Home లైఫ్ స్టైల్ చేనేతకు ‘ఆసు’వు

చేనేతకు ‘ఆసు’వు

  • శ్రమ, సమయాలను ఆదా చేసిన మూడవ పద్మం

చేనేత వృత్తిలోకి మరో ‘పద్మశ్రీ’ వచ్చి చేరింది. గజం గోవర్థన, గజం అంజయ్యలకు చింతకింద మల్లేశం తోడయ్యాడు. టై అండ్ డై పద్ధతిని ‘తేలియారుమాల్’ వస్త్రానికి ఉపయోగించి సహజ రంగులతో సృష్టించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత గజం అంజయ్యదికాగా, ఇక్కత్ డిజైన్‌కి టై అండ్ డై పద్ధతిని ప్రవేశపెట్టి అద్బుతమైన చీరలకు రూపకల్పన చేసిన ఖ్యాతిని ఆర్జించిన వ్యక్తి గజం గోవర్థన. వీరిద్దరిది ‘కళాత్మక దృష్టి’ అయితే, ఈ కళాత్మక దృష్టికి ఆయువుపట్టు ‘ఆసు యంత్రం’. ఆధునిక ఆసు యంత్ర సృష్టికర్త చింతకింది మల్లేశం.

KTR-Handloomచీర తయారు కావడానికి రకరకాల పరికరాలు అవస రమవుతాయి. ప్రధానంగా మగ్గం, రాట్నం, కుంచె, అచ్చులు, ఆసు, పింజర, నాడ తదితరమైనవి. వీటి ద్వారా దారం తీయ డం, దారాన్ని కండెలకు చుట్టడం, లడీలు తయారుచేయడం, లడీలకు రంగులు అద్దడం, సరి చేయడం, ఆసు పోయడం, అచ్చు అతకడం తదితర ప్రక్రియలు ఉంటాయి. వీటి ద్వారా నే అనుకున్న డిజైన్‌ను వస్త్రం లేదా చీరలపై తీసుకువస్తారు. ఒకప్పుడు ఇవన్నీ కుటుంబ సభ్యులంతా పని విభజన చేసుకుని ముందుకు సాగేవారు. ‘ఆసు యంత్రం’ రావడంతో వస్త్రాల నేతపని కాలం చాలావరకు తగ్గింది.
పోచంపల్లి చీర తయారీలో ఆసు పోయడం ప్రధాన ప్రక్రియ. ఎడమవైపున నిలువునా ఒకదాని తర్వాత ఒకటిగా నలభై పిన్నులు అమర్చి ఉంటాయి. కుడివైపున ఒక పిన్ను ఉంటుంది. ఈ పిన్ను ఎడమవైపు ఉన్న పిన్నుల మధ్యన (అంటే ఇరవైయవ పిన్నుకు సమానంగా) అమర్చి ఉంటుం ది. ఈ ఎడమ, కుడి మధ్య దూరం సుమారుగా రెండు, మూడు గజాలు ఉంటుంది. ఒకరి పిన్ను నుంచి కుడివైపు పిన్నుకు, ఆతర్వాత రెండవ పిన్ను నుంచి కుడివైపు పిన్ను కు… ఇలా నలభై పిన్నులకు దారం పోయడమే ఆసు విధా నం. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని ఈ నలభై పిన్ను ల చుట్టూ తొమ్మిది వేలసార్లు (సుమారు 13 కిలోమీటర్లు) కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడివైపుకు తిప్పుతూ ఉండాలి. ఇలా రోజుకి 18 వేల సార్లు దారాన్ని పిన్నుల చుట్టూ తిప్పితేగానీ (సుమారు 25 కిలోమీటర్లు) రెండు చీర లు తయారుకావు. నేత ప్రక్రియలో ఇది చాలా శ్రమతో కూడు కున్నది. మెడ లాగుతూవుంటుంది. భుజాలు పట్టేస్తాయి. చేతివేళ్లు బిగుసుకుపోతుంటాయి. కంటిచూపు మందగిస్తుం ది. అదేపనిగా కూర్చోవడంతో శరీరమంతా మొద్దుబారుతుం ది. సాధారణంగా మహిళలే ఎక్కువ శాతం ఆసు పోస్తుంటా రు. తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక తన మేథస్సును రంగ రించి, అధునాతన సాంకేతిక ‘ఆసు యంత్రానికి’ రూపకల్పన చేశాడు చింతకింది మల్లేశం.
