Home తాజా వార్తలు వరించని రైతులు

వరించని రైతులు

Paddy farmers are awaiting a central decision on grain purchases

 

సాధారణంగా యాసంగిలో 24018 ఎకరాల్లోనే సాగయ్యే మినుము విస్తీర్ణం 53,391ఎకరాలకు చేరిక
ధాన్యం కొనుగోలుపై కేంద్ర నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న వరి రైతులు
గణనీయంగా పెరిగిన పప్పుధాన్యాల సాగు
2.70లక్షల ఎకరాల్లో వేరుశనగ, ఇప్పటికే 2.24లక్షల ఎకరాల్లో శనగ, కంది 1185 ఎ., పెసర 6398 ఎ., ఉలవ 703 ఎ., నువ్వులు 521 ఎ.
సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు యాసంగిలో రికార్డుస్థాయిలో వేస్తున్న ప్రత్యామ్నాయ పంటలు, 220శాతానికి చేరిన మినుము విస్తీర్ణం

మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగిలో వరిసాగు నత్తనడకన సాగుతోంది. అనురాధ కార్తె ప్రవేశంతో రాష్ట్రంలో యాసంగి పంటల సాగు ప్రారంభమైనా వరి సాగు విస్తీర్ణంలో ఏ విధమైన పురొగతి కనిపించటం లేదు. రాష్ట్రంలో యాసంగి పంటల సాధారణ విస్తీర్ణంలో వరిపైరు 31.01లక్షల ఎకరాల్లో సాగులోకి రావాల్సివుంది. కానీ రైతులు ఇప్పటి వరకూ వరిసాగు పనులను పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందా? లేదా? అనే అంశాలపై స్పష్టత వచ్చే వరకూ వరిని సాగు చేయవద్దని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన పిలుపు మేరకు రైతులు వరిని సాగు చేయకుండా వేచిచూస్తున్నారని అధికారవర్గాల సమాచారం. అదే విధంగా కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు కనుక ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ముఖ్యమంత్రి కే.సి.ఆర్. ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రైతాంగం రికార్డుస్థాయిలో మినుమును సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరిని పండించిన రైతాంగం వరిని కాకుండా మినుము పంటను సాగు చేయడానికి ఉపక్రమించారు.

సాధారణంగా యాసంగి సీజన్‌లో 24 వేల 18 ఎకరాల్లో మినుము పంటను సాగు చేస్తారు. కానీ సిఎం కెసిఆర్. ఇచ్చిన పిలుపును గౌరవించిన రైతాంగం రికార్డుస్థాయిలో 53 వేల 391 ఎకరాల్లో అంటే ఏకంగా 222 శాతం విస్తీర్ణంలో మినుము పంటను రైతాంగం సాగు చేశారని వ్యవసాయశాఖ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఎంత మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో ఆ మేరకు వరిని సాగు చేయాలా? వద్దా? అని తుది నిర్ణయం తీసుకొంటామని సిఎం చేసిన సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం, తెలంగాణ వరి రైతులు ఎదురు చూస్తున్నారు. ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాల్లో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్ర వరి రైతుల పట్ల ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందోనని ఉత్కంఠతతో రైతులు వరిని సాగు చేయకుండా ఎదురు చూస్తున్నారని వ్యవసాయశాఖాధికారులు అంటున్నారు.

సాధారణంగా యాసంగి సీజన్‌లో తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఏకంగా 31లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తారు. కానీ ఈ యాసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులు అవుతున్నప్పటికీ రైతులు వరినారు మళ్లపై దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదుల పరివాహకంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు చిన్న , మద్య తరహా ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండివున్నాయి. రాష్ట్రంలోని 44వేల చెరువులు యాసంగి ప్రారంభంలోనే పూర్తినీటి మట్టాలతో నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో వైపు భూగర్భ జలాలు సైతం అందుబాటులో ఉన్నాయి. యాసంగిలో వరిసాగుకు అన్ని విధాల అనుకూలత ఉన్నప్పటికీ ధాన్యం విక్రయాల్లో ఎదురవుతున్న మార్కెట్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పండించే ధాన్యం నిల్వలను పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే తప్ప వాటిని బహిరంగ మార్కెట్లో రైతులు అమ్మకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ నేపధ్యంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై కెసిఆర్ సర్కారు కేంద్రాన్ని ఒప్పించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లివచ్చారు. మంత్రి కేటిఆర్ నేతృత్వంలో వ్యవసాయ , పౌరసరఫరాల శాఖలకు చెందిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు కేంద్ర ఆహార వినియోగదారుల శాఖ మంత్రితో చర్చలు జరిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ని కూడా కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు పట్ల జరిగిన మొదటిదఫా చర్చల్లో పూర్తి స్పష్టత రాకపోవటంతో మరో మారు ఈనెల 26న చర్చించాలని నిర్ణయించారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేసేది తేలాకే రాష్ట్రంలో వరిసాగుపై స్పష్టత రానుంది.

ఊపందుకున్న ప్రత్యామ్నాయ పంటలు:
మరోవైపు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం ఊపందుకుంది. పప్పుధాన్య పంటల సాగు వేగంగా పెరుగుతూ వస్తోంది. యాసంగి సీజన్‌లో పప్పుధాన్యాల సాధారణ విస్తీర్ణం 3.45లక్షల ఎకరాలు కాగా ఈ సమయానికి 1.76లక్షల ఎకరాల్లో విత్తనాలు వేయాల్సివుంది. అయితే ఇప్పటికే 2.89లక్షల ఎకరాల విస్తీర్ణంలో పప్పుధాన్య పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ఇప్పటికే 2.24లక్షల ఎకరాల్లో శనగ విత్తనం పడింది. కంది 1185ఎకరాలు, పెసర 6398ఎకరాలు, మినుము 53391ఎకరాలు, ఉలవ 703ఎకరాలు సాగులోకి వచ్చాయి. మరోవైపు నూనెగింజ పంటల సాగులో కూడా వేగం పెరిగింది. వేరుశనగ ఇప్పటికే 2.70లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. నువ్వులు 521ఎకరాలు, పొద్దుతిరుగుడు 2536ఎకరాలు, కుసుమ 8043ఎకరాలు ఇతర నూనెగిజ పంటలు 6518ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. నూనెగింజ పంటల సాధారణ విస్తీర్ణంలో ఇప్పటికే 77శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. పప్పుదాన్యాలు , నూనెగింజ పంటలసాగుకు ఇంకా అదను ఉండటంతో ఈ పంటలసాగు ఈ సారి అంచనాలకు మించి సాగులోకి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.

Paddy farmers are awaiting a central decision on grain purchases