Home దునియా పదనిలం పరబ్రహ్మ ఆలయం

పదనిలం పరబ్రహ్మ ఆలయం

దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం పరబ్రహ్మ ఆలయం. బ్రహ్మదేవుడికి ఆలయాలు అరుదుగా ఉన్నట్టే పరబ్రహ్మకు కూడా ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి అరుదైన ఆలయాలలో ఒకటి కేరళలోని పదనిలం పరబ్రహ్మ ఆలయం ఒకటి. ఎంతో పురాతనమైన ఈ ఆలయం గతంలో ట్రివాంకూర్ స్టేట్‌లో ఉండేది. ఇది ప్రస్తుతం అళప్పుళ జిల్లాలో పదనిలం అనే ఊళ్ళో ఉంది. 

Padanilam Temple is Believed to be Swayambhu

ఈ ఆలయాన్ని ఓంకారం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఓంకారశిల పూజలందుకుంటూ ఉంటుంది. ఇది స్వయంభువు. విచిత్రమేమిటంటే ఆలయానికి గర్భగుడి, గోపుర ప్రాకారాల, తలుపులు వగైరాలేవీ ఉండవు. ఈ ఓంకారశిల చెట్టుకింద ఉంటుంది. కనుక తలుపులు మూయడాలు, తీయడాలవంటివేవీ ఉండవు. అలాగే ఉదయం మంగళతూర్యారావాలతో తలుపులు తీసే నాదతురప్పు సంప్రదాయం, సాయంత్రం ఆలయం మూసివేసే సమయంలో చేసే మంగళనాదాలు నాద అడక్కళ్ ఉండవు. ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు? ఎప్పుడు కట్టించారు? ఇక్కడ పూజాదికాలు, జాతరలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? వంటి వివరాలు లభ్యం కావడంలేదు. ఈ ప్రాంతం గతంలో నూరనాడులో ఉండేది. సరిహద్దు తగాదాలకు ఇది వేదికగా ఉండేది. ఎక్కడెక్కడివారు ఈ ఆలయంపై ఆధిపత్యం సంపాదించడం కోసం హోరాహోరీ పోరాటాలు చేసినట్టు తెలుస్తోంది. మళయాళంలో పోరాటాన్ని పదం అంటారు. పోరాటాలకు వేదిక కనుక ఈ ప్రాంతాన్ని పదనిలం అని పిలిచేవారు.

కాలక్రమంలో ఇదే ఊరిపేరుగా మారిపోయింది. ఇరుగుపొరుగు రాజుల దాడులు ముమ్మరంగా ఉండడంతో కాయంకులం రాజులు ఇక్కడ మాటువేసి, మకాంవేసి ఈ ఆలయాన్ని కాపాడేవారు.400సంవత్సరాల క్రితం కాయంకులం రాజు తన బలగాలను ఇక్కడి నుంచి ఉపసంహరించుకోవడంతో ఈ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. ఆలయానికి ఉత్తరం దిక్కున ఉన్న రాజులు, దక్షిణం దిక్కున ఉన్న రాజులు పరస్పరం కలహించుకునేవారు. దక్షిణదిక్కు రాజులలో నూరుకోడి కరుప్పన్లు, కడకళ్ కురుప్పన్లు ఉండేవారు. ఉత్తరదిక్కు రాజులలో వెట్టతహసన్లు, వెట్టాడికల్ కురుప్పన్లు ఉండేవారు. వీరికి 24రాజ్యాల ప్రభువులు దన్నుగా నిలిచేవారు. ఈ భీకర పోరాటాలకు మార్తాండవర్మ అనే రాజు నాయకత్వం వహించేవాడు. వీరిని ఎదుర్కొని ఆలయాన్ని కాపాడుకోడానికి కాయంకులం రాజు అడ్డుకుని పోరాడేవాడు. వీరి యుద్ధాలలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రజల అభ్యర్థన మేరకు పళూరు పనమన తంపురన్ అనే పెద్దమనిషి రాయబారం నడిపాడు. కానీ ఆయన మాట వినేస్థితిలో ఉభయపక్షాలలో ఎవ్వరూ లేకపోవడంతో యుద్ధాలు ఆగలేదు. ఆలయం ఉన్న చోట మారణహోమాలు పనికిరావని ఆయన హితవు చెప్పారు. ఎవ్వరూ వినలేదు. రాజుల వైఖరికి అలిగిన తంపురన్ ఆమరణదీక్షకు కూచున్నాడు. అయినా ఉపయోగం లేకపోయింది. యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆలయం వెనక ఉన్న‘చిర’లో కప్పెట్టేవారు. మందిరమున్న తావు మరుభూమిగా మారిపోయింది.

