Home జాతీయ వార్తలు పుల్వామా పాపం మా పనే

పుల్వామా పాపం మా పనే

Pak minister admits country role in JK terrorist attack

 

అది మా నాయకుడు ఇమ్రాన్‌ఖాన్ సాధించిన ఘనవిజయం
40 మంది జవాన్లను బలిగొన్న ఘటనపై పాక్ పార్లమెంట్‌లో మంత్రి ఫవద్ చౌధురి ప్రకటన
అభినందన్ ఘటనతో మా ఆర్మీ జనరల్ వణికిపోయారు
భారత్ ప్రతీకార దాడి దారుణంగా ఉంటుందని వింగ్ కమాండర్‌ను విడిచిపెట్టమన్నారు
పాక్ విపక్షనేత సర్ధార్ సాదిక్

ఇస్లామాబాద్ /న్యూఢిల్లీ : పుల్వామాలో భారతీయ జవాన్లపై ఉగ్రదాడి వెనుక తమ దేశం ఉందని పాకిస్థాన్ మంత్రి అంగీకరించారు. గత ఏడాది కశ్మీర్‌లో సిఆర్‌పిఎఫ్ జవాన్ల శకటాన్ని లక్షంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు బలి అయ్యారు. ‘ అవును ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉంది. వారి ఇంట్లోకి చొరబడి దెబ్బతీశాం. హిందూస్థాన్‌కో హమ్ గుస్కే మారా’ అని పాకిస్థాన్ పార్లమెంట్‌లో దేశ శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫవద్ చౌధురీ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తమ నాయకుడు ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలో పాకిస్థాన్ ప్రజలు సాధించిన ఘన విజయం అని కూడా దేశ జాతీయ అసెంబ్లీలో చౌధురీ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి తమ ఇమ్రాన్ సర్కారుకు ఘన విజయం అని తేల్చిచెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో కానీ భారత్‌లో ఇతరచోట్ల కానీ జరిగిన ఎటువంటి దాడులతో తమకు సంబంధం లేదని, పుల్వామా దాడి గురించి తమకు తెలియదని అంతర్జాతీయంగా కూడా పాకిస్థాన్ తన వాదన విన్పిస్తూ వచ్చింది.

దీనికి భిన్నంగా పాకిస్థాన్ కీలక కేబినెట్ మంత్రి పుల్వామా దాడిని సమర్థించడం, పైగా ఇది తమ పనే అని చెప్పడం, పైగా పాకిస్థాన్‌కు ఇది ఘన విజయం అని ప్రకటించడం కీలక పరిణామంగా మారింది. భారత్‌ను వారి ఇంట్లోచొరబడి కొట్టామని కూడా వ్యాఖ్యానించారు. పుల్వామా ఘటన సాధారణ విషయం కాదని, ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో గొప్ప విజయం అని తేల్చిచెప్పారు. దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్షం అయిన పిఎంఎల్ నవాజ్ పార్టీ నేత సాధిక్ ఇమ్రాన్ ప్రభుత్వానికి భారత్ అంటే వణుకు అని విమర్శించిన తరువాతి క్రమంలో ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ మంత్రి ఈ పుల్వామా దాడి తమ వీరోచిత చర్య అని ఘనత చాటుకున్నారు.

ఎన్‌ఐఎ చార్జీషీట్‌ను కాదన్న పాక్
పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పుల్వామా దాడికి దిగిందని, దీని వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ కీలక పాత్ర ఉందని పుల్వామా ఘటనపై భారత్‌కు చెందిన దర్యాప్తు సంస్థ నియా ఛార్జీషీట్ దాఖలు చేసింది. అయితే ఉగ్రదాడులతో సంబంధం లేదని చెపుతూ వచ్చిన పాకిస్థాన్ ఇటీవలి ఈ నియా ఛార్జీషీట్‌ను కూడా ఖండించింది. తమ దేశ పాత్ర అధికారిక సంస్థల ద్వారా కానీ ఇతరత్రా కానీ లేనేలేదని తేల్చిచెప్పింది. దురుద్ధేశపూరితంగానే పాకిస్థాన్‌ను నిందించేందుకు ఈ విధంగా యత్నిస్తోందని కూడా పేర్కొంది. అయితే ఇప్పుడు పాకిస్థాన్ మంత్రి దీనికి భిన్నంగా స్పందించారు. అంతా పాకిస్థాన్ పనే అని తేల్చిచెప్పారు.

Pak Minister admits Islamabad role in Pulwama terror attack