ఆసు తయారీలో అష్టకష్టాలు
Handloom-1ఆలోచనలకు పదునుపెడితే ఆవిష్కరణకు నాంది పలుకుతుం దని నమ్మిన మల్లేశం, సొంత ఊరు నుంచి హైదరాబాద్ పయనమయ్యాడు. తోటి కార్మికులు నిరుత్సాహపరిచినప్ప టికీ తల్లి కష్టం తలచుకునేటప్పుడు అది ఆవిరైపోయేది. తక్కు వ కెపాసిటీగల మోటార్లు, ఉడ్ ఫ్రేవ్‌ు తదితరమైనవాటితో ఏడేళ్లు కష్టపడి యంత్రానికి ఓ రూపం తెచ్చాడు. శారీరక శ్రమ లేకుండా ఓ చీరకు సరిపడ ఆసు పోసేలా రూపొందిం చాడు. దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశాడు. రోజు లో వంటపని చేసుకుంటూ వీలైనన్ని చీరలకు ఆసు పోసే అవకాశం కలిగింది. సమయం ఆదా కావడమే కాకుండా ఉత్పత్తి పెరిగింది. ఈ యంత్ర రూపకల్పన వెనుక పడిన శ్రమను గురించి మల్లేశం మాటల్లోనే విందాం…
“ఆసు పోసి పోసి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. వేరే ఏదైనా ఉద్యోగం చూసుకొమ్మని అమ్మ చెప్పినప్పుడు నా మనసు కలత చెందింది. చదువు పది వరకే. సాంకేతిక పరిజ్ఞానం లేదు. మగ్గం నేయడం తప్ప వేరే ఉద్యోగం చేసే పరిస్థితులు లేవు. ఆలోచనల్లో పడ్డాను. అమ్మ ఆసు పోసే విధానాన్ని దగ్గరగా పరీక్షించి చూశాను. ఆసు పోయడంలో ప్రధానంగా ఐదు విభాగాలను గుర్తించాను. చేతుల కదలిక లు, దారపు పోగుల కౌంట్, పిన్ను నుంచి పిన్నుకు దారం మారడం వంటివి. ఈ క్రమంలో తొలుత కర్ర మంచంను ఫ్రేవ్‌ుగా ఎంచుకున్నాను. ఈ ఐదు విభాగాలను పూర్తి చేయడానికి అవసరమైన విడిభాగాలను సమకూర్చుకోవడం, ఇవి అమరనప్పుడు, మరో ఆలోచన ప్రకారం మరోరకమైన పరికరాలను సమకూర్చుకోవడం జరిగేది. ఈ పరికరాలను కొనుగోలు చేయడంలో అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. సాంకేతిక నిపుణులు చేయవలసిన పని నీతో ఎలా సాధ్యపడుతుందని చాలామంది ఎద్దేవా చేశారు. అయినప్ప టికీ నా పట్టుదల సడలలేదు. విపరీతమైన అప్పులు చేసి మూడు విభాగాలను సంతృప్తికరంగా పూర్తిచేశాను. అమ్మ కలవరపడుతుంది. ప్రయత్నాన్ని విరమించుకొమ్మని కోరిం ది. పెళ్లి చేసేస్తే సంసారంలో పడి ఈ ప్రయత్నాన్ని మానేస్తాడ న్న ఇరుగుపొరుగు తలంపుతో పెళ్లి చేశారు. ఆసు యంత్ర తయారీకి ఓ ఏడాది విరామమిచ్చాను. భార్యను వొప్పించి, ఆమె పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బులను తీసేసుకున్నాను. ఈ డబ్బులు కూడా ఖర్చయినప్పటికీ పని పూర్తికాలేదు. ఈసారి వొత్తిడులు అత్తగారింటి నుంచి మొదలయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగాన్వేషణలో భాగంగా హైదరాబాద్ రామంతాపూర్‌లోని ఓ మిత్రుడి ఇంటికి చేరుకున్నాను. ఓ ఎలక్ట్రికల్ షాపులో