Home తాజా వార్తలు దళితబంధు ఎన్నికల పథకం కాదు

దళితబంధు ఎన్నికల పథకం కాదు

Padi kaushik reddy joined trs in presence of cm kcr

 

ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది
అయినప్పటికీ కొందరు సన్నాసులు ఎన్నికల స్టంట్‌గా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు
వారికి బిపి పెరుగుతోంది
దళితుల పేదరికాన్ని, వివక్షను అంతం చేయడానికే ఈ పథకం
ఇది హుజూరాబాద్‌కే పరిమితమైనది కాదు
దేశ చరిత్రలోనే ఈ పథకానికి ప్రత్యేక స్థానం లభిస్తుంది
టిఆర్‌ఎస్ రాజకీయ పార్టీ
రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ పథకాలు మామూలే : కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకున సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : దళిత బంధు పథకం ఎన్నికల కోసం తీసుకరాలేదని టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉందన్నారు. అయినప్పటికీ కొందరు సన్నాసులు దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్‌గా వ్యాఖ్యానిస్తుండడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎక్కడ చూసిన దళితులు నిరుపేదలుగానే కొనసాగుతున్నారన్నారు. పేదరికం కారణంగా వారు సామాజిక వివక్షను సైతం ఎదుర్కొంటున్నారని సిఎం పేర్కొన్నారు. దీనిని సమూలంగా నిర్మూలించాలన్న లక్షంతోనే రాష్ట్రంలోని దళితులకు చేయూతనందించేందుకు ప్రత్యేకంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దేశ చరిత్రలోనే ఈ పథకానికి ఒక ప్రత్యేక స్థానం లభించనుందన్నారు.

ఇది కేవలం ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికే మాత్రం పరిమితం కాదన్నారు. రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం చూసి కొందరికి బిపి పెరుగుతోందని ఆరోపించారు. అలాంటి నాయకుల ధ్యాసంతా ఓట్ల పైనేనని ఆయన విమర్శించారు. బరబర్ టిఆర్‌ఎస్ రాజకీయ పార్టీ అని, ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. దళిత బంధు కింద రూ.10లక్షల ఒట్టిగ పంచిపెట్టుడు కాదన్నారు. ఈ పథకంపై ఓంకర తింకర తిట్టేటోళ్లు చాలా మంది ఉంటారన్నరు. కెసిఆర్‌ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవ్వరిని తిట్టలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సిఎం కెసిఆర్ సమక్షంలో గులాబీ తీర్థం తీసుకున్నారు.బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను కెసిఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కౌశిక్‌రెడ్డికి ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్ ఉందన్నారు. ఆయనను ఎవడూ ఆపలేడన్నారు. ఆయన ఉన్నతికి తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు. తనకు ఎన్‌టిఆర్ అవకాశమిస్తేనే ఎంఎల్‌ఎ అయ్యాయనని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజకీయాలు సహజమని వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి తనకు చిరకాల మిత్రుడన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి తనకో కలిసి పని చేశారన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమాలు కొనసాగించామన్నారు. ప్రధానంగా ప్రొ.జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపించామని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. పోరాటి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కౌశిక్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారన్నారు. తెలంగాణ సాధన కోసం చాలా మంది పనిచేశారన్నారు. ఈ నేపథ్యంలో 1969లో జరిగిన ఉద్యమంలో సుమారు 400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. నాటి ఉద్యమానికి నేతృత్వం వహించిన మర్రి చెన్నారెడ్డి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఉద్యమాన్ని పతాక స్ధాయికి తీసుకెళ్లారని చెప్పారు.

అప్పట్లోనే చెన్నారెడ్డి 14 ఎంపి సీట్లలో 11 స్థానాలు గెలుచుకున్నారని తెలిపారు. అయినప్పటికీ అప్పటి నేతలు తెలంగాణను తీసుకరాలేకపోయారన్నారు. నాటి ఉద్యమం మలిదశలో జరిగిన తెలంగాణ పోరాటానికి చాలా నేర్పిందన్నారు. ఉద్యమ సమయంలో ఎంతో బాధ్యత, ఆవేదనతో పనిచేశామన్నారు. పిడికిలి మందితో తెలంగాణ వస్తదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడరన్నారు. చివరకు తన ముక్కుపై కూడా కొందరు ఎగతాళి చేశారన్నారు. ఇలా ఎన్నో రకాలుగా అవమానాలు ఎదురైనప్పటికీ ఎవరు వెనకడుగు వేయకుండా రాష్ట్ర సాధన కోసం చాలా మంది మహానీయులు పనిచేశారన్నారు. ఎంతో కష్టపడి తెలంగాణను సాధించామని,- ఎవ్వరూ అప్పనంగ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరిశ్ రావు, కొప్పుల ఈశ్వర్ , ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

