఉండటంతో మానవులు రోగాల బారిన పడుతున్నారు.

ఓజోన్ పొర : ఓజోన్ పొరలో రంధ్రాలు లేదా బొక్కలు లేదా చిరుగులు ఏర్పడటం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడటం వల్ల సకల జీవరాశులకూ ముప్పు వాటిల్లుతోంది. ఆ వేడిని తట్టుకునే సామర్థ్యం భూమిపై నివసించే జీవరాసులకు లేదనే చెప్పాలి. మనుషులు సైతం తట్టుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రకృతి గతితప్పుతుంది. భూమిపైన 15 నుంచి 25 కిలోమీటర్ల వరకూ ఉండే రెండో పొరను ఓజోన్‌పొర(ఓ3) అంటారు. ఈ పొర సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిమీదకు చేరకుండా అందులో ఉండే అతినీలలోహిత కిరణాలను సంగ్రహిస్తుంది. తద్వారా ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతోంది ఓజోన్ పొర.

 

పొంచి ఉన్న ముప్పు: కొంచెం ఎండ ఎక్కువైతే బయటకు వెళ్లడానికి భయపడతాం. ఇక భగభగమండే సూర్య కిరణాలు నేరుగా మనపై పడితే తట్టుకోలేం. కానీ, ఆ విధమైన ప్రమాదం సమీప భవిష్యత్తులో పొంచి ఉందనే ఆందోళన ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎందుకంటే సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావం నేరుగా మనమీద పడకుండా మనల్ని రక్షించే ఓజోన్ పొర క్రమేపీ పలుచబడుతోంది. దీనికి మానవ విధ్వంసమే ప్రథమ కారణమని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లోనే మాంట్రియల్ ప్రొటోకాల్(ఓజోన్ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) హెచ్చరించింది. ఓజోన్ పొరకు వాటిల్లుతున్న ముప్పును అరికట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు ఓజోన్ పొర విధ్వంసానికి మానవుడే ప్రధాన కారణం. ఈ విధ్వంసంలో ’క్లోరో ఫ్లోరో కార్బన్లు’ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటినే ’క్లోఫోకాలు’ (ఈ ఒక కణం క్లోరిన్, ఫ్లోరిన్, కర్బనాల మిశ్రమం) అంటున్నారు. వీటితోపాటు బ్రోమిన్ కూడా ప్రమాదకారిగా మారింది. దీన్ని అగ్నిమాపక పరికరాల్లో ఉపయోగిస్తున్నారు. పంటలపై చల్లే స్ప్రేలు, రిఫ్రిజిరేటర్లు, ప్లాస్టిక్, ఫోమ్, దోమల నాశినిలకు వాడే కాయిల్స్,జెట్ బిళ్ళల వల్ల ఏర్పడే పొగ డిటర్జెంట్ల ఉత్పత్తుల తయారీ వల్ల వాతావరణంలో క్లోఫోకాలు ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టన్నుకంటే ఎక్కువగా విడుదల అవుతున్నాయి. దీనివల్ల ఏటా లక్ష మందికి పైగా చర్మ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.

ఏటా 20 లక్షల మందికి చర్మ కేన్సర్…సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడకుండా నిలువరించే ఓజోన్ పొరను 1930లో కనుగొన్నారు. భూ ఉపరితలంపై స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఓజోన్ ఉంటుంది. 25 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఎక్కువగా ఆవరించి ఉంటుంది. స్ట్రాటోస్పియర్‌లో ఉన్న ఓజోన్ అతినీలలోహిత కిరణాలను సంగ్రహించుకుంటుంది. క్లోరోఫాం కార్బన్ ఉపయోగించడం వల్ల స్ట్రాటోస్పియర్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఓజోన్ పొరకు ముప్పు వాటిల్లుతోంది. ఓజోన్ పొరకు చిల్లులు పడడం వల్ల అతినీలలోహిత కిరణాలు భూమిని డైరెక్టుగా తాకడంతో నేత్ర వ్యాధులు, చర్మ కేన్సర్, చివరగా జన్యుపరమైన వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం స్ట్రాటోస్పియర్‌లో ఉష్ణోగ్రతలు పెరగడంతో నేత్ర వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నేత్ర వ్యాధులు ప్రబలడం తొలి దశలోనే ఉన్నాం. శీతల దేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఈ ప్రభావం కనిపిస్తోంది. ఒక సర్వే ప్రకారం భూమిమీద 20 నుంచి 30 లక్షల మంది వరకూ చర్మ కేన్సర్ బారినపడినట్టు తెలిసింది.మానవాళి అవసరాలకు వాడే అనేక వస్తువుల నుంచి వెలువడే కాలుష్యం, వాటి ఉత్పత్తికి వాడే రసాయనాలతో ఓజోన్ పొరకు ముప్పు ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

