Home అంతర్జాతీయ వార్తలు పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం

Pak International Airlines plane crashes in Karachi

 

60 మంది దుర్మరణం
కరాచీ శివార్లలో ల్యాండింగ్ ముందు ఘోరం

కరాచీ : పాకిస్థాన్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 107 మందితో బయలుదేరిన ఈ విమానం స్థానిక జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉండే రద్దీగా ఉండే నివాసిత ప్రాంతంలో కుప్పకూలింది.

ఈ సంఘటనలో 60 మంది మృతి చెందినట్లు తొలివార్తలు తెలిపాయి. అయితే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాహోర్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన పిఐఎ ఎయిర్‌బస్ ఎ 320 విమానం మరికాసేపట్లో కరాచీ విమానాశ్రయంలో దిగుతుందనగా జిన్నా గార్డెన్ వద్ద కుప్పకూలిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందే ఘటన జరిగింది. విమానంలో 99 మంది ప్రయాణికులు, ఎనమండుగురు విమాన సిబ్బంది ఉన్నారు. కరాచీ పరిసరాలలోని మలీర్‌లో మాడెల్ కాలనీ వద్దనే పలు ఇళ్లపై విమానం పడిందని వెల్లడైంది. ఎంత మంది చనిపోయి ఉంటారనేది పూర్తిస్థాయిలో వెంటనే నిర్థారణ కాలేదు. అయితే 34 మృతదేహాలను ఆసుపత్రికి తరంచినట్లు సింధ్ ఆరోగ్య మంత్రి అజ్రా పెచూచో తెలిపారు.

విమాన శిథిలాల కింద తొలుత ముగ్గురిని సజీవంగా వెలికితీశారు. వారిని చికిత్సకు ఆసుపత్రులకు తరలించారు. మృతులు విమాన ప్రయాణికులా? లేక కాలనీ వారా అనేది వెల్లడికాలేదు. ఈ విమానం తొలుత మొబైల్ టవర్‌ను ఢికొందని, తరువాత కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షి షకీల్ అహ్మద్ తెలిపారు. పౌర విమానయాన మంత్రి గులాం సర్వర్ మాట్లాడుతూ విమాన ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందన్నారు, విమానం ముందు భాగం బాగా దెబ్బతిందని, వెనుక భాగంలోని ప్రయాణికులు ముప్పు నుంచి గట్టెక్కే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టినట్లు, ప్రమాదం జరిగిన వెంటనే ఆ కాలనీ పరిసరాలలో పెద్ద ఎత్తున జనం గుమికూడారు.

ఓ వైపు కరోనా వైరస్ కట్టడి ఉన్నసమయంలో ప్రజలు ఎక్కువగా గుమికూడటంతో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు కష్టపడాల్సి వచ్చింది. బాధితులను కాపాడటం తక్షణ కర్తవ్యం అని , అయితే ఇరుకు సందులు ఉండటం, ప్రజలు గుమికూడటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు. ఈ విమానంలోనే బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జఫర్ మసూద్ కూడా ఉన్నట్లు , ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డట్లు వెల్లడైంది. కరోనా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో వారం రోజుల క్రితమే దేశంలో ప్రధాన నగరాల మధ్య విమాన సర్వీసులను పరిమిత సంఖ్యలో నిర్వహిస్తున్నారు.

ఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం
విమాన ప్రమాదంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. కరాచీ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడం బాధాకరం అన్నారు, ఘటనపై తక్షణ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రెసిడెంట్ అరిఫ్ అల్వీ, పాకిస్థాన్ సైనికదళాల ప్రధానాధికారి ఖ్వామర్ .జావెద్ బజ్వా దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. విమానం కూలడంతో కాలనీలో పలు కార్లు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అసలు విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే అంశంపై పాకిస్థాన్ అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడంతో దీనిపై అయోమయం నెలకొంది.

Pakistan International Airlines plane crashes in Karachi