ప్రతి పథకం వెనుక లోతైన విశ్లేషణ ఉంది
గొర్రెల పంపిణీ పథకం ఉత్తుత్తి స్కీం కాదని, ప్రతి పథకం వెనుక లోతైన విశ్లేషణ ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. గొర్రెల ఉత్పత్తి లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారన్నారు. తమకు కులం, మతం, జాతి లేదు.. పేదరిక నిర్ములన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి మనిషి చిరునవ్వుతో బ్రతకాలన్నదే తన ఆకాంక్ష అని సిఎం అన్నారు. ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు సగర్వంగా తాము హైదరాబాది అని చెప్పుకునే విధంగా పాలన అందిస్తామన్నారు. ఒకప్పుడు తెలంగాణ వాళ్లకు పాలన రాదని వెక్కిరించిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విస్మయానికి గురయ్యే విధంగా మెరుగైన పరిపాలనను అందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని ఆంధ్రావారిని హైదరాబాదీలు అని పిలవాలన్నారు. ఈ ఏడాది ఆంధ్రాలో పండిన వరి ఎంత.. తెలంగాణలో పండిందెంత అని ప్రశ్నించారు.అన్ని రకాల సంపద ఉన్న తెలంగాణ సమైక్య పాలకుల వల్ల నష్టపోయిందన్నారు.

గతంలో కరెంట్ లేక రైతులు బాయిలకాడ ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుబంధు లక్ష్యం నెరవేరిందని, దీంతో- రాష్ట్రంలో రైతులు ధీమాగా ఉన్నారన్నారు. జోలెడు ఒడ్లు తెచ్చుకునే రైతు-… ఇవ్వాళ చాటేడు ఒడ్లు తిరిగి ఇచ్చే స్థాయికి ఎదిగారన్నారు. అలాగే 2వేల 70 మెగా వాట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. కెసిఆర్ కిట్, ధరణి, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టమని తనను ఎవ్వరూ అడగలేదన్నారు. హరితహారం చెట్లకింద కెసిఆర్ ఒక్కడే కూర్చొడు కదా! అని వ్యాఖ్యానించారు. బొక్కడ కాడు- చెత్తగాళ్ళు మాట్లాడితే చెల్లుతాయా! అని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. గోకరకాయ- కాకరకాయ గాళ్ళు చాలా మాట్లాడుతున్నారని కెసిఆర్ తనదైన శైలిలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలను తీరుస్తున్నామని వివరించారు. తమ పనితీరుకు తగ్గట్లుగానే ప్రజలు అన్ని ఎన్నికల్లో గెలిపిస్తున్నారని అన్నారు.

మనది రాచరిక వ్యవస్థ కాదు
మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని సిఎం కెసిఆర్ అన్నారు. రాచరిక వ్యవస్థ మన దగ్గర పనిచేయదన్నారు. రాజకీయాలు ఎప్పుడు జరుగుతుంటాయి…ఇందులో గెలుపు ఓటములు చాలా సహజమన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని సిఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం చాలా కష్టపడి సాధించిన రాష్ట్రమన్నారు. ఎప్పుడు ఒకరే అధికారంలో ఉండరన్నారు.

ఎన్‌టిఆర్ అవకాశం ఇస్తే ఎంఎల్‌ఎ అయ్యాను
తనకు ఎన్‌టిఆర్ ఎన్టీఆర్ అవకాశం ఇస్తేనే తొలిసారిగా ఎంఎల్‌ఎ అయ్యానని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసనసభ్యుడిగా తనకు మొదటిసారి అసెంబ్లీలో 20 నిమిషాలు మాట్లాడే అవకాశం లభించిందన్నారు. అయితే తన వాగ్ధాటితో80 నిమిషాలు మాట్లాడనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన స్పీచ్ విని అప్పటి స్పీకర్ కౌగిలించుకున్నారని ఈ సందర్భంగా కెసిఆర్ పేర్కొన్నారు.

భవిష్యత్ యువతది
తెలంగాణ రాష్ట్రం యువతదేనని పేర్కొన్నారు. నవ తెలంగాణ నిర్మాణ బాధ్యత యువతదేనని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. సాలు వెనుక సాలు .. మేము పోతే మా తరువాత స్థానం మీరే కదా అని అన్నారు. అందువల్ల టిఆర్‌ఎస్ పార్టీని పటిష్టం చెయ్యలేసింది మీరే (యువతే) అని అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కోసం అందరూ కలిసి పని చెయ్యాలని పిలుపునిచ్చారు.

రాజకీయం చేయొద్దా మరి
ఎన్నికల కోసమే దళిత బంధు అని, దీనిని అధికార పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ రాజకీయ పార్టీ కాదా? రాజకీయ ప్రయోజనం ఉండొద్దా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తనకు రాజకీయ స్వార్థం ఉంటే దళిత బంధు పథకాన్ని గజ్వెల్ లో పెట్టేవాడినని అన్నారు. గతంలో రైతు మరణిస్తే రూ. 50 వేలు ఇచ్చే వాళ్లు అని అని… ఇప్పుడు రూ. 5 లక్షలు వస్తున్నాయన్నారు.

Padi kaushik reddy joined trs in presence of cm kcr