Home నల్లగొండ కలెక్టరేట్‌కు కొత్త ‘వన్నె’

కలెక్టరేట్‌కు కొత్త ‘వన్నె’

పెయింట్ పనులను పరిశీలించిన జెసి
నాణ్యత లోపిస్తే చర్యలు
దగ్గర ఉండి పెయింట్‌ను చేయించిన వైనం

Collectorate

మన తెలంగాణ / నీలగిరి : ఏళ్ళ తరబడి ఎండకు ఎండి వానకు తడుస్తు పెచ్చులూడుతున్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పేయింట్ వేయించి వన్నె తీసుకొచ్చేందుకు స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ఆయన స్వయంగా దగ్గరుండి పనులను చేయించి కలెక్టర్ కార్యాలయానికే కాకుండా ఆయన చేసే విధులకే వన్నె తీసుకొచ్చారు.

గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులు కాంట్రాక్టర్‌కు పని అప్పగించి అధికారుల ద్వారా పనులను పర్యవేక్షించేవారు. పనుల్లో కొంత మేర నాణ్యత లోపించిందన్న ఆరోపణలు ఉన్నందున ఆ విషయాలను దృష్టిలో వుంచుకొని పనుల్లో నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ భవనానికి పెయింట్ వేసే పనులను పరిశీలించడం గమనార్హం.  జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మరమ్మత్తులు చేయించేందుకు అవసరమైన నిధులను అంచనా వేయిస్తున్నారు.

కలెక్టరేట్ ముఖద్వారం వద్ద గోడలు పెచ్చులూడుతుండటాన్ని గుర్తించిన ఆయన పెయింట్ వేయించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సోమవారం పెయింట్‌ను కలెక్టర్ చాంబర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న పనులను జిల్లా జాయింట్ కలెక్టర్  స్వయంగా పరిశీలించారు. సుమారు రెండు గంటల పాటు అక్కడే వుండి పనులు చేసే విధానాన్ని గమనించారు. పెయింట్‌కు ఉపయోగించే సమాగ్రి నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి నూతన శోభను తీసుకొచ్చేందుకు స్వయంగా జాయింట్ కలెక్టర్ దగ్గరుండి పనులను పరిశీలించడం నూతన అధ్యాయం. కాంట్రాక్టర్ నిర్వహించే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.