ఆయన ప్రాణాలు కడగట్టి చనిపోయే పరిస్థితి ఏర్పడడంతో బ్రహ్మణ శాపం వల్ల ఈ ప్రాంతం నాశనమైపోతుందన్న భయంతో రాజులు పోరాటాలు ఆపారు. సరిహద్దులు నిర్ణయించుకుని ఎవరి హద్దులలో వారు ఉండడంతో ఆలయ పరిసరాలు శాంతించాయి.  చాలా పురాతన కాలంలోనూ ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఓంకారస్వరూపుని ఆశీస్సులు పొందే వారని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ పూజలు చేసే అర్చకులు విధిగా బ్రాహ్మణులే అయి ఉండాలన్న నియమం ఏదీలేదు. హిందూ మతేతరులు కూడా రావచ్చు. ఇక్కడ జరిగే పూజలు, పునస్కారాలు, జాతరలలో సమధికోత్సాహంతో పాల్గొనవచ్చు. ఎవ్వరూ అభ్యంతరపెట్టరు. మతసామరస్యానికి, సర్వమానవ సౌభ్రాతృత్వానికి పదనిలం పెట్టిందిపేరు. రక్తం పారిన నేలలోనూ అనురాగం నిండడం, నిజమైన భారతీయతకు, హిందూత్వానికి సంకేతంగా నిలవడం సంతోషదాయకం. ఇక్కడకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదం గా విబూది ఇస్తారు. వృశ్చికమాసంలో (నవంబర్ 16డిసెంబర్ 15) తొలి 12 రోజులు భక్తులు ఆలయంలోనే ఉండి భజనలు, పూజలు చేసుకోడానికి అనుమతిస్తారు. భక్తులు ఉండడానికి వీలుగా గుడిసెలు, డేరాలు ఇస్తారు. ఈ ఆలయం శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి అనుబంధ ఆలయం. అయ్యప్ప భక్తులు ఇక్కడ సేదతీరుతుంటారు. పంబానదీ తీరానికి వెళ్ళే బస్సులన్నీ ఈ పదనిలం మీది నుంచే వెళతాయి. ఇక్కడ దిగే భక్తులకు అయ్యప్ప దేవాలయం వారు అల్పాహారం, అల్లం టీ ఇస్తారు.

ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా, నేత్ర పర్వంగా జరుగుతాయి. పెద్దపెద్ద కాడిఎడ్లను తయారుచేసి ఆలయం చుట్టూ ఊరేగిస్తారు. వీటిలో కొన్ని 50 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ భారీ బసవన్నలను స్థానికంగా కెట్టుకల అని పిలుస్తారు. ఈ ఎడ్ల పండగను ఇక్కడివారు కావడియట్టం అని పిలుస్తా రు. ఈ సంబరాలు సుబ్ర హ్మేణ్యశ్వరుని కోసం చేస్తారు. ఈ కావళ్ళు రాష్ట్రం నలుమూలల నుంచీ వస్తాయి. ఇక్కడ దొరికే నందిబొమ్మలకు ఈ కావడిని జోడించి ఊరేగింపు జరుపుతారు. ఈ జాతర జరిగే మైదానాన్ని కెట్టుల్‌సవం అంటారు. ఈ జాతర సాయంత్రం 4గంటలకు మొదలై అర్థరాత్రి ముగుస్తుంది. ఈ నందులను తయారుచేసి ఇచ్చే కళాకారులు నూరనాడులో పెద్దపెద్ద సంఖ్యలో ఉన్నారు. సాంస్కృతికంగా ఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి కేరళ ప్రభుత్వం దీన్ని నందికేశ పైతృక గ్రామం గా నామకరణం చేయాలని ఆలోచిస్తోంది.

ఎలా చేరుకోవాలి? 

హైదరాబాద్ నుంచి ముందుగా తిరువనంతపురానికి చేరుకోవాలి. తిరువనంతపురం వరకు రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తిరువనంతపురం విమానంలో చేరుకుంటే అక్కడి నుంచి పదనిలం రోడ్డుద్వారా రెండున్నర గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి. రైలుద్వారా వెళ్ళ దలచుకున్న వారికి శబరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కి త్రివేండ్రం చేరుకుంటే అక్కడి నుంచి పదనిలం తీసుకువెళ్ళేందుకు 19 రైళ్ళు ఉన్నాయి. బస్సులో వెళ్ళే వారు హైదరాబాద్‌లో బయల్దేరి నేరుగా పదనిలం చేరుకోవచ్చు.