రోజువారీ పనిని కుదుర్చు కున్నాను. మూడు నెలల తర్వాత ఇంటికి వెళ్ళి, అసంపూర్తిగా మిగిలివు న్న యంత్రాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చాను. సాయం త్రం కాగానే ఈ పని మీదే కూర్చుండేవాడిని. నాలుగ వ భాగాన్ని పూర్తి చేశా ను. చివరి భాగం అత్యం త క్లిష్టంగా మారింది. ఊహకు అందిన ట్టే అంది చేజారిపోయేది. మళ్ళీ డబ్బులు వృధా అవుతున్నాయి. ఒకరోజు అనుకోకుండా మా సారు పని నిమిత్తం బాలాన గర్‌లోని ఓ ఫ్యాక్టరీకి నన్ను తీసుకుపోయాడు. అక్కడ ఉన్న కొత్త మిషి న్లకు విద్యుత్ సరఫరా చేసి వాటి పనితీరును పరీక్షిస్తున్నారు. వెంటనే నా యంత్రం మదిలో మెదిలింది. మూడు గంట లపాటు వాటిని గమనిం చాక యంత్రానికి కావలసిన సాంకేతిక ఆలోచన దొరికింది. వెంటనే కాగితంపై స్కెచ్ వేసుకుని ఇంటికి వచ్చాను. ఆసు యంత్రానికి సాంకేతిక పరికరాలను అమర్చి, దారం పెట్టి చూశాను. అంతే దారం పిన్నులకు చుడుతున్నది. నా ఆనం దానికి అవధులు లేవు. ఏడేళ్ళ కష్టానికి ప్రతిఫలం లభించిం దన్న సంబురంతో వెంటనే ఆటోలో యంత్రాన్ని వేసుకుని ఊరికెళ్ళి చూపించాను. అయినప్పటికీ ఎవరూ నమ్మలేదు. దారం ఖరాబు అయి పోతదని భయపడ్డారు. నేనే దారం కొనుక్కొని, ఆసుపోసి, రంగులద్ది చీర నేయడానికి ఇచ్చాను. అప్పటికిగానీ ఊరి ప్రజలకు నమ్మకం కుదరలేదు. ప్రశంసలతో ముంచెత్తారు.
ఒక ఆసు యంత్రం తయారు కావడానికి పదమూడు వేల రూపాయల వ్యయమైంది. 2001 నుంచి 2005 వరకు ఈ యంత్రాలను తయారుచేసి ఇవ్వడం జరిగింది. 2005లో ముడి సరుకుల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో దీని తయారీ వ్యయం రూ.26 వేలకు పెరిగింది. ఓ మిత్రుడి సల హాతో ఎలక్ట్రానిక్ విడిభాగాలతో తయారుచేయడంపై దృష్టి సారించాను. రెండేళ్ల తర్వాత అదే రూ.13 వేల వ్యయం తో ఎలక్ట్రానిక్ ఆసు యంత్రానికి రూపకల్పన జరిగింది. ఇదీ ప్రశంసలందుకుంది. 2009లో నా ఆలోచనా పరిధి మరింత ముందుకు సాగింది. ఇప్పటివరకు ఈ యంత్రం వ్యక్తి చేసే పనిని పూర్తిచేసింది. అలాకాకుండా వ్యక్తి కంటే అదనంగా ఏ పనైనా చేయగలదా అనే వైపు ఆలోచనలు పరుగెత్తాయి. దా రాలను ఆసు పోయడమే కాకుండా ఎప్పటికప్పుడు చీరలపై కొత్త డిజైన్ల రూపకల్పనలో యంత్రం ఉపయోగపడాలన్న సృజనాత్మక ఆలో చనతో ముందుకు సాగాను. మైక్రోకంట్రో లర్స్ విధానం ద్వారా రాబట్టవచ్చని తెలిసింది. వెంటనే దీనిపై అధ్యయనం చేశాను. అసెంబ్లీ లాంగ్వేజిలో ప్రోగ్రామింగ్ రాసుకుని కొత్త కొత్త డిజైన్లను తయారుచేస్తున్నాను. ఇక వెనుది రిగి చూడలేదు” అంటూ ఆర్ద్రత కలగలసిన ఆనందం తో వివరించాడు మల్లేశం.
