Home అంతర్జాతీయ వార్తలు కుల్‌భూషణ్ కేసులో ముగ్గురు న్యాయ సహాయకుల నియామకం

కుల్‌భూషణ్ కేసులో ముగ్గురు న్యాయ సహాయకుల నియామకం

Pak court appoints 3 senior lawyers as amici curiae

 

విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం

ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో న్యాయ సహాయకులుగా(అమికస్ క్యూరీ) ముగ్గురు సీనియర్ న్యాయవాదులను ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం నియమించింది. గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన పాకిస్తాన్ సైనిక కోర్టు 2017 ఏప్రిల్‌లో 50 ఏళ్ల జాదవ్‌కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా, జాదవ్‌కు మరణశిక్ష విధించడాన్ని, ఆయన తరఫున న్యాయవాది వాదించే అవకాశాన్ని కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసిజె) ఆశ్రయించగా 2019జులైలో ఐసిజె ఇచ్చిన ఆదేశాల మేరకు ఇస్లామాబాద్ హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టింది.

జాదవ్‌కు వాదించుకునే అవకాశాన్ని మరోసారి కల్పించాలని టీవల పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సోమవారం సీనియర్ న్యాయవాదులు ఆబిద్ హసన్ మాంటో, హమీద్ ఖాన్, మఖ్దూమ్ అలీ ఖాన్‌లను న్యాయ సహాయకులుగా(అమికస్ క్యూరీ) నియమించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలలో వీరు కోర్టుకు న్యాయ సహాయం అందచేస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు సక్రమంగా అమలు జరిగేందుకు వీరు హైకోర్టుకు తోడ్పడతారు. ఈ కేసు విచారణ కోసం ఒక విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు కూడా హైకోర్టు ఆదేశించింది. విస్తృత ధర్మాసనం ముందు సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసు విచారణ చేపట్టాలని కోర్టు రిజిస్ట్రార్‌కు చీఫ్ జస్టిస్ అత్తర్ మినాల్లా, జస్టిస్ మియాన్‌గుల్ హసన్ ఔరంగజేబ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

Pak court appoints 3 senior lawyers as amici curiae