ఏరోసోల్ ఉత్పత్తులు, రిఫ్రజరేషన్, ఎయిర్ కండిషినింగ్ ఉత్పత్తులు, ఫోంబ్లోయింగ్ ఆప్లికేషన్స్, స్ప్రేల ఉత్పత్తులను విచ్చలవిడిగా వినియోగించడంతో ఓజోన్‌కు ముప్పువాటిల్లుతుందని గుర్తించారు. భారతదేశం 1993 నుంచి జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. సీఎఫ్‌సీ వంటి ఉత్పత్తులు నిలిపివేయాలని 296 కన్వర్షన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 2008లోనే క్లోరోఫ్లోరో కార్బన్‌ల వినియోగాన్ని నిలిపివేసింది. మాంట్రియల్ ఒప్పందం మేరకు గడువు కంటే ముందుగానే అనేక నియంత్రణలు పాటించింది మన దేశమే. సీటీసీ ఉత్పత్తులు వినియోగాన్ని 85 శాతం మేరకు కుదించడానికి సంబంధించే లక్ష్యం నెరవేర్చిన దేశం కూడా మనదే. భారతదేశంలో సీఎఫ్‌సీకి ప్రత్యామ్నాయంగా అనేక పరిశోధనలను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) చేపడుతోంది. మిగతా వర్సిటీలు, పరిశోధనా సంస్థలు సీఎఫ్‌సీకి ప్రత్నామ్నాంగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇదే సమయంలో మనిషి విలాసాలను తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది.
85 శాతం ధ్వంసం :ఓజోన్ పొర మందం సన్నగిల్లుతున్నట్లు శాస్త్రవేత్తలు 1980 దశాబ్దంలోనే గమనించారు. ఆర్కిటిక్ ప్రాంతంపై ఉండే ఓజోన్ పొర 85 శాతం పైగా ధ్వంసమైందని తాజా పరిశీలనల్లో తేలింది. దీని ప్రభావం వల్ల ఉత్తర యూరప్ ప్రాంతంలో చర్మ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఓజోన్ పొర ప్రస్తుతం 14 మిలియన్ చదరపు మైళ్ల మేర ఛిద్రమైందని ఓజోన్ పొరపై పరిశోధన చేసిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

జీవన విధానం మార్చుకోవాలి: అందివచ్చిన విలాసాలను విచ్చలవిడిగా వాడుతున్నాం. ముఖ్యంగా పట్టణాల్లో ఇటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఏసీలు, కాస్మోటిక్స్, స్ప్రేల నుంచి ప్లాస్టిక్ వరకు ప్రతి వస్తువును పరిమితికి మించి వినియోగిస్తున్నాం. ఇదే ఓజోన్ పొరకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి తీసుకు వస్తోంది. సీఎఫ్‌సీ తగ్గాలంటే తొలుత ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. అవసరం మేరకు స్ప్రేలు వాడాలి. ఏసీల వాడకం తగ్గించాలి. పాలిథిన్ వినియోగం తగ్గించాలి. బజారుకు వెళ్లే వారంతా గుడ్డ సంచులు తీసుకుని వెళ్లాలి. మానవ జీవన విధానం మార్చుకోవాలి. ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం రావాలి. భారతదేశంలో ఓజోన్ ప్రభావం పడిందనే నివేదికలు లేవుగానీ భవిష్యత్తును పరిగణనలో తీసుకుని జాగ్రత్త పడాలి. ఏసి లు పెద్దగా ఉండనవసరం లేని కార్యాలయాలు ,ఇండ్లు నిర్మించే విదంగా ఇంజనీర్లు,శాస్రవేత్తలు కృషి చేయాలి. రోడ్డు వెడల్పుకు , ఇండ్లకు, ఫ్యాక్టరీలకు, పరిశ్రమలకు అడ్డంగా వస్తున్నాయని చెట్లు నరకడం, అడవులను నరికే దుశ్చర్యలకు ప్రభుత్వాలు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలి.చెట్లను విరివిగా పెంచాలి. చెట్లను పెంచే కార్యక్రమం ఏదో తూ…తూ మంత్రంగా కాకుండా గ్రామ స్థాయి నుండే లక్ష్యాలను పెట్టుకొని సాదించాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి.విచ్చలవిడిగా ప్లాస్టిక్ తయారీని నిషేదించాలి.ప్రజలలో చైతన్యం తెచ్చేలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల భాగస్వామ్యం తో ప్లాస్టిక్ వాడకం క్రమేపి తగ్గించాలి. మన భావి తరాలు బాగుండాలంటే ఓజోన్ పరిరక్షణ చర్యలు చేపట్టడం అవసరం.అపుడే మన పిల్లల భవిష్యత్తు అంధకారం కాకుండా ఉంటుంది. ఈ విషయాన్నీ ప్రతీ ఒక్కరు గుర్తించాలి.