Handloom-2సామాన్యుడి ముందు సాగిలబడ్డ అవార్డులు
చింతకింది మల్లేశం యాదా ద్రి జిల్లా ఆలేరు మండలం శారా జీపేట గ్రామానికి చెందిన సామాన్య చేనే త కుటుంబంలో 1972 మే 10న జన్మించాడు. లక్ష్మి, లక్ష్మీనారాయణ దంప తులకు పుట్టిన అతను, అతి కష్టం మీద పదవత రగతి పూర్తిచేశాడు. ఆసు పోయడంలో తల్లి పడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక ఆధునిక ఆసు యంత్రం తయారీకి పూనుకున్నాడు. సువర్ణతో పెళ్లి తర్వా త, ఇదే కష్టం తన భార్యకు రాకూడదన్న తపనతో మరింత పట్టుదలతో ఈ కార్యాన్ని పూర్తిచేశాడు.
ఆసియాలోనే గొప్ప ఆసు యంత్రంగా గుర్తింపు పొందిం ది. సామాన్యుడికి ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందాయి. అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ కొనియాడింది. 2009లో ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ర్టపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ‘గ్రామీణ సాంకేతిక ఆవిష్కరణ, సంప్రదాయ పరిజ్ఞాన పరిశోధన’ పేరిట అవార్డు అందుకున్నాడు. తల్లి స్ఫూర్తితో ఈ యంత్రం తయారుకాబడటంతో దీనికి తల్లి పేరుతో ‘లక్ష్మిఆసు యంత్రంగా’ 2010లో పేటెంట్ హక్కు చేజిక్కించుకున్నాడు. అదే ఏడాది ఫోర్బ్ జాబితాలో మల్లేశం పేరు నమోదైంది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్‌వేర్ జతచేస్తామని ఆమెరికా సంస్థ ముందుకు వచ్చింది. అహ్మదా బాద్‌లో అబ్దుల్‌కలాం ఆసు యంత్రాన్ని చూసి అబ్బురప డ్డాడు. ఎంతో ఇష్టంతో పదినిమిషాలు మల్లేశంతో కాఫీ తాగుతూ గడిపి యంత్రానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. నాబార్డు తదితర సంస్థల అవార్డులు అందుకున్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ‘అమెజాన్’ అవార్డును అందుకున్నాడు.
మార్చి 13, 2016లో రాష్ర్టపతి భవన్‌లో అతిధిగా 15 రోజులపాటు గడపడం విశేషం. వీలైనన్ని చేనేత కుటుంబాల కు ‘లక్ష్మి ఆసు యంత్రం’ను అందించడం లక్ష్యంగా మల్లేశం ముందుకు సాగుతున్నాడు. బెంగుళూరుకు చెందిన ఫ్యూయ ల్ ఏ డ్రీవ్‌ు సంస్థ అతడి లక్ష్యానికి అండగా నిలిచింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నాలుగు లక్షలు సేకరించి మల్లేశంకు అందజేసింది. ఈ మొత్తంతో చేనేత కుటుంబాలకు ఈ యంత్రాలను అందజేశాడు.
ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి చేనేత కష్టాలు తీర్చడమే తన లక్ష్యంగా ఎంచుకున్నాడు. తల్లి కోసం పడ్డ తపన ఇప్పుడు పోచంపల్లి చేనేత కార్మికుల కన్నీళ్లను తుడు స్తోంది. తల్లి భుజం కోసం పడిన శ్రమ, ఆసుపోసే భుజాలకు ఆసరాగా నిలిచింది.

Kodam pavankumar

– కోడం పవన్‌కుమార్
